తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకంపై అధిష్టానం ఫోకస్ పెట్టింది. దీనిపై సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోరారు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఠాగూర్. ఒకటి రెండు రోజుల్లో ఢిల్లీలో జరిగే సమావేశంలో టి.పిసిసి చీఫ్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే తెలంగాణాలో రెండవ ప్రత్యామ్నాయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి రథసారథి ఎవరన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.
తెలంగాణా కాంగ్రెస్ అధ్యక్షుడి నియామకం చాలాకాలంగా వాయిదా పడుతూ వస్తోంది. దీంతో సాధ్యమైనంత త్వరగా నియామకాన్ని తేల్చాలని చూస్తోంది అధిష్టానం. పార్టీ అధినాయకత్వం ఇన్నాళ్ళు కరోనాపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. కానీ ఇప్పుడు పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించే పనిలో పడింది. కేరళ పిసిసి నియామకంపై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టింది అధిష్టానం. దీంతో తెలంగాణా పిసిసిపైనా కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉందట.
చాలారోజులుగా పార్టీ వ్యవహారాల్లో కాస్త స్ధబ్ధత నెలకొంది. దీంతో పార్టీ కేడర్లో కొంత అసంతృప్తి ఉంది. తెలంగాణాలో జరుగుతున్న రాజకీయ పరిణామాల్లో కూడా వేగంగా పావులు కదిపే పరిస్థితి లేదు. ఈ క్రమంలోనే సోనియాగాంధీ అపాయింట్మెంట్ కోరారు ఎఐసిసి ప్రతినిధి, తెలంగాణా వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ఠాగూర్.
తెలంగాణాలో పార్టీ పరిస్థితి టిసిసి నియామకంపై ఇప్పటికే నివేదిక సిద్ధం చేశారట ఠాగూర్. ఈ నివేదికను సోనియాగాంధీకి ఇవ్వడం కోసం అపాయింట్మెంట్ అడిగినట్లు తెలుస్తోంది. ఒకటిరెండురోజుల్లో సోనియాతో ఠాగూర్ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ సమావేశంలో టిసిసి నియామకంపై సోనియా క్లారిటీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. సాగర్ ఎన్నికలకు ముందు తీసుకున్న అభిప్రాయ సేకరణ ఆధారంగాను వచ్చిన నివేదిక సోనియాగాంధీ దగ్గర ఉందట. ఇప్పుడు మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ఠాగూర్ మరో నివేదికను సిద్ధం చేశారట.
తెలంగాణా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుని పదవిని ఆశిస్తున్న కోమిటిరెడ్డి, రేవంత్ రెడ్డిలతో పాటు సాగర్ ఎన్నికలకు ముందు తెరపైకి వచ్చిన జీవన్ రెడ్డిపై నివేదిక సిద్ధమైనట్లు సమాచారం. వీళ్ళలో ఎవరికి పిసిసి పదవి ఇస్తే పరిస్థితి ఎలా ఉంటుందన్న విషయంపై నివేదికను అధిష్టానానికి అందజేయనున్నారు.