బాబు వ్యూహాలను పవన్ తట్టుకోగలడా? జనసేన తీరం దాటలేని తుఫానా...?
రాష్ట్ర రాజకీయాలలో జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రభావంపై చర్చలు, విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. తనకున్న సినీ ఆకర్షణతో 1983 సంవత్సరంలో ఎన్.టి.రామారావులా 2019 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తారని అభిమానులు వా
రాష్ట్ర రాజకీయాలలో జనసేన నేత పవన్ కళ్యాణ్ ప్రభావంపై చర్చలు, విశ్లేషణలు జోరుగా సాగుతున్నాయి. తనకున్న సినీ ఆకర్షణతో 1983 సంవత్సరంలో ఎన్.టి.రామారావులా 2019 ఎన్నికల్లో ప్రభంజనం సృష్టిస్తారని అభిమానులు వాదిస్తున్నారు. ప్రత్యర్థులు మాత్రం 2009లో ప్రజారాజ్యం మాదిరిగానే జనసేన తీరం దాటని తుఫానులా మిగిలిపోతుందంటున్నారు.
అయితే రాష్ట్ర రాజకీయ పార్టీలలో వస్తున్న మార్పులు, కొత్త పొత్తులు, ఎత్తుగడలను పరిశీలించిన వారికి విభిన్నకోణాలు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రభంజనం సృష్టించలేకపోయినా ప్రభావిత శక్తిగా ఆవిర్భవిస్తారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జనసేన సేవాదళ్ నేతల నియామకం, తాను అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించడం లాంటి అంశాలు రాజకీయ వర్గాలలో చలనం తీసుకువచ్చాయి.
వచ్చే ఎన్నికల్లో తాము పవన్ కళ్యాణ్‌తో కలిసి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని కమ్యూనిస్టులు ప్రకటించడంతో ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ పరిణామాలను పరిశీలిస్తే 2019 ఎన్నికల నాటికి జనసేన కూటమి తృతీయ శక్తిగా నిలబడుతుందనడంలో మాత్రం సందేహం లేదు. అయితే తృతీయ శక్తి అధికారంలోకి వస్తుందా లేక ఇతర పార్టీలకు దాతగా మారుతుందా అన్న అంశం భవిష్యత్తు పరిణామాలపై ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తున్న కులాల పునరేకీకరణ అన్ని పార్టీల భవిష్యత్తు ఆధారపడి ఉంది.
అయితే రాజకీయాల్లో ఎత్తులకు పైఎత్తులు వేయడంలో చంద్రబాబుకు మించిన వ్యక్తి లేరన్నది అందరికీ తెలిసిందే. రాజకీయాల్లో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగల సమర్ధుడు బాబు. ఈ విషయాన్ని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. అలాంటి చంద్రబాబు ఎత్తుల ముందు పవన్ తట్టుకోగలడా అని రాజకీయ విశ్లేషకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గతంలో టిడిపి విజయానికి సహకరించిన పవన్ ఆ తరువాత సొంతంగా పార్టీ పెట్టడం.. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ఇవన్నీ జరిగిపోతున్నాయి. జరుగుతున్న పరిస్థితులను బాబు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నాడు. రానున్న ఎన్నికల్లో ఏ వ్యూహంతో ముందుకు వెళ్ళాలన్న నిర్ణయం కూడా ఇప్పటికే బాబు తీసేసుకున్నారట. ఈ నేపధ్యంలో చంద్రబాబు నాయుడు వ్యూహం ముందు జనసేన పార్టీ తీరం దాటలేని ఓ తుఫానుగా మారిపోతుందని అంటున్నారు. మరి పులిలా గాండ్రిస్తున్న పవన్ కళ్యాణ్ జనసేనను తీరం దాటిస్తారో... లేదంటే తీరం లోపలే గిరికీలు కొడుతుంటారో వేచి చూడాల్సిందే.