Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇదేంటి బాబూ... ఇలా చేశారు? ఏ దేశం కోసం చంద్రబాబు తాపత్రయం?

ఇదేంటి బాబూ... ఇలా చేశారు? ఏ దేశం కోసం చంద్రబాబు తాపత్రయం?
, గురువారం, 1 నవంబరు 2018 (17:29 IST)
తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ అధినేత రాహుల్‌ గాంధీనికి కలిశా. నాలుగు రోజులకు మునుపు కూడా ఒకసారి చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చారు. అప్పుడే…. ఢిల్లీతో ఢీ వంటి హెడ్డింగులతో పతాక శీర్షికల్లో వార్తలు ప్రచురించాయి. ఆ రోజు ఒకరిద్దరు నాయకులను కలిసి, ప్రెస్‌మీట్‌ నిర్వహించి వెనుదిరిగారు బాబు.
 
ఈసారి రాహుల్‌ గాంధీనే కలిసి చర్చిస్తానని, బిజెపి వ్యతిరేక పక్షాలన్నింటికీ ఏకం చేస్తానని చంద్రబాబు నాయుడు స్వయంగా చెబుతున్నారు. తన తాపత్రయం స్వప్రయోజనాల కోసం కాదని, దేశం కోసమని పదేపదే చెబుతున్నారు. ఇంతకీ చంద్రబాబు నాయుడి తాపత్రయం ఏ దేశం కోసం? తెలుగుదేశం కోసమా? భారతదేశం కోసమా?
 
గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు బిజెపితో కలిసి పోటీ చేశారు. గెలిచిన తరువాత రాష్ట్ర ప్రభుత్వంలో బిజెపికి భాగస్వామ్యం ఇచ్చారు. కేంద్రంలో అధికారం పంచుకున్నారు. నాలుగున్నరేళ్ల పాటు బిజెపితో కలిసి నడిచారు. ఆ కాలంలో మోడీపైన, బిజెపి పైన ఈగ వాలకుండా చూసుకున్నారు. ఎవరైనా బిజెపిపైన విమర్శలు చేస్తే… ఆ పార్టీ నేతల కంటే ఎక్కువగా రియాక్ట్ అయ్యారు. అదే సమయంలో కాంగ్రెస్‌ను చీల్చిచీల్చి చండాడుతూ వచ్చారు. రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పార్టీ అడ్డగోలుగా విభిజించిందని మండిపడ్డారు. ఒకసారి రాహుల్‌ గాంధీ రాష్ట్రానికి వస్తే…. రాష్ట్రానికి అన్యాయం చేసి ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ తీవ్ర పదజాలంతో దాడి చేశారు. రాష్ట్రానికి కాంగ్రెస్‌ పార్టీ ఎంత అన్యాయం చేసిందో చెబుతూవచ్చారు.
 
ఇప్పుడు అవేవీ మాట్లాడటం లేదు. రాష్ట్రానికి కాంగ్రెస్‌ చేసిన అన్యాయం గుర్తుకురావడం లేదు. తెలంగాణలో ఆ పార్టీతో పొత్తు పెట్టకున్నారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికల్లోనూ పొత్తు పెట్టుకోడానికి అవసరమైన ప్రాతిపదిక సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్‌ కంటే బిజెపినే ప్రమాదకారి అని, ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, దేశాన్ని కాపాడుకోవాలని… ఇంకా ఏవోవో వ్యాఖ్యలు చేస్తున్నారు.
 
ఈ సమయంలో చంద్రబాబు జవాబు చెప్పాల్సిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. బిజెపి ఎంత ప్రమాదకరమో…. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేసినప్పటికీ చంద్రబాబుకు తెలియదా అనేద మొదటి ప్రశ్న. మోడీ గురించి తెలిసిన చంద్రబాబు గత ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బిజెపితో ఎందుకు పొత్తుపెట్టుకున్నట్లు?
 
తెలుగుదేశం మంత్రులు భాగస్వామిగా ఉన్న మోడీ ప్రభుత్వంలో… ఈ దేశంలో ఎన్ని మూక దాడులు జరిగాయి? ఎందరు ప్రజాస్వామ్యవాదులు, లౌకికవాదులు హత్యలకు గురయ్యారు? గోమాంసం అమ్ముతున్నారనే పేరుతో అమాయకులను కొట్టి చంపిన ఉదంతాలు లేవా? కల్బుర్గి, గౌరిలంకేష్‌ వంటి వారిని పొట్టనపెట్టుకున్న దురాగతాలు లేవా? ఇటువంటి ప్రశ్నలు వందలు బాబుకు వేయవచ్చు. అటువంటి సందర్భాల్లో చంద్రబాబు నాయుడు స్పందించారా? ఏం మాట్లాడారు?
webdunia
 
రాష్ట్రంలో వైసిపి కాకుండా కాంగ్రెసే… టిడిపికి ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉంటే చంద్రబాబు నాయుడు బిజెపినే ప్రమాదం అని అనగలిగేవారా? ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రధాన శత్రువు కాబట్టి…. అప్పుడు కాంగ్రెసేతర కూటమి అన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్‌తో ఇబ్బందిలేదు కాబట్టి…. బిజెపియేతర కూటమి అంటున్నారు. ఇది వాస్తవం కాదా?
 
బిజెపితో విభేదించిన నేపథ్యంలో సిబిఐ వంటి కేసులు తమపై వచ్చే అవకాశాలు ఉన్నాయన్నది చంద్రబాబు నాయుడి భయం. ఈ ఎన్నికలలోపు కేసులు పెట్టడం వల్ల రాజకీయంగా బిజెపికీ నష్టమే. ఎన్నికల తరువాత చంద్రబాబు నాయుడు ఓడిపోతారని, తాము మళ్లీ అధికారంలోకి వస్తామని బిజెపి అంచనా వేస్తోంది. రాష్ట్రంలో వైసిపినో, జనసేననో అధికారంలోకి వస్తుందనేది వారి అంచనా. ఇదే జరిగితే…. తనపై కేసులు పెట్టి జైలుకు పంపుతారన్న ఆందోళన చంద్రబాబుదనే వాదన కూడా వుంది. అందుకే బిజెపికి ఎలాగైనా అధికారాన్ని దూరం చేయాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
 
రాష్ట్రంలో తాము గెలిచినా గెలవకున్నా కేంద్రంలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలోని సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉంటే రక్షణ పొందవచ్చనేది బాబు వ్యూహం అని కొందరి భావన. అందుకే దేశం, ప్రజాస్వామ్యం నినాదం అందుకున్నారు. కాంగ్రెసేతర పక్షాలను ఏకం చేస్తానని చెబుతూ అన్ని పార్టీలనూ కలిసే ప్రయత్నం చేస్తున్నారు.
 
జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఎన్నోమార్లు చక్రం తిప్పారు. మూడో ఫ్రంట్‌ ఫేరుతో వామపక్షాలు ఎన్నో ప్రయత్నాలు చేశాయి. బిజెపిని మతోన్మాద పార్టీ అని, దానితో ఎప్పటికీ పొత్తు వుండబోదన్న చంద్రబాబు… ఎన్నిసార్లు ఆ పార్టీ పంచన చేరారు… అప్పుడు ఏమని సమర్థించుకున్నారు? ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇటువంటివన్నీ జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపే నాయకులు మరచిపోయి వుంటారా?
 
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు బిజెపిని ప్రధాన శత్రువు అంటున్నారుగానీ…. రేపు తాను మోడీని శత్రువన్నాను గానీ… బిజెపిని కాదు అని మాట మార్చకుండా ఉంటారా? ఆ పార్టీతో ఎప్పటికీ జతకట్టరా? చంద్రబాబు గురించి కాంగ్రెస్‌కు అంచనా లేదా? ఇవన్నీ ఆలోచించాల్సిన అంశాలు అంటున్నారు విశ్లేషకులు. చూడాలి భవిష్యత్ రాజకీయాలు ఇంకెన్ని మలుపులు తీసుకుంటాయో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇకపై వాట్సాప్ స్టేటస్‌లో ప్రకటనలు.. అంతా డబ్బు కోసమే..