కాంగ్రెస్ కి ఓట్లడిగే అర్హత లేదా...? అప్పుడు పెద్దమ్మ అన్నారు కదా చిన్నమ్మా..!!
, శనివారం, 26 ఏప్రియల్ 2014 (15:07 IST)
పార్లమెంటు తలుపులు వేసి, టీవీ ప్రత్యక్ష ప్రసారాలను ఆపివేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలుచెక్కలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి సహకరించిన భాజపా ప్రతిపక్ష నాయకురాలు సుష్మాస్వరాజ్ తెలంగాణ పర్యటనలో కొత్త మాటలు చెపుతున్నారు. అవేంటయా అంటే, తెలంగాణ తామే ఇచ్చామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి అలా చెప్పుకునే హక్కు లేదని తేల్చి చెపుతున్నారు. మరి తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందగానే పెద్దమ్మ సోనియా గాంధీనే కాదు... చిన్నమ్మ సుష్మాస్వరాజ్ ను కూడా గుర్తు పెట్టుకోండి తెలంగాణ ప్రజలు అన్నారు కదా. ఇప్పుడిలా ట్విస్టులు ఇస్తున్నారేంటి...? అనుకోకండి. ఎందుకంటే ఇదంతా రాజకీయం. రాజకీయాల్లో నిన్న చెప్పిన మాట ఇవాళ చెప్పకపోవచ్చు. మొన్న ఇచ్చిన హామీ అధికారంలోకి వచ్చాక తీర్చకపోవచ్చు. రాజకీయం అంటే అంతేలే... రాజకీయ నాయకుల మాటలు ఇంతేలే... ఇంతకీ చిన్నమ్మ ఇలా మాట్లాడింది మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీజేపీ బహిరంగసభలో.