Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరెరె... ఆ బుడ్డోడు దీపావళి బాంబు పెట్టేశాడు... అందుకే ఇవి చూడండి...

Advertiesment
అరెరె... ఆ బుడ్డోడు దీపావళి బాంబు పెట్టేశాడు... అందుకే ఇవి చూడండి...
, శుక్రవారం, 13 నవంబరు 2020 (19:55 IST)
దీపావళి పండుగ రోజున పిల్లలు బాణాసంచాను కాల్చేందుకు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వస్తుంటారు. ఐతే కొంతమంది పిల్లల విషయంలో అజాగ్రత్తగా ఉండటంతో ప్రమాదాల బారిన పడుతుంటారు పిల్లలు. అందువల్ల కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకొంటే ఆనందాల హరివిల్లుగా దీపావళిని ఎంజాయ్ చేయవచ్చు.
 
మీ దీపావళి సరంజామాను కాల్చేందుకు సిద్ధమయ్యారా...
 
* ఎలాంటి అగ్ని ప్రమాదం సంభవించినా వెంటనే మంటలను అదుపు చేసేందుకు బకెట్‌లతో నిండుగా నీళ్ళు పక్కన పెట్టుకోండి. 
 
*నిప్పు రవ్వలు ఒంటిపైని దుస్తులపై పడితే అవి త్వరగా వ్యాపించకుండా ఉండేందుకు పిల్లలతో పాటు పెద్దలు కూడా కాటన్‌ దుస్తులనే (పాలిస్టర్‌ కాకుండా) ధరించడం మంచిది. 
 
* ధరించిన దుస్తులపై పడిన నిప్పురవ్వలు మరింత రాజుకొని మంటలు వ్యాపిస్తే వెంటనే ఒంటిపై దుప్పట్లు లేదా రగ్గులను కప్పి మంటలను నిరోధించవచ్చు. దుప్పట్లు కప్పడం వల్ల నిప్పుకు ఆక్సిజన్‌ అందక పైకి వ్యాపించదు. 
 
* ఒక వేళ ఇంటి పక్కన ఉన్న ఏ గుడిసె పైనో నిప్పులు పడి ప్రమాదం పెద్దదయ్యే సూచనలు కనబడితే తక్షణం ఫైర్‌ సర్వీసెస్‌కు ఫోను చేసేందుకు ఆ సంస్థ టెలిఫోన్‌ నెంబరు గుర్తుపెట్టుకోండి.
 
* నిప్పురవ్వలు పడి చిన్నచిన్న గాయాలు ఏర్పడినా సెప్టిక్‌ కాకుండా నిరోధించేందుకు బర్నాల్‌, దూది, టించర్‌, డెట్టాల్‌ తదితరాలతో కూడిన ఫస్ట్ ఎయిడ్‌ కిట్‌ సిద్ధం చేసుకోండి. ప్రాధమిక వైద్యం చేసిన… తరువాత కొంత ఉపశమనం పొందినప్పటికీ తప్పక వైద్యుని వద్దకు వెళ్ళి పూర్తి చికిత్స చేయించుకోవడం ముఖ్యం.
 
* పిల్లల దీపావళి సామగ్రిని కాల్చేటప్పుడు పెద్దలు పక్కనే ఉండటం అత్యంత శ్రేయస్కరం.
 
* బాంబులను ఎవరు కాల్చినా పసిబిడ్డలు, పిల్లల చెవుల్లో దూది పెట్టడం మరచిపోవద్దు. లేతగా ఉండే వారి కర్ణభేరి చిన్న చిన్న శబ్దాలకు సైతం ఎక్కువగా స్పందిస్తుంది. 
 
* విడి బాంబులు లేదా సీరియల్‌గా ఉండే సీమటపాసులను కొంచెం దూరంగా ఉంచి కాల్చడం మంచిది. వీటిని కాల్చేటప్పుడు వచ్చి పోయే వారిని గమనించండి. అత్యంత ముఖ్యంగా థౌజండ్‌ వాలా, 10 థౌజండ్‌ వాలా సీరీస్‌ను కాల్చేటప్పుడు జనం లేకుండా చూసుకొని, పక్కవారికి చెప్పి కాల్చండి. అలాగే 
వీటిని రేకు డబ్బాల్లో కాల్చడం ద్వారా శబ్ద కాలుష్యం సృషించవద్దు. 
 
* పిల్లల చేతికి రాకెట్‌, తారాజువ్వ తరహా వస్తువులను ఇవ్వకపోవడమే మేలు. పెద్దలు మాత్రం వీటిని గుడిసెలకు దూరంగా ఉండే ప్రాంతాన్ని ఎంచుకొని కాల్చడం మంచిది. అదే విధంగా వీటిని కొంచెం రాత్రి అయిన తరువాత, జనసమ్మర్ధం తగ్గాక కాల్చుకోవటం మేలు.
 
* అలాగే భూ చక్రాలను కాల్చేటప్పుడు పాదరక్షలను ధరించడం మరచి పోవద్దు. ఆ సమయంలో పాకే పసికందులను నేలపై దించవద్దు.
 
* మీ దీపావళి సామగ్రికి సమీపంలో కొవ్వొత్తులను, అగరు వత్తులను ఉంచవద్దు. 
 
* వెలిగి పేలకుండానే ఆరిపోయిన చిచ్చుబుడ్లు లేదా బాంబుల వద్దకు వెళ్ళి పరిశీలించడం, మళ్ళీ వెలిగించే ప్రయత్నం చేయడం అత్యంత ప్రమాదకరం. 
 
* చల్లదనం కోసం ఇంటి ముందు లేదా మేడపైన తాటాకులు, గడ్డితో వేసుకున్న కప్పులపై నీళ్లు చల్లి ఉంచుకోవడం మరచిపోవద్దు. 
 
* వాహనాలపై కవర్లు వేసి ఉంచండి. పండుగ సమయంలో మీ వాహనాలను వీలైనంత వరకూ ఇంటి లోపలే ఉంచేలా చర్యలు తీసుకోండి. 
 
* ప్రభుత్వం నిర్దేశించిన సమయంలోనే మీ దీపావళి టపాసులను కాల్చడం పూర్తి చేసుకోండి. 
 
* గొప్పతనం కోసం ఎక్కువగా టపాసులను కొనుక్కొని వాయుకాలుష్యానికి చేరువ కావద్దు. 
 
* అత్యుత్సాహంతో పెద్దపెద్ద టపాసులను కాల్చడం వల్ల శబ్ద, వాయు కాలుష్యం అధికమై అది పర్యావరణం చేటుకు దారి తీస్తుందన్న విషయం మరచి పోవద్దు. 
 
* పెద్ద పెద్ద టపాసులు కాల్చే ముందు వాటి ప్యాక్‌లపై ముద్రించి ఉండే సూచనలను పాటించడం ద్వారా ఆనందమయ దీపావళిని జరుపుకోవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దీపావళి పండుగ ఎలా వచ్చిందో తెలుసా..?