ఆంధ్రపదేశ్ స్వరూపం మారబోతుందా అంటే అవుననే సమాధానం రాబోతుంది. 13 జిల్లాలు కాస్తా.. 25 జిల్లాలు కాబోతున్నాయా..? అవుతాయి. కానీ ఇప్పుడే కాదు. వచ్చే సంవత్సరంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం దృష్టి పెట్టే అవకాశం ఉంది. 13 జిల్లాలతో కూడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భవిష్యత్‌లో 25 జిల్లాలుగా చేస్తామని.. ఏపీ స్వరూపాన్ని మారుస్తామని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు.
సంక్షేమ పధకాలు అమలు జరపడంలో జెట్ స్పీడుతో పనిచేసిన జగన్ సర్కార్ కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో మాత్రం ఆ దూకుడును కొంతమేర తగ్గిస్తే బాగుంటుందనే భావనతో జగన్ సర్కార్ ఉన్నట్టు కన్పిస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ఇప్పట్లోనే మొదలు పెట్టేద్దామని గతంలో భావించిన సర్కార్.. దానికి అనుగుణంగా కొద్దిపాటి కసరత్తు కూడా చేసింది.
ప్రస్తుత లెక్కల ప్రకారం.. ఏపీలోని 13 జిల్లాల సగటు జనాభా 37.98 లక్షల మంది. అలాగే పొరుగునున్న తెలంగాణలో జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ తర్వాత కొత్త జిల్లాలు ఏర్పడ్డాక ఆ రాష్ట్రంలో జిల్లాల సగటు జనాభా 11.35 లక్షల మంది మాత్రమే ఉంది. ఆర్థిక పరిపుష్టి పూర్తిగా లేకుండా జిల్లాల విభజన చేస్తే.. మరిన్ని ఆర్థిక ఇబ్బందులు వస్తాయనే భావనతోపాటు.. ఇంకొన్ని సాంకేతిక.. రాజకీయ కారణాల వల్ల కూడా ఈ ప్రక్రియను తాత్కాలింగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన ఆలోచన లేదని.. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాకే దీనికి సంబంధించిన ప్రక్రియ మొదలు పెట్టే అంశం గురించి ఆలోచన చేస్తామని స్పష్టం చేశారు.