Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మా మావ...ముషారఫ్

మా మావ...ముషారఫ్
, మంగళవారం, 6 నవంబరు 2007 (13:31 IST)
FileFILE
డేగ చూపులు...
చెంపలు నెరిసిన జుట్టు...
అవతలివాడి జేబులో ఏముందో ఇట్టే చెప్పగల గుంట నక్క తెలివితేటలు...
తనకు పనికి వచ్చేది ఏదయినా అవతలి వాళ్ళ దగ్గర నుంచి ఎలా కొట్టేద్దామా అని ఎప్పుడూ ఆలోచిస్తుండే మా మావను చూస్తే పీకలదాకా కోపం వస్తుంది.
మా మావను తీసుకెళ్ళి పాకిస్థాన్, ఆఘ్ఘనిస్థాన్ సరిహద్దులలో పడేసి వద్దామన్న ఆవేశం నాకు వస్తుంది.
ఆ పనే చేద్దామంటే...
అమ్మో ఇంకేమన్నా ఉందా...
మా ఆవిడ అగ్గి మీద గుగ్గిలం అయిపోదు...
కాదు కూడదంటే తల మీద కుండెడు కన్నీళ్ళతో నన్ను కరిగించేస్తుందాయే...

ముషారఫ్ లాంటి మా మావను ఈ దీపావళికి మా ఇంటికి రమ్మనాను..
వింతగా ఉంది కదూ..
దానికీ ఒక కారణం ఉంది. పోయినసారి దసరా పండుగకని అత్తగారింటికి వెళ్ళాను. మా మావతో నేను పడుతున్న కష్టాలను చెప్పుకుందామని ఇంజనీరింగ్ చదువుతున్న మా బావమరిదిని కొత్తపట్నం సముద్రానికి వెళదామని అడిగాను. నాతో గొడవ ఎందుకులే అనుకున్నాడో ఏమో వెంటనే బండి తీశాడు. దారిలో వాడి కాలేజీ సోదంతా వినాల్సి వచ్చింది. అంతటితో ఆగలేదు. వాడి బండి చమురు కోసం నా చేతి చమురు వదిలించాడు.
ఎదురుగా సముద్రం...
చల్లగాలి... చేపల వలను ఒళ్ళంతా చుట్టుకున్న నాటు పడవలు... ఇసుకతో ఆడుకుంటున్న పిల్లలు..
"రారా ఇక్కడ కూర్చుందాం"
నా పక్కనే వచ్చి కూర్చున్నాడు మా బావమరిది.
"మీ ఇంటికి అల్లుడిని నేనా? మీ నాన్నా?" అడిగాను సీరియస్‌‌గా...
"అదేంటి బావా నువ్వే కదా?"
"మరి పండుగకు మమ్మల్ని పిలిచిన మీ నాన్న, అదే పనిగా ఆయనకు మాచేత పండుగ బట్టలు తెప్పించుకోవడం న్యాయంగా ఉందా?"
"అదికాదు బావా. పాపం ఈ మధ్యనే మా నాన్న మావగారు అదే మా తాతయ్య కాలం చేయడంతో... నీ ద్వారా అల్లుని మర్యాదలు చేయించుకోవాలని ఆయన ఆశపడి ఉంటాడు."
"మరి పోయిన పండుగకు కూడా ఇలాగే జరిగింది కదా?" గట్టిగా అడిగాను.
బావమరిది సైలంటైపోయాడు.
"అలాగైతే బావా ఒక పనిచేయి".
ఏంటన్నట్టు చూశాను వాడి వైపు.
"ఈసారి పండుగకు మీరు రావొద్దు... నాన్ననే అక్కడకు పంపిస్తాం..."
ఇదేదో బాగుందే... సరే... అలాగే కానిద్దాం....
నా సమస్య తీరిపోయిందనమో ఒక్కసారిగా వర్షం పడటం ప్రారంభించింది...
ఇద్దరం దగ్గరలో ఉన్న కాకా హోటల్‌లోకి దూరాం.
అలా మా ముషారఫ్ మావ దీపావళి పండుగకు అల్లుడినైన నా ఇంటికి వచ్చాడు.

"ఏమండి? ఒక్కరే కూర్చుని ఏం చేస్తున్నారు?"
ఆలోచనల్లోంచి బయటపడి వెనక్కి తిరిగి చూసాను.
ముందు మా శ్రీమతి
ఆమె వెనుకగా నుంచుని మా ముషారఫ్ మావ...
ఒక చేతిలో చిచ్బుబుడ్లు మరో చేతిలో లక్ష్మీ బాంబు
అదే వంకర నవ్వు...
అదే డేగచూపు...
కొంపదీసి మా ఇంట్లో ఎమర్జెన్సీ పెట్టడు కదా?!
నా చొక్కా జేబులోకి తన ఎక్స్‌రే చూపులు వదిలాడు.
"ఏంటమ్మా... అల్లుడుగారు అలవాటుగా జేబులో పర్సు పెట్టుకోవడం మర్చిపోయినట్లున్నారే?"
మా ఆవిడతో అంటున్నాడు.
పరిగెత్తుకుంటూ రూంలోకి వెళ్ళి చూసాను.
హమ్మయ్య... టేబుల్ మీద పర్సు కనిపించింది.
అనుమానం వచ్చి పర్సు తెరిచి చూసాను.
అనుకున్నంతా అయ్యింది.
పర్సులో డబ్బులు మాయం.
బయటకు వచ్చి చూస్తే ఇద్దరు కనపడలేదు.
మేడ మీదకు వెళ్ళాను.
మా మావ టపాసులు కాలుస్తూ కనిపించాడు.
పక్కనే డబ్బా నిండా టపాసులు, స్వీట్ బాక్సు
మరో పక్క మా ఆవిడ పక్కింటి పంకజంతో మాట్లాడుతూ కనిపించింది.
నన్ను చూసి పంకజం కిందకు వెళ్ళిపోయింది.
"నా పర్సులో డబ్బులు నువ్వు తీసావా?"
"అయ్యో చెప్పడం మరిచానండి... ఇందాక టపాసులు కొందామని వెళ్తూ మీ పర్సులో డబ్బులు తీసుకెళ్ళాను".
నా గుండె కడుపులోకి జారిపోయింది.
రెండు వేల రూపాయలు...
మావ మాయం చేసాడు.
ఏదన్నా అందామంటే తలమీద కన్నీళ్ళ కుండతో రెడీ అయిపోయే మా ఆవిడ.
ఏం చేస్తాం... ఈసారికి ఇలా కానిచ్చేస్తే సరి...
పండుగ అయిపోయింది.

webdunia
WD PhotoWD
ముషారఫ్ మావా ఊరికెళ్లేలా లేడు...
అదేం వింతో గానీ మా మావ చూపు పడగానే నా పర్సులో డబ్బులు రెక్కలొచ్చినట్లుగా ఎగిరిపోతున్నాయి.
"మీ నాన్న కదిలేలా లేడే?"
ఉండబట్టలేక మా ఆవిడను అడిగేసాను.
అంతే అంతెత్తున ఎగిరిపడింది. నరకాసురునికి మీదకు వెళ్ళిన సత్యభామలా...
"ఎందుకండీ మావాళ్ళంటే అంత అలుసు మీకు... రాక రాక మనింటికి మా నాన్న వస్తే మీరిలాగేనా మాట్లాడేది?
మన పెళ్ళయ్యి ఇన్నేళ్ళవుతుంది. మీవాళ్ళు వస్తే ఏనాడైనా నేను ఇలా మాట్లాడానా?"
మాటలు బాకుల్లా గుచ్చుకున్నాయి. నాలుక పెగల్లేదు. నోట మాట రాలేదు. డంగైపోయి మంచం మీదకు చేరాను.
మర్నాడు ఆఫీసు నుంచి ఇంటికి రాగానే మా మావ నాకు ఎదురు పడ్డాడు.
శకునం బాగలేదనిపించింది.
అరగంటకు వంటింట్లో నుంచి మా ఆవిడ విసురుగా వచ్చి నా చేతికి కాఫీ కప్పు ఇచ్చింది.
"నేను విన్నది నిజమేనా?
గొంతులోకి జారబోతున్న కాఫీ అక్కడే ఆగిపోయింది.
ఊపిరి ఆగినట్లనిపించి కాఫీని గుట్టుకుమనిపించేశాను.
"ఏం విన్నావు?"
"ఎప్పట్నుంచి ఉంది మీకీ పాడలవాటు?"
"ఏ అలవాటు?"
"నా మంగళసూత్రం గట్టిది కాబట్టి మా నాన్న కనిపెట్టాడు"
నీళ్ళకుండ డ్యూటీలోకి దిగింది. నా కొంప ముంచే పనేదో మా మావ చేసాడు.
"నా మీద ఒట్టేసి చెప్పండి. ఆ అలవాటు మానుకుంటానని.."
నా టెన్షన్‌లో నేనుంటే మధ్యలో ఈ గొడవేంటి.
"ఏ అలవాటు?"
కోపాన్ని కంట్రల్ చేసుకుంటూ అడిగాను.
"నా నోటితో చెప్పించాలని చూస్తున్నారా?"
నా కోపం నసాళానికి అంటింది.
"అబ్బబ్బ ఏంది నీ గొడవ?"
"మాన్తారా లేదా?"
"ఏంటి మానేది?"
నేనూ గొంతు పెంచి అడుగుతూ చుట్టూ చూసాను.
మావ దగ్గర్లో లేడు.
"మీరు సిగరెట్లు తాగుతున్నారు కదూ?"
అమ్మ.. మావ... అందుకేనా ఇందాక నేను లోపలికి వస్తుంటే నన్ను తాకుతూ వెళ్ళావు
మొత్తానికి నేను సిగరెట్లు తాగకుండా నా చేత ఒట్టు వేయించుకుంది నా శ్రీమతి.
అంతటితో ఊరుకోలేదు మా ముషారఫ్ మావ...
నా ప్రాథమిక హక్కుల్లో భాగమైన మందు కొట్టే అలవాటును ఇదే పద్ధతిలో దూరం చేసాడు.
పేకాటకని తీసుకువెళ్ళే మా ఫ్రెండ్స్ మా మావ ప్రతాపానికి నా దగ్గరకు రావడం మానేసారు.
నా బతుకులో అత్యవసర పరిస్థితిని విధించాడు మా మావ...
మా ఆవిడ నుంచి మంచి మార్కులు కొట్టేసి మా ఇంట్లోనే తిష్ట వేసాడు.
ఒక రోజు కళ్ళు తిరుగుతున్నాయని మా ఆవిడతో అంటే...
నాకు బీపీయో షుగరో వచ్చిందని ఉప్పు కారం తినకుండా చేసాడు.
ఇంతకు మించిన ఎమర్జెన్సీ పాకిస్థాన్‌లో కూడా ఉండదేమో?!
ఇప్పుడు చెప్పండి....
మా మావను ముషారఫ్‌తో పోల్చడం తప్పంటారా?
మనలో మన మాట.. మా మావతో చెప్పకండి... నేను ఇలా అడిగానని...
మరో మాట...
"దయచేసి మా మావను మా ఇంట్లోంచి పంపించే మార్గం ఏదైనా ఉంటే చెప్పరూ?!"

Share this Story:

Follow Webdunia telugu