125 కోట్ల మంది ప్రజలను బకరాలను చేసిన నరేంద్ర మోడీ... కరెన్సీ నోట్ల రద్దు వెనక పెద్దన్న హస్తం!?
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అమెరికా చెప్పినట్టుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్ల వెనుక ప్రపంచ పెద్దన్న అమెరికా హస్తం ఉన్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. అమెరికా చెప్పినట్టుగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు.. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, ఆర్థిక శాఖ తలాడించినట్టు ఆసియా పసిఫిక్ రీసెర్చ్ డాట్ కామ్ అనే సంస్థ 'దాచిపెట్టిన బహిరంగ రహస్యం: భారత చేపట్టిన క్రూరమైన నోట్ల రద్దు ప్రాజెక్టు వెనక వాషింగ్టన్' పేరుతో ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇది ఇపుడు సంచలనంగా మారింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం భారత తీసుకోవడానికి ముందు, తెరవెనుకా, తెరపైనా ఏడాది కాలంగా జరుగుతున్న ‘ఏర్పాట్లు’, ఈ మొత్తం ప్రక్రియలో కీలక పాత్రధారులు, ఈ నిర్ణయం వెనక అసలు ప్రయోజనాలు, లబ్దిదారుల వివరాలను ఈ కథనం వెల్లడించింది. ఈ కథనంలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే...
నగదు రహిత భారత్‌గా మార్చేందుకు గత యేడాది కాలంగా ప్రయత్నాలు సాగాయి. ఇందులో అమెరికా ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్‌నేషనల్ డెవల్‌పమెంట్ (యుఎస్ఏఐడి) ఇందులో ప్రధాన పాత్రధారి. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఆర్‌బిఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ తమవంతు సహకారం అందించారు. ఫలితంగా ఈ సంస్థ భారతను పెద్ద నోట్ల రద్దుకు సిద్ధం చేసింది.
అదేసమయంలో మోడీ - ఒబామాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలను పక్కాగా అమలు చేసేందుకు యుఎస్ఏఐడి రంగంలోకి దిగింది. నగదు చెల్లింపులకు స్వస్తిచెప్పి డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించాలనే దిశగా ఆర్థిక శాఖతో ఓ ఒప్పందం చేసుకుంది. ఇందుకోసం నగదు వ్యవస్థను ధ్వంసం చేసి, ప్రస్తుతం అరకొరగా ఉన్న డిజిటల్ పేమెంట్స్‌ను ఒక్కసారిగా ఉధృతస్థాయికి తీసుకెళ్లాలంటే భారీ స్థాయిలో చర్యలు అవసరమని ఓ నివేదికను సమర్పిచింది.
నవంబర్ 8కి నాలుగు వారాల ముందు, యుఎస్ఎయిడ్ కొత్తగా కేటలిస్ట్ అనే సంస్థ ఏర్పాటును ప్రకటించింది. నగదును పక్కకు తోసి పెద్ద ఎత్తున డిజిటల్ పేమెంట్స్‌ను వ్యాప్తిచేయడం, అందుకు అవసరమైన సమగ్ర వ్యవస్థ ఏర్పాటు ఈ కేటలిస్ట్ లక్ష్యం. యుఎస్ఎయిడ్ ఆర్థిక సహకారంతో నడిచే కేటలిస్ట్‌లో కీలక వ్యక్తి అలోక్ గుప్తా. ఈ అలోక్ గుప్తా, యుఎస్ఏఐడి ప్రమోట్ చేసిన వాషింగ్టన్ సంస్థ వరల్డ్ రీసోర్సెస్ ఇనిస్టిట్యూట్‌లో సిఒఒగా పనిచేశారు. భారతలో ఆధార్ కార్డును డెవలప్ చేసిన టీమ్‌లోనూ గుప్తా ఉన్నారు. ఈ కేటలిస్ట్ ఏర్పాటైన సమయంలోనే కీలకస్థానంలో ఉన్న అమెరికా ప్రతినిధి ఒకరు, ‘‘ఆర్థిక వ్యవస్థలను డిజిటలైజ్ చేసేందుకు అంతర్జాతీయంగా జరుగుతున్న ప్రయత్నాల్లో భారత ముందు వరుసలో ఉంది’’ అంటూ వ్యూహాత్మకంగా ప్రశంసలు గుప్పించారు.
ఈయన లక్ష్యం భారత ప్రజలకు మేలు చేసేందుకు కాదు. వారికి తెలియకుండానే వారితో చెలగాటమాడాలి. కరెన్సీ నోట్ల రద్దుతో క్షతగాత్రులైన ప్రజలు భారత ప్రభుత్వాన్ని మాత్రం నిందించకూడదు. అందుకే డిజిటల్ పేమెంట్స్ లక్ష్యాన్ని తెరవెనక్కి నెట్టి, నల్లధనం, అవినీతి లక్ష్యాలను తెరముందుకు తెచ్చేలా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒప్పించారు. ఆ విధంగానే ఆయన ప్రకటన సాగింది. కానీ, ఈ మొత్తం వ్యవహారంలో కీలకపాత్రధారులందరికీ ఏం జరుగుతుందో తెలుసు, వారి లక్ష్యమేమిటో తెలుసు, వ్యూహమేమిటో తెలుసు.. కాగితాలపై మాత్రం ఎక్కడా ఏమీ కనిపించకుండా జాగ్రత్తపడ్డారు. రహస్యాలేవీ బయటకుపొక్కకుండా చర్యలు తీసుకున్నారు.
అలా 125 కోట్ల భారత ప్రజల అమాయకత్వాన్ని, దేశభక్తిమాటున, అవినీతిపై యుద్ధం చాటున వారిని తేలిగ్గా బుట్టలో వేసుకునే వెసులుబాటును గుర్తించిన తర్వాత, ఏకంగా మొత్తం దేశాన్ని ప్రయోగశాలగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో అమెరికా మార్చేసింది. వాస్తవాలను కప్పిపెట్టి, కాకమ్మ కబుర్లతో ఎన్డీయే సర్కారు కోట్లాది మంది ప్రజలను ‘‘బకరా’’లను చేసింది. ఫలితంగా దేశంలో కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. నోట్ల రద్దుకు ముందు భారతలో నగదులావాదేవీల వాటా 97 శాతం ఉంది. నోట్ల రద్దు తర్వాత పరిణామాలు చిన్న బ్రతుకులను ఛిద్రం చేసినప్పటకీ, డిజిటల్ పేమెంట్ సర్వీసుల్లో ఉన్న వీసా, మాస్టర్‌కార్డ్ ఇతర సంస్థలకు మాత్రం వ్యాపార విస్తరణ, లాభార్జన అవకాశాలను తెరిచాయి.
తమ దేశ కంపెనీల ప్రయోజనమే అమెరికా ప్రయోజనం. ఆయుధాల వ్యాపారంతో ప్రపంచాన్ని తన కనుసన్నల్లో నడిపించిన అమెరికా ఇప్పుడు ఐటి, ఐటి ఆధారిత పేమెంట్ సర్వీసుల్లోని తమ కంపెనీల వ్యాపారాలను విస్తరిస్తూ, అదేసమయంలో అంతర్జాతీయ ఆర్థిక రంగంపై పూర్తి పట్టు సాధించాలని గట్టిగా భావిస్తోంది. అంతర్జాతీయ ఆర్థికవ్యవస్థలను పూర్తిగా డిజిటల్ చెల్లింపుల పరిధిలోకి తేగలిగితే అమెరికా కంపెనీల బిజినెస్ పెరుగుతుంది.
అదేసమయంలో వాషింగ్టన్‌లో కూర్చొని, ప్రపంచవ్యాప్త ఆర్థిక లావాదేవీలపై నిఘావేయడం అమెరికా గూఢచార వ్యవస్థకు సులభమవుతుంది. అమెరికా బహుళజాతి సంస్థల అర్థబలం, అంతర్జాతీయ మారకంగా డాలర్‌కున్న శక్తి వల్ల, ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ లావాదేవీలపై అమెరికా పెత్తనం అలవోకగా స్థిరపడుతుంది. ఎవరైనా సరే అంతర్జాతీయ చట్టాలు, తమ దేశాలకు చెందిన చట్టాలను పక్కనబెట్టి విధిగా అమెరికా చట్టాలకు తలవొగ్గి వ్యాపారాలు చేయాల్సి ఉంటుంది. అంతర్జాతీయంగా ఉన్న అన్ని ఆర్థిక సంస్థలను, బ్యాంకులను తన కనుసన్నల్లో ఆడిస్తుంది. ఎవరైనా తోకాడిస్తే, నిషేధాలు, ఆంక్షలతో వేధిస్తుంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఆయుధ వ్యాపారాన్ని స్వలాభం కోసం విస్తరించిన అమెరికా, ఇప్పుడు అంతర్జాతీయ ఆర్థిక రంగాన్ని తన చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు డిజిటల్ ఎకనామీని తెరపైకి తెచ్చింది. ఈ గుట్టును ఆసియా ఫసిఫిక్ డాట్ కామ్ అనే సంస్థ బహిర్గతం చేసింది.