చేతులు జాగ్రత్త: వెంకటేష్
, బుధవారం, 7 నవంబరు 2007 (20:37 IST)
మిగతా పండుగలకు అంత హడావుడి కన్పించకపోయినా దీపావళి పండుగకు చిన్నా పెద్దా హడావుడి కన్పిస్తుంది. గృహిణులను పలుకరిస్తే... ఇల్లు సర్దుకోవాలి.. బూజులు దులిపి.. ఇల్లు కడిగి ముగ్గులు పెట్టాలి. పిండి వంటల తతంగం ఉండనే ఉంది...అనే మాటలు వినిపిస్తాయి. ఇక పిల్లలయితే....వారం ముందుగానే టపాసులు కాలుస్తూ ఆనందం పొందుతారు. వ్యాపారస్థులు తప్పనిసరిగా లక్ష్మీపూజ చేస్తారు. బాణాసంచా కాల్చి ఆ రోజు రాత్రి స్వీట్లు తింటారు. ఇవన్నీ సామాన్యులకనుకుంటే పొరపాటే... పెద్ద హోదాలో ఉన్న వారైనా జరుపుకునేది ఒకే పండుగ దీపావళి.సినిమా వారికి ఇది మరింత ప్రియమైన పండుగ. అందుకే చాలామంది కవులు దీపావళిని కెరీర్‌కు పోలుస్తూ సాహిత్యం కూడా రాశారు. "వెన్నెలరోజు ఈ వెన్నెల రోజు.. అమావాస్యకు వచ్చే పౌర్ణమి రోజు..." జీవితం క్షణికమని చిచ్చుబుడ్డి చెబుతుంది. అందరికంటే మంచిగా ఎదగాలని తారాజువ్వ చెబుతుంది. నిప్పుతో చెలగాటమాడవద్దని టపాకాయ చెబుతోంది.... అంటూ ఓ కవి ఎప్పుడో రాశారు. అందుకే టపాసులు పేల్చేటప్పుడు చాలా జాగ్రత్తదా ఉండాలి సుమా! అంటూ పలువురు నటీనటులు చెబుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే అమెరికన్ ప్రభుత్వం కూడా దీపావళిని గుర్తించి అక్కడ సెలవు ప్రకటించడం ఈ ఏడాది విశేషం. చేతులు జాగ్రత్త: వెంకటేష్
నేను ఎక్కువగా చేసుకునేది దీపావళి పండుగే. ఆరవ తరగతిలో ఉండగా మద్రాసులో స్నేహితులతో కలిసి ఆడుకునే రోజులు గుర్తుకు వస్తాయి. అక్కడ దగ్గరలోని గ్రౌండ్‌లోకి వెళ్ళి టపాసులు కాల్చే వాళ్ళం. పండుగ వారం ముందే మాకు హడావుడి ఉండేది. కొత్త వస్త్రాలు కొనుక్కోవడం.. ఆ రోజు కట్టుకోవడం... ఇది చాలా సరదాగా సాగింది. టపాసులు కాలుస్తున్నప్పుడే ఓ సారి నా ఎడమచేయిమీద పడింది. అది చాలాకాలం మచ్చగా మిగిలిపోయింది. (ఇదిగో అంటూ ఎడమచేయిను మణికట్టు దగ్గర చూపారు). అందుకే పిల్లలు టపాసులు కాల్చేటప్పుడు జాగ్రత్తగా కాల్చండి. సిల్క్ వస్త్రాలను ధరించకండి. అంటూ.. జాగ్రత్తలు చెప్పారు.