దేవినేని... పవర్ తగ్గుతోందనే... అధికార పార్టీలోకి మారుతున్నారా?
విజయవాడ: గత నాలుగు దశాబ్దాలుగా బెజవాడను గడగడలాడించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలోకి ఎందుకు మారుతున్నారు? తెలుగుదేశాన్ని ఎన్టీయార్‌తో కలిసి మోసి, చివరి వరకు అన్నగారితోనే ఉండిపోయిన నెహ్రూ... తర్వాత కాంగ్రెస్ తీర
విజయవాడ: గత నాలుగు దశాబ్దాలుగా బెజవాడను గడగడలాడించిన మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ టీడీపీలోకి ఎందుకు మారుతున్నారు? తెలుగుదేశాన్ని ఎన్టీయార్‌తో కలిసి మోసి, చివరి వరకు అన్నగారితోనే ఉండిపోయిన నెహ్రూ... తర్వాత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి వెనకడుగు వేయకుండా... కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. అధికారం ఉన్నా లేకున్నా దేవినేని హవా, విజయవాడలో కొనసాగించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో దేవినేని నెహ్రూ చెప్పిందే వేదం అనేలా చక్రం తిప్పారు. వై.ఎస్. హయాంలో విజయవాడలో ఏలూరు మెయిన్ రోడ్డును తమ ఇష్టానుసారం ఆపించేశారనే ఆరోపణలున్నాయి. అధికారం లేకపోయినా... గుణదలలో ఫ్లైవోవర్ నిర్మాణాన్ని ఆపించేశారు. తమ ఇంటికి వాస్తు దెబ్బతింటోందని... ఏలూరు రోడ్డు విస్తరణ అడ్డుకున్నారనే విమర్శలున్నాయి. దేవినేని ఛానల్ అంటూ కేబుల్ టీవీ తన అనుయాయులతో నడిపిస్తున్నారు. ఇక దేవినేని కుమారుడు అవినాష్... కాంగ్రెస్ పార్టీలో ఉంటూ సమైక్య ఉద్యమం అంటూ ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు.
ఇలా ఎన్నో చేసిన దేవినేని ఇపుడు అకస్మాత్తుగా టీడీపీలోకి చేరడం వెనుక అవినాష్ రాజకీయ ప్రయోజనాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంతకాలం అధికారం లేకపోయినా, దేవినేని అనే పేరుతో అంతా నడిపించేశారు. ఇపుడు నెహ్రూ వృద్ధాప్యంతో అనారోగ్య పరిస్థితులు ఏర్పడటం... తూర్పు నియోజకవర్గంలో గతంలోలా హవా నడవక పోవడంతో... ఇక తప్పని పరిస్థితుల్లో తన కుమారుడి భవిష్యత్తు కోసం దేవినేని అధికార పార్టీ వైపు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
పిల్లనిచ్చిన గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు కూడా టీడీపీలోనే ఉండటంతో... ఇక అంతా కలిసి అధికార పార్టీగా అయినా మరికొంత కాలం హవా నడిపిద్దామని దేవినేని టీడీపీలోకి చేరుతున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఒక పెద్ద సభ పెట్టి నెహ్రూ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఆయన సీఎం చంద్రబాబును తన నివాసంలో కలిసి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు.