ఆకాశంలో తారల్లా నిత్యం మీ జీవితాల్లో వెలుగులు విరజిమ్మే నిత్య నూతన పండుగ దీపావళి. ఆత్మాయ బంధాలు చిరకాలం చెక్కుచెదరక అలానే నిలవాలని ఆకాంక్షిస్తూ.. దీపావళి పండగ రోజున స్నేహితులు, బంధువులు ఒకరికొకరు స్వీట్లు ఇచ్చిపుచ్చుకుని నోరును తీపిచేసుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం.
ఈ పండుగ అటు దేశ ప్రజలతో పాటు.. వ్యాపారులకు పెద్దపండగే. మారుతున్న సంప్రదాయ పద్దతులకు అనుగుణంగా.. దీపావళి స్వీట్ల రుచుల్లోను కొత్తరకాలు వచ్చాయి. ఈ దీపావళికి నగరంలోని పేరుమోసిన మిఠాయి దుకాణాలు.. పాలతో చేసిన స్వీట్లతో పాటు.. ఎండు ఫలాల రుచులను కూడా నగరవాసులకు అందించనున్నాయి.
ఈ రంగురంగుల దీపావళికి దివాలీ స్పెషల్ బేసన్, డ్రైఫ్రూట్స్, లడ్డు, మైసూర్‌పాక్‌తో పాటు.. కాజు తేజ్‌పురి, రాజస్థానీ, గుజరాతీ, పన్నీర్ జిలేబీ, బాదాంబర్ఫీ, డబుల్ మాజాలు నగరవాసులకు సిద్ధంగా ఉన్నాయి. అంతేకాకుండా.. చక్కెర వ్యాధి గ్రస్తుల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన షుగర్ ఫ్రీ స్వీట్లు నోరూరిస్తున్నాయి.
ప్రత్యేక ప్యాక్‌లలో దీపావళి స్వీట్లు...
సాధారణంగా దీపావళి పర్వదినాన మార్వాడీలు, వ్యాపారులు తమ స్నేహితులు, బంధువులను కలిసి బహుముతులు ఇచ్చుపుచ్చుకోవడం ఆనవాయితి. ఇందుకోసం అందమైన గిఫ్ట్ ప్యాకుల్లో స్వీట్లు ఉంచి బహుకరిస్తుంటారు. అయితే.. ఈ దీపావళికి అందమైన ధనపేటికల నమూనాల్లో తీర్చిదిద్దారు.
సంప్రదాయానికి, ఆధ్యాత్మికకు పెద్దపీట వేస్తూ.. ఆధునిక డిజైన్లలో తయారైన బాక్సులు స్వీట్ల ప్యాకెంగి కోసం ఎదురుచూస్తున్నాయి. వీటితో పాటు. ఆధునిక హంగులతో తీర్చిదిద్దిన గిఫ్ట్‌ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి.