ద్వాపర యుగంలోనే స్త్రీల శక్తి సామర్థ్యాలను లోకానికి చాటి చెప్పిన మహిళాశిరోమణి సత్యభామ. కావ్యనాయికగా, శ్రీకృష్ణుని ఇష్టసఖిగా, అహంకారానికి నిలువెత్తు చిరునామాగా సత్యభామను ప్రస్తావించే రచనలు అనేకం వెలువడ్డాయి. అంతే కాకుండా రుక్మిణి కన్నా మిన్నగా కృష్ణ ప్రేమను, సాహచర్యాన్ని పొందేందుకు తపించే సామాన్య మహిళగా కూడా పేర్కొన్న కథలు కోకోల్లలు.
అయితే ఆమెను మహిళల సమస్యల పట్ల స్పందించే స్త్రీ మూర్తిగా కొనియాడిన రచనలను వేళ్ళ మీద మాత్రమే లెక్కించవచ్చు. ఈ నేపథ్యంలో మహిళాసాధికారితకు సత్యభామ తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.
నరకరాసుర సంహారంలో సత్యభామ పోషించిన పాత్ర జగద్వితమైంది. ప్రాగ్జోతిష్పురానికి రాజు నరకాసురుడు. భూదేవికి కుమారుడు నరకాసురుడు.
స్వర్గాధిపతి ఇంద్రుని జయించిన అనంతరం దేవతల మాత అదితి కర్ణాభరణాలను స్వాధీనం చేసుకుంటాడు నరకాసురుడు. అంతేకాక దేవతలు, మహర్షుల 16,000 మంది పుత్రికలను చెరసాల పాలు చేస్తాడు. తన తల్లి చేతిలోనే మరణం పొందాలని బ్రహ్మదేవుని నుంచి వరాన్ని పొందిన నరకాసురుని అకృత్యాలతో సర్వలోకాలు తల్లడిల్లిపోతుంటాయి. సత్రాజిత్తు మహారాజు కుమార్తె సత్యభామ. శ్యమంతక మణి వృత్తాంతంలో శ్రీకృష్ణుడు సత్యభామను వివాహమాడుతాడు.
అంతేకాక భూదేవి అంశతో జన్మించిన సత్యభామ, నరకాసురునికి వరుసకు తల్లి అవుతుంది. తనకు బంధువైన దేవమాత అదితిని నరకాసురుడు అవమానించాడని తెలుసుకున్న సత్యభామ ఆగ్రహం చెందుతుంది. మహిళల పట్ల నరకాసురుని వైఖరికి ఆమె కోపాద్రిక్తురాలువుతుంది. నరకాసురుని సంహరించేందుకు సమయం ఆసన్నమైందని శ్రీకృష్ణునికి తెలుపుతుంది. నరకాసురునిపై సత్యభామ సాగించతలపెట్టిన సమరానికి నందగోపాలుడు సంపూర్ణ అంగీకారం తెలుపుతాడు.
అంతేకాక తన వాహనమైన గరుత్మంతుని వాహనంగా చేసుకోమని సత్యభామను కోరుతాడు. ప్రియభామతో కలిసి ప్రాగ్జోతిష్పురానికి పయనమవుతాడు. నరకాసురుని యుద్ధకళా ప్రావీణ్యం ముందు సత్యభామ నెగ్గుకురాలేకపోతుంది. అదేసమయంలో నరకాసురుడు సంధించిన అస్త్ర ప్రభావానికి శ్రీకృష్ణుడు స్పృహ కోల్పోతాడు.
దీంతో ఆగ్రహించిన సత్యభామ, భూదేవిగా తనకు ప్రసాదితమైన అస్త్రంతో నరకాసురుని సంహరిస్తుంది. 16,000 మంది కన్యలను చెరసాల నుంచి విడిపిస్తుంది. వారిని శ్రీకృష్ణుడు వివాహమాడుతాడు. భూదేవి అంశతో జన్మించిన సత్యభామ నరకాసురుని తుదముట్టించిడం ద్వారా చెడు మార్గంలో పయనించే పిల్లలను, తల్లిదండ్రులు ఎలాంటి సంకోచానికి గురికాకుండా తగురీతిన శిక్షించాలనే నీతిని ప్రబోధించినట్లయ్యింది.