Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుపతి బాలాజీ డివిజన్‌ కలేనా...!

రాయలసీమ సమగ్రాభివృద్ధికి గుంతకల్లుకు రైల్వేజోన్‌, తిరుపతి బాలాజీ డివిజన్‌ కీలక అవసరం. వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్థికి మౌళిక వసతుల కల్పన అత్యంత కీలకం. అందులో ముఖ్యమైనది రవాణా సౌకర్యాలూ. అందులోనూ రైల

Advertiesment
tirupati balaji railway zone
, సోమవారం, 29 ఆగస్టు 2016 (12:20 IST)
రాయలసీమ సమగ్రాభివృద్ధికి గుంతకల్లుకు రైల్వేజోన్‌, తిరుపతి బాలాజీ డివిజన్‌ కీలక అవసరం. వెనుకబడిన రాయలసీమ సమగ్రాభివృద్థికి మౌళిక వసతుల కల్పన అత్యంత కీలకం. అందులో ముఖ్యమైనది రవాణా సౌకర్యాలూ. అందులోనూ రైల్వేలు ప్రధానమైనవి. భారతదేశాన్ని పాలించిన ఆంగ్లేయులు తమ పాలనా అవసరాల కోసం నిర్మించిన రైల్వేలు దేశానికి ఎంతగానో ఉపయోగపడ్డాయి. విభజన ద్వారా నష్టపోయిన ఏపికీ కేంద్రం ఇచ్చిన హామీలపై నేడు రాష్ట్రంలో చర్చ నడుస్తోంది. కేంద్రం కూడా విభజన చట్టం పరిధిలో సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో రైల్వేజోన్‌గా గుంతకల్లు, డివిజన్‌గా తిరుపతి అత్యంత అనువైన ప్రాంతాలు....
 
రాయలసీమలోని అత్యంత వెనుకబడిన ప్రాంతం అనంతపురం. ఆంగ్లేయుల కాలంలోనే చెన్నై-ముంబై, బెంగళూరు-సికింద్రాబాద్‌, తిరుపతి-నాగపూర్‌, గుంటూర్‌-హుబ్లీలను అనుసంధానం చేయడానికి అనువైన కేంద్రం గుంతకల్లును అని భావించి 1927 సంవత్సరంలో గుంతకల్లును రైల్వే డివిజన్‌గా ప్రకటించారు. 1400 కిలోమీటర్ల పరిధి, 130 రైళ్ళు, రోజూ లక్ష మంది ప్రయాణికులు, యేటా వందల కోట్ల ఆదాయం కలిగిన డివిజన్‌ మన గుంతకల్లు. అంతేకాదు బెంగుళూరుకు 300కిలోమీటర్లు, చెన్నైకి 450కిలోమీటర్లు, హైదరబాద్‌కు 300కిలోమీటర్లు, రాజధాని అమరావతికి 300కిలోమీటర్లు, హుబ్లీకి 260కిలోమీటర్లు దూరం కలిగిన అన్ని ప్రధాన నగరాలకు అత్యంత అనువైన ప్రాంతం గుంతకల్లు. రైల్వేజోన్‌ ఏర్పాటు చేయడానికి తగిన భూమి కలిగిన ప్రాంతం. అది ఎంతగా అంటే గుంతకల్లు మున్సిపాలిటీ ఎంత విస్తీర్ణంలో ఉందో దాదాపు అంత స్థలం స్వయంగా రైల్వేకి ఉంది. 
 
ఎటువంటి ప్రకృతి విపత్తులకు ఆస్కారం లేని ప్రాంతం. కాబట్టి జోన్‌ ఏర్పాటుకు 100శాతం అర్హత కలిగిన ప్రాంతం మన గుంతకల్లు. అదేవిధంగా రోజుకు సగటున 50వేల మంది ప్రయాణీకులతో సికింద్రాబాద్‌ తర్వాత ఎక్కువ ఆదాయం కలిగి రాష్ట్రంలోని, దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి రైలు సౌకర్యాలు కలిగిన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతికి డివిజన్‌ హోదా లేకపోవడం అన్యాయం. కేవలం 30కిలోమీటర్లకి వ్యత్యాసంతో గుంటూరు-విజయవాడ మధ్య రెండు డివిజన్‌లను చేయగా లేనిది తిరుపతికి ఇవ్వకపోవడం అన్యాయంకాక మరేమవుతుంది. అందుకే తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వేడివిజన్‌ చేయడం సముచితం. గుంతకల్లుకు జోన్‌ అవసరం. అర్హతతోబాటు అవసరం కలిగిన ప్రాంతం గుంతకల్లు, రాయలసీమ ప్రాంతంవెనుకబడిన ప్రాంతం. అందులోనూ అనంతపురం అత్యంత వెనుకబడిన ప్రాంతం. నిరంతరం అత్మహత్యలు, బ్రతుకు కోసం వలసలు వెలుతున్న ప్రాంతం. నిరంతరం ఆత్మహత్యలు, బ్రతుకు కోసం వలసలు వెలుతున్న ప్రాంతం. 
 
మౌళిక వసతుల కల్పన జరగడం ద్వారానే సీమ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధికి నోచుకుంటుంది. ఇప్పటికే శ్రీ బాగ్‌ ఒప్పందానికి భిన్నంగా సీమలో ఉండాల్సిన రాజధానిని అమరావతికి మార్చారు. పోలవరం, స్టీల్‌ ప్లాంట్‌తో సహా అనేక పరిశ్రమలు, తాజాగా పట్టిసీమలాంటి నీటి ప్రాజెక్టులు ఒక ప్రాంతంలోనే నిర్మించారు, నిర్మిస్తున్నారు. అన్నివిధాలా వెనుకబడిన సీమకు రైల్వేజోన్‌ కేటాయించడం సహజ న్యాయం. జోన్‌ రాగలిగితే రాయలసీమతో బాటు ఇతర ప్రాంతాలైన శ్రీకాళహస్తి-నడికుడి, కడప-బెంగుళూరు, దోర్నాల-పుట్టిపర్తి ప్రాంతాలకు రైల్వేనెట్‌వర్క్‌ను విస్తరించుకోవచ్చు. అనేక సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న రైల్వే విద్యుద్దీకరణను వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చు. అంతే కాకుండా తిరుపతి వాసుల చిరకాల కోరిక అయిన బాలాజీ డివిజన్‌ సాధన అత్యంత సులభతరం అవుతుంది. 
 
గుంతకల్లు జోన్‌ వలన వెనువెంటనే దాదాపు 10 వేలమంది మెరుగైన జీతాలు కలిగిన కేంద్రప్రభుత్వం ఉద్యోగులు వస్తారు. ఫలితంగా మరో 10వేల మందికి పరోక్షంగా ఉపాధి కలుగుతుంది. గుంతకల్లు మున్సిపాలిటీ త్వరితగతిన నగరంగా అభివృద్ధి చెందుతుంది. తిరుపతి బాలాజీ డివిజన్‌ అయితే మరో రెండువేల మంది ఉద్యోగులు తిరుపతి కేంద్రంగా ఉంటారు. రాయలసీమలో పరిశ్రమలు ఏర్పడాలన్నా, ఐటి లాంటి సంస్థలు మనకు రావాలన్నా రైల్వే వ్యవస్థ మెరుగుపడటం అత్యంత కీలకం. అందుకే రాయలసీమ మేధావుల ఫోరం, రాయలసీమ సోషల్‌ మీడియా ఫోరం, రాయలసీమలోని గుంతకల్లుకు జోన్‌, తిరుపతికి డివిజన్‌ ఏర్పాటు కావాల్సిన అవసరంపై ప్రజలలో చైతన్యం తీసుకురావడానికి పూనుకుంది. విభజన చట్టంలో ఉన్నది విభాజిత ఏపీకి రైల్వే జోన్‌ను ఖచ్చితంగా పరిశీలించాలని మాత్రమే. అంటే ఏపీలోని ఏదైనా ఒక ప్రాంతంలో జోన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటారు.
 
దురదృష్టవశాత్తు రాజకీయ పార్టీలు తమ, తమ రాజకీయ అవసరాల కోసం చట్టంలో లేకపోయినా విశాఖ రైల్వేజోన్‌ అంటూ నామకరణం చేశారు. విశాఖ వాసులుగా అక్కడి ప్రజలను అపార్థం చేసుకోవాల్సిన అవసరం లేదు కూడా. కానీ రాయలసీమలో ఉన్న నేతలు కూడా గుంతకల్లు జోన్‌ గురించి మాట్లాడకపోగా విశాఖ రైల్వేజోన్‌ అంటూ పోరాటానికి దిగడం సీమకు ద్రోహం చేయడం మినహా మరొకటి కాదు. రాష్ట్రానికి జోన్‌ అని కాకుండా విశాఖకు జోన్‌ అని పోరాటం చేయడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచే చర్య తప్ప మరొకటి కాదు.
 
ఇప్పటికే సీమకు నష్టం తెచ్చే పోరాటాలను సీమ ప్రజలతోనే చేయించిన ఘనత మన రాజకీయ పార్టీలది. విభజన చట్టంలోని సీమకు, ప్రయోజనం కలిగే కడప ఉక్కు, గాలేరు నగరి, హంద్రీ నీవాకు నిధులు, సీమ ప్యాకేజీకి రావాల్సిన 15 వేల కోట్లు గురించి సీమ ప్రజలను పోరాడమనాల్సిందిపోయి సీమకు పెద్దగా ప్రయోజనంలేని హోదా కోసం పోరాటంలోకి దించుతున్నాయి. ఇప్పుడు ఏకంగా అన్ని విధాల జోన్‌ అవకాశం ఉన్న గుంతకల్లును పక్కనపెట్టి రాయలసీమ ప్రజల చేతనే విశాఖ జోన్‌ అని మాట్లాడిస్తున్నాయి మన పార్టీలు. అందుకే పార్టీల ఆటలో పావులుగా మారకుండా మన సీమ సమగ్రాభివృద్ధికి అత్యంత కీలకమైన గుంతకల్లు రైల్వేజోన్‌, తిరుపతికి బాలాజీ డివిజన్‌ సాధన కోసం ముందుకు రావాలని రాయలసీమ పోరాట సమితి నాయకులు కోరుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్‌ కళ్యాణ్‌కు సొంత ఛానల్‌ ఉంది.... తెలుసా...?