టిటిడి నిర్ణయాలు ఎందుకు చర్చనీయాంశమవుతున్నాయి?

సోమవారం, 25 మే 2020 (20:30 IST)
తిరుమల ఏడు కొండలు కాదు.. రెండు కొండలు అన్నారు ఒక నాయకుడు. అది కాస్త పెద్ద దుమారమే రేగింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటాన్ని అందరూ తప్పుపట్టారు. కోట్లాదిమంది భక్తుల ఆరాధ్యదైవం కొలువై ఉన్న ఏడుకొండల నిలయాన్ని అవహేళన చేసేలా ఆ నాయకుడు మాట్లాడారంటూ హిందూ ధార్మిక సంఘాలు మండిపడ్డాయి. అయితే అది ముగిసిన అంశం.
 
అయితే వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. ఈ సంవత్సరకాలంలో టిటిడికి సంబంధించిన నిర్ణయాలు పెద్ద చర్చకు, హిందూ ధార్మిక సంఘాల్లో ఆగ్రహానికి గురిచేసినవే. శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా టిటిడి పాలకమండలి వ్యవహారం ఉందంటూ హిందూ ధార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. 
 
ముఖ్యంగా లాక్ డౌన్ సమయంలో లడ్డూలను బహిరంగంగా అమ్మడం విమర్శలకు తావిస్తోంది. ఆపద మొక్కుల వాడి ప్రసాదాలు తిరుమలలో మాత్రమే భక్తులకు అందుబాటులో ఉంచాలి. కానీ లారీల్లో తరలించి వివిధ జిల్లాల్లో లడ్డూలు అమ్మడంపై సర్వత్రా విమర్సలు వెల్లువెత్తాయి.
 
అయినా టిటిడి పాలకమండలి సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. అంతటితో ఆగలేదు. ఏకంగా స్వామివారికి భక్తులు సమర్పించిన స్థలాలనే విక్రయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అది కూడా తమిళనాడు రాష్ట్రంలోని 23 స్థలాలను విక్రయించేందుకు తీర్మానం కూడా చేసేశారు. ప్రత్యేకంగా కమిటీని కూడా నియమించేశారు. ఇప్పుడిదే తీవ్ర చర్చకు దారితీస్తోంది.
 
ప్రతిసారి టిటిడిని వివాదాల్లో నెడుతూ ప్రతిష్టను దిగజార్చే విధంగా టిటిడి పాలకమండలి వ్యవహరిస్తోందంటూ విమర్శలు లేకపోలేదు. పాలకమండలి ప్రభుత్వం కనుసన్నల్లో నడుస్తోంది, ఎపి సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లే టిటిడి ఛైర్మన్ నిర్ణయాలన్నీ తీసుకుంటున్నారన్న ప్రచారం లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో హిందూ ధార్మిక సంఘాలు ఒక్కటవుతున్నాయి.
 
శ్రీవారి ఆస్తుల విక్రయానికి సంబంధించి రేపు రాష్ట్రవ్యాప్తంగా హిందూ ధార్మిక సంఘాలు, బిజెపి నాయకులు నిరసన దీక్షలకు దిగారు. టిటిడి పాలకమండలి నిర్ణయాలకు వ్యతిరేకంగా రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు సిద్ధమయ్యారు. అయితే ఇంత జరుగుతున్నా టిటిడి పాలకమండలి మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమవుతుండటం పలు విమర్శలకు దారితీస్తోంది. టిటిడి పవిత్రతను కాపాడాల్సిన పాలకమండలే ఇలా చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చ లేవనెత్తుతోంది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 3 గంటల్లోనే 2.4 లక్షల లడ్డూల విక్రయం.. రాష్ట్రవ్యాప్తంగా విక్రయానికి అనుమతి