తలసాని యాదవ్ ఏపీలో సంక్రాంతి పండగ.. చంద్రబాబుకు తెచ్చిన తంటా... ఎలా?

శుక్రవారం, 18 జనవరి 2019 (20:45 IST)
తెలంగాణ మాజీ మంత్రి, ప్రస్తుత ఎంఎల్‌ఏ, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ ముఖ్యనాయకుడు అయిన తలసాని శ్రీనివాస యాదవ్‌ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఈ సందర్భగా స్థానిక టిడిపి నాయకులు ఆయనకు స్వాగతం పలకడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్‌ అయినట్లు వార్తలొచ్చాయి. 
 
తలసాని పర్యటనలో పాల్గొన్న నేతలకు నోటీసులు ఇచ్చి పార్టీ నుంచి సస్పెండ్‌ చేయాలని అదేశించినట్లు చెబుతున్నారు. ఇకపై తెలంగాణ నేతల పర్యటనలో టిడిపి నేతలు ఎవరైనా పాల్గొంటే తీవ్ర చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హెచ్చరించారు. బంధుత్వాలు ఉంటే ఇళ్లలో చూసుకోండి… బయట కాదు. బంధుత్వాలు, స్నేహాల కోసం పార్టీని నాశనం చేయొద్దు అని చంద్రబాబు తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
 
ఇదంతా చూస్తుంటే తమిళనాడు రాజకీయ ధోరణులు గుర్తుకొస్తున్నాయి. తమిళనాట రాజకీయ పార్టీల వ్యవహారం శత్రువుల మధ్య గొడవల్లా ఉంటాయి. జయలలిత జీవించివున్నప్పుడు…. డిఎంకే నేతల ఇళ్లలో జరిగిన వివాహాలకు హాజరయ్యారన్న కారణంగా అన్నాడిఎంకే నేతలను పార్టీ నుంచి బహిష్కరించిన సందర్భాలున్నాయి. సొంత బంధువులైనా, ప్రాణ స్నేహితులైనా సరే…. పార్టీ వేరయితే వాళ్ల ఇళ్లలో జరిగే ఏ కార్యానికీ హాజరవడానికి వీల్లేదు. తమిళనాట వివాహ ఆహ్వాన పత్రికలపైన తమ పార్టీ అధినేతల ఫొటోలను ముద్రించడమూ ఆనవాయితీగా మారిపోయింది. అంటే ఇక ఇతర పార్టీల నేతలకు వివాహ ఆహ్వానం కూడా ఇవ్వరన్నమాట.
 
అటువంటి ధోరణికే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు వచ్చేశారా అనే విమర్శలు వస్తున్నాయి. తలసాని దీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో పని చేశారు. ఆయనకు ఆంధ్రద్రేశ్‌లోని టిడిపి నేతలతోనూ సన్నిహిత సంబంధాలు, స్నేహాలు, బంధుత్వాలున్నాయి. ఏపి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, టిటిడి బోర్డు ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, తలసాని శ్రీనివాస యాదవ్‌ మధ్య కుటుంబ సంబంధాలున్నాయి. 30 ఏళ్లు ఒక పార్టీలో పని చేసిన తరువాత… కచ్చితంగా బలమైన స్నేహాలు ఉంటాయి. ఇవేవీ పట్టించుకోని చంద్రబాబు నాయుడు…. ఇప్పుడు తలసాని శ్రీనివాస యాదవ్‌ టిఆర్‌ఎస్‌లో ఉన్నారన్న కారణంగా, టిడిపి నేతలు ఆయన్ను కలవడమే నేరంగా భావించి చర్యలకు ఆదేశించినట్లు చెప్పుకుంటున్నారు.
 
ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణలోగానీ ఇటువంటి ధోరణులు లేవు. రాజకీయాలతో నిమిత్తం లేకుండా స్నేహ బంధాలను కొనసాగిస్తున్నారు. ఒకరి ఇళ్లలో జరిగే శుభ, అశుభ కార్యాలకు హాజరవడం సాధారణంగా జరుగుతున్నదే. ఇది అభినందించదగ్గ సంస్కృతి. తలసాని కూడా రాజకీయ పర్యటనకు రాలేదు. ఆయన పండగ కోసం వచ్చారు. ఆయన రాజకీయ నాయకుడు కాబట్టి మీడియాతో మాట్లాడారు. పండగకు వచ్చిన తలసానిని బంధువులు ఆహ్వానించకుండా ఉంటారా? కలవకుండా ఉంటారా? ఆయన రాజకీయాలు మాట్లాడితే అది బంధువుల తప్పిదం అవుతుందా?
 
చంద్రబాబు సిద్ధాంతం ప్రకారం పార్టీ నుంచి బహిష్కరించాల్సి వస్తే ముందుగా ఆయన్నే బహిష్కరించాలని యాదవ సంఘాల నాయకులు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి బద్ధశత్రువుగా ఉన్న కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నది, ఆ పార్టీ నేతలను నెత్తిన పెట్టుకుంటున్నది మీరు కాదా.. అని ప్రశ్నిస్తున్నారు. మీకు లేని శత్రుత్వాలు మాకు ఎందుకు అని నిలదీస్తున్నారు. రాజకీయాల కోసం బంధుత్వాలు, స్నహాలు వదులుకోవాలా? తలసాని విషయంలో చంద్రబాబు మాట్లాడిన తీరు ఏమాత్రం బాగోలేదని అంటున్నారు. ఈ ధోరణికి ఆదిలోనే చరమగీతం పాడాలని నేతలు కోరుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆదివారం సెలవు ఇవ్వలేదనీ రూ.152 కోట్ల అపరాధం... ఎక్కడ?