దీపావళికి ముందు రోజును నరకచతుర్దశిగా పిలుస్తారు. అంతకుముందు రోజును కొందరు ధనత్రయోదశిగా ఆచరిస్తారు. అమావాస్యకు తర్వాత రోజును బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే.. ఈ బలి పాడ్యమి. బలిచక్రవర్తిని మించిన దానశూరులుండరు.
వజ్ర, వైఢూర్యాలు, మణిమాణిక్యాలు తదితర వస్తువులను దానమివ్వడం కాక, తన్ను తానే శత్రువుకు దానం ఇచ్చుకున్న వితరణ శీలి బలిచక్రవర్తి. బలిని, ఆయన భార్య విద్యావతిని పూజించే సంప్రదాయం కూడ వుంది.
కేరళలో బలిచక్రవర్తి తమను పరిపాలించాడని నమ్మి, వారు తమ జాతీయ పర్వమైన ఓనంను బలి ప్రీత్యర్ధం జరుపుకుంటారు. ఉత్తరంలో దీపావళి ఐదు రోజుల పండుగ. దక్షిణంలో దీపావళి మూడునాళ్ల పండుగ. దీపావళి రోజున దీపాలు వెలిగించడం ద్వారా అపమృత్యువు దోషాలు తొలగిపోతాయి. అలాగే అమావాస్య, చతుర్దశి రోజుల్లో ప్రదోషసమయాన దీపదానాన్ని చేస్తే, మానవుడు యమమార్గాధికారంనుండి విముక్తుడవుతారని విశ్వాసం.
దీపోత్సవ చతుర్దశి రోజున యమతర్పణం చేయాలని శాస్త్రాలు చెప్తున్నాయి. హేమాద్రి అనే పండితుడు ఈ దీపోత్సవాన్ని "కౌముదీమహోత్సవం" అని నిర్వచించినట్లుగాను, నరకచతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి, దీపదానం చేయాలని చెప్పినట్లు పురాణాలు చెప్తున్నాయి.