ఈ దీపావళినాడు మీలో ఉన్న కారుమబ్బుల్ని తొలగించండి - సద్గురు
, మంగళవారం, 25 అక్టోబరు 2011 (19:10 IST)
ఒకానొకప్పుడు భారత సాంప్రదాయంలో, ఈ భూమిపై ప్రతీరోజును ఒక పండుగగా జరుపుకునేవారు. ఆ లెక్కన 365 రోజులూ పండు దినాలే! జీవితాన్ని ఒక వేడుకగా జరుపుకోవడమే దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం! అలా ఏదో ఒక దారిన పోతూనో లేదా కార్యాలయాలకి వెళ్ళేటప్పుడో వేడుకలు చేసుకోలేం కదా? అందుకే ఈ పండగలొచ్చాయి. జీవితాన్ని ఒక ఉత్సవంలా.. ఆనందంగా జరుపుకోడానికి ఈ పండుగలు ఒక కారణం/ సాకు.. అంతే! దీపావళి జరుపుకోవడానికి కారణం.. ఈ పండుగ మన జీవితాల్లో ఒక కొత్త మెరుపు.. కొత్త ఉత్సాహాన్ని తీసుకుని వస్తుందనే. అందుకే టపాకాయలు కాలుస్తాం.. అలాగైనా .. మనలో కొంత అగ్ని రాజుకుంటుందని! ఏదో ఈ ఒక్క రోజూ టపాకాయలు కాలిస్తే సరిపోదు మరి. మీ జీవితంలో ప్రతిరోజూ.. దీపావళిలాగే ఉండాలి. అంటే మీరు ఇలా కూర్చుని ఉండగానే మీ శరీరం మీ శక్తీ మీ హృదయం మీ మనస్సూ ఒక విస్ఫోటనంలా కాంతులూ శక్తీ వెదజల్లాలి! మీరు నిస్సత్తువగా మందకొడిగా నిట్టూర్చుతూ ఉంటే సహజంగానే మీకు 'చిచ్చు' పెట్టడానికి బైటనుండి ఒక కాకరపువ్వొత్తి అంటించాలి.. తప్పదు. అప్పుడే శక్తియుక్తులు ఉత్సాహంతో తన్నుక వస్తాయి. కాంతులు విరజిమ్మే పండుగ దీపావళి. ఈ రోజున ప్రతీ పల్లె, ఊరూ.. మాహానగరం కాంతిపుంజాల్లా ఉంటాయి. దేదీప్యమానంగా వేలకొద్దీ దీపాల అలంకరణతో కళ్ళు మిరమిట్లు గొలుపుతాయి. కానీ ఇంటి బైట దీపాలను వెలిగించడమే కాదు. మన లోపలి వెలుతురుని కూడా అదేవిధంగా వెలికి తీసుకుని రావాలి. వెలుతురు అంటే స్పష్టత. ఈ స్పష్టత లేని పక్షంలో మీలోని గుణాలూ.. లక్షణాలూ.. అన్నీ కూడా లాభం కంటే నష్టాన్నే ఎక్కువ తెచ్చిపెడతాయి. ఎందుకంటే స్పష్టత లేని ఆత్మ విశ్వాసం అపాయకరమైనది/ ఒక విపత్తు లాంటిది. ఇవాళా రేపూ అన్నీ పనులూ ఇలాగే స్పష్టత లేకుండా నిర్వహించబడుతున్నాయి.. ఒకరోజు కొత్తగా ఉద్యోగంలో చేరిన ఒక పోలీసు మంచి అనుభగ్నుడైన అతని మిత్రుడూ కలిసి బండి నడుపుతూ ఊళ్లోకి వెళ్లారు. అప్పుడే వారికి రేడియో ద్వారా ఒక కబురు వచ్చింది. ఊళ్ళో ఎక్కడో ఒకచోట జనాలు గుమికూడి ఉన్నారు. వారిని అక్కడి నుండి వెంటనే పంపించేయాలి అని. సరే.. వాళ్ళిద్దరూ వెంటనే ఆ వీధిని వెతుక్కుంటూ వెళ్లి మూలకు జేరిన ఒక గుంపుని పసిగట్టారు. వారివైపు బండిని పోనిచ్చి. అద్దం కిందకి లాగి మన కొత్త పోలీసు హడావిడిగా ఎంతో ఉత్సాహంగా, అధికార హోదాతో మీకే చెపుతున్నాను... 'మీరందరూ వెంటనే ఇక్కడినించి పరారవ్వండి..' అన్నాడు.
దాంతో వారు విస్తుపోయి.. ఏమిటది అన్నట్లు అతనివైపు అర్థంకానట్లు చూసారు. అతను మళ్ళీ గర్జించాడు 'చెపుతున్నది మీకే.. వినబడటంలేదా? వెంటనే ఈ మూల నుండి కదిలిపొండి' అన్నాడు. వారు భయంతో చెల్లాచెదరయ్యారు.. ఇది చూసి మన పొలీసు అమితంగా ఆనందించి ఉద్యోగంలో తాను చేసిన మొట్టమొదటి ఘనకార్యానికి పొంగిపోతూ మిత్రుణ్ణి అడిగాడు. 'నా పని బాగా నిర్వహించానా? అని... 'అయ్యో అలా అడుగుతావేం? బ్రహ్మాండంగా చేసావు. కాకపోతే నువ్వు వారిని తరిమేసింది బస్స్టాపు నుండి... అని! అందుకే అంటున్నాను. స్పష్టత లేకుండా ఏ పని చేసినా అది విపత్తే అవుతుంది. వెలుతురు ఎప్పుడూ కూడా స్పష్టతని తెస్తుంది. ఇది కేవలం బాహ్యానికే వర్తిస్తుంది అని అనుకోవద్దు. మీ చుట్టూ ఉన్న వాటిని ఎంత పరికించి చూస్తారో... మీ అవగాహనను ఎలా పెంపొందించుకుంటారో.. మీ జీవితాన్ని మీరు అంతే చక్కగా, వివేకంతో జీవిస్తారు. దీపావళిరోజు నాడు.. చెడు అనే చీకటి వధింపబడి... వెలుతురు ఉద్భవించింది... ఇప్పటి మానవ జీవితాన్ని ఆవహించిన సంకటం కూడా ఇదే.. సూర్య కాంతిని కప్పేసిన నల్లమబ్బు లాగా... మనిషి తేజస్సుని... ఈ అంధకారం పూర్తిగా ముసుగు వేసేసింది. మనిషి వెలుతురిని ఎక్కడనుండో తీసుకురావక్కరలేదు. తనలో పేరుకుపోయిన ఈ కారుమబ్బుల్ని తొలగిస్తే చాలు. జ్యోతి అదే ప్రకాశిస్తుంది. ఇది గుర్తు చేయడానికే ఈ దీపాల పండగ, దీపావళి! -
సద్గురు, ఈషా ఫౌండేషన్