Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దీపావళి నాడు లక్ష్మీపూజ చేస్తే ఫలితం ఏంటి?

దీపావళి నాడు లక్ష్మీపూజ చేస్తే ఫలితం ఏంటి?
, మంగళవారం, 21 అక్టోబరు 2014 (13:59 IST)
"దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |
దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప న్నమోస్తుతే ||"
ఈ జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా, మనోవికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు. అందుచేత దీపావళి రోజున జ్యోతి స్వరూపమైన మహాలక్ష్మిని పూజిస్తే అప్పులు తీరడం, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.
 
కాబట్టి దీపావళి నాడు ఐదు గంటలకు నిద్రలేచి, శుచిగా స్నానమాచరించి తెలుపు దుస్తులను ధరించాలి. పూజామందిరమును, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమ, గుమ్మానికి తోరణాలు, పూజామందిరములో ముగ్గులు పెట్టుకోవాలి. 
 
పూజకోసం ఉపయోగించుకునే పటములకు గంధము, కుంకుమతో అలంకరించుకోవాలి. పూజమందిరములో కలశముపై తెలుపు వస్త్రమును కప్పాలి. ఆకుపచ్చని రంగు పట్టుచీరను ధరించిన కూర్చుకున్న లక్ష్మీదేవి బొమ్మను లేదా పటాన్ని పూజకు సిద్ధం చేసుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్ర పద్మములు, తెల్ల కలువపువ్వులు, గులాబిపువ్వులు.. నైవేద్యానికి కేసరీబాత్, రవ్వలడ్డులు, జామకాయలు సిద్ధం చేసుకోవాలి.
 
పూజకు ముందు శ్రీ లక్ష్మీ అష్టోత్తరము, శ్రీ మహాలక్ష్మీ అష్టకం, కనకధారాస్తవము, శ్రీ సూక్తము, శ్రీ లక్ష్మీ సహస్రనామములతో లక్ష్మీదేవిని స్తుతించాలి. లేదా.. "ఓం మహాలక్ష్మీ దేవ్యై నమః" అనే మంత్రాన్ని 108 మార్లు జపించాలి. పూజా సమయంలో తామర మాల ధరించి, ఈశాన్య దిక్కున తిరిగి చేయాలి. 
 
దీపావళి నాడు సాయంత్రం ఆరు గంటలకు పూజ చేయాలి. దీపారాధనకు వెండి దీపాలు, తామరవత్తులు, ఆవునెయ్యి, నువ్వులనూనె ఉపయోగించాలి. నైవేద్యము సమర్పించి పంచహారతులివ్వాలి. అలాగే దీపావళి రోజున అష్టలక్ష్మీదేవాలయం, కొల్హపూర్, విశాఖ కనకమహాలక్ష్మీదేవి ఆలయాలను సందర్శించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. 
 
దేవాలయాల్లో కుంకుమపూజ, శ్రీ లక్ష్మీ అష్టోత్తర నామ పూజ, వైభవలక్ష్మీ, లక్ష్మీ కుబేర వత్రము, శ్రీ మహాలక్ష్మికి 108 కలువపువ్వులతో పూజ చేయించేవారికి ఈతిబాధలు తొలిగిపోయి.. సమస్త సంపదలు, వంశాభివృద్ధి వంటి శుభ ఫలితాలుంటాయి. 
 
ఇంకా దీపావళి రోజున ఏ ఇంటి యందు దీపాలు సమృద్ధిగా వెలుగుతాయో.. ఆ ఇంట మహాలక్ష్మీ ప్రవేశిస్తుందని పండితులు చెబుతున్నారు. అటువంటి పుణ్య దిన సాయంసంధ్య కాలమందు లక్ష్మీ స్వరూపమైన తులసీ కోట ముందు తొలుత దీపాలు వెలిగించి.. శ్రీ మహాలక్ష్మీ అష్టోత్తర శతనామాలతో పూజ చేసి 
 
"చతుర్భుజాం చంద్రరూపా మిందిరా మిందు శీతలామ్
ఆహ్లాద జననీం పుష్టిం శివాం శివకరీం సతీమ్ ||"
అని ధ్యానించి.. తులసీ పూజానంతరం గృహమంతా దీపాలంకృతం చేయడం వల్ల మహాలక్ష్మి కాలిఅందియలు ఘల్లుఘల్లుమని ఆ గృహంలో నివాసముంటుందని విశ్వాసం. మరి అందరికీ దీపావళి శుభాకాంక్షలు..!

Share this Story:

Follow Webdunia telugu