Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'నెల్లూరు సోగ్గాడు' ఇకలేడనీ తెలిసి "సింహపురి" చిన్నబోయింది...

నెల్లూరు సోగ్గాడిగా గుర్తింపు పొందిన రాజకీయనేత ఆనం వివేకానంద రెడ్డి బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 67 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్ర

'నెల్లూరు సోగ్గాడు' ఇకలేడనీ తెలిసి
, బుధవారం, 25 ఏప్రియల్ 2018 (14:37 IST)
నెల్లూరు సోగ్గాడిగా గుర్తింపు పొందిన రాజకీయనేత ఆనం వివేకానంద రెడ్డి బుధవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన వయసు 67 యేళ్లు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
 
అయితే, నెల్లూరు జిల్లాలోనేకాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఆనం వివేకా చెరగని ముద్రవేశారు. ఓ సందర్భంలో మాట వరుసకు తన తుదిశ్వాస వరకు రాజకీయాల్లో ఉంటానని చెప్పిన ఆనం... అలానే చివరకువరకు రాజకీయాల్లో ఉంటూ కన్నుమూశారు. ప్రజల నేతగా ఘనమైన పేరు... అధికారం అనుభవించడం, ప్రజలకు దగ్గర కావడంలో ఆయనకు ఆయనే సాటి. కౌన్సిలర్‌గా కెరీర్‌ను ప్రారంభించి మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన రాజకీయ దురుంధరుడు. 
 
తన వ్యక్తిత్వంతో నెల్లూరు ప్రతిష్టను గల్లీ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లిన గొప్ప 'కళాకారుడు'. హేమాహేమీలతో రాజకీయంగా ఢీకొన్న ధైర్యవంతుడు. నేరుగా ప్రజల ఇళ్లకే వెళ్లి మాట్లాడగలిగిన నేర్పరి. అలా అలుపెరుగని రాజకీయ యోధుడిగా, నెల్లూరు సోగ్గాడిగా గుర్తింపు పొందిన ఆనం వివేకా ఇకలేరనే విషాదకర వార్త విన్న సింహపురి శోకసముద్రమైంది.
 
10 మందిలో సిగరెట్టు తాగినా ఆయనకు ఆయనే సాటి. నాయకుడై ఉండి కూడా గన్‌మెన్లు లేకుండా ప్రజల్లోకి వెళ్లినా ఆయనకే సాధ్యం. కుర్రకారు యువకుడిలా రాత్రిళ్ళు రెండో ఆట సినిమా చూసినా ఆయనకు ఆయన సాటే. వేషధారణనైనా, వ్యంగ్యస్త్రాలైనే ఆయనే సంధించాలి. ఎదుటి వ్యక్తి ఎంతటి పెద్దవాడైనా సరే తాను కడగాలంటే కడిగిపారేస్తాడంతే. అంతేనా ఈ జల్సారాయుడు అనుభవించడం తెలిసినోడని ఇప్పటికీ అంటుంటారు.
webdunia
 
ఎవరికీ ఏ అవసరం వచ్చినా పిలిచిన వెంటనే పలికే వ్యక్తి. నేరుగా బాధితుని ఇంటికి వెళ్లి ఓదార్చే మంచి మనస్సున్న మారాజు. రాజకీయ నాయకుడే కానీ, రాజకీయాలే తన ప్రాణం మాత్రం కాదు. అందుకే వైఎస్ హాయంలో తన ఎదుటకు మంత్రి పదవి వచ్చినా కాదన్నాడు. వద్దన్నాడు. కానీ, రాజకీయాలను మాత్రం వదిలిపెట్టలేదు. తన ఉనికిని ఏనాడు కోల్పోలేదు. తన పరిధిలో గెలిచినా ఓడినా ప్రభావం చూపుతూనే వచ్చారు. 
 
పదిమందిలో నడిరోడ్డుపై నృత్యాలు చేసినా… మార్కెట్లోకి కొత్తగా వచ్చిన ఏ వస్తువునైనా తన సొంతం చేసుకుని వాడాల్సిందే. అలాగే, రోడ్డు పక్కన దాబాలో కూర్చుని బిర్యానీ తింటున్నా… తన జీవితాన్ని అందరికీ తెలిసేలా జల్సాగా అనుభవించాడు. అదే జీవితం అని నమ్మేవాడు. తు.చ తప్పకుండా ఆచరించాడు కూడా. 
 
అంతేనా, తన రాజకీయ చతురతతో క్రమంగా నెల్లూరు జిల్లాపై పట్టు సాధించి చక్రం తిప్పిన నేత. అలాంటి ఆనం వివేకా బోన్ క్యాన్సర్‌ బారిన పడి తిరిగిరాని లోకాలకు చేరుకున్నాడు. ఆయన మరణవార్తను విన్న సింహపురి చిన్నబోయింది. విలక్షణ రాజకీయ నేతగా, ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనం మృతితో నెల్లూరు వాసులు విషాదంలో మునిగారు. 
 
దివంగత నేత వైఎస్.రాజశేఖర రెడ్డి హయాంలో ఓ వెలుగు వెలిగిన ఆనం వివేకా, మంత్రి పదవిని సైతం వదులుకున్నారు. వైఎస్ స్వయంగా పిలిచి తన క్యాబినెట్‌లో స్థానం ఇస్తానని చెప్పిన వేళ, సున్నితంగా తిరస్కరిస్తూ, తన తమ్ముడైన రామనారాయణ రెడ్డికి పదవిని ఇప్పించుకున్నారు.
 
వర్తమాన రాజకీయాల్లో ఉంటూ అంత ఆనందంగా, జోరుగా, హుషారుగా జీవితాన్ని గడిపిన వారెవ్వరైనా ఉన్నారంటే అది ఆనం వివేకానంద రెడ్డే… అంత కులాసాగా జీవితాన్ని గడిపిన మరో వ్యక్తి లేరంటే అతిశయోక్తి కాదు. నెల్లూరులోని వీధివీధిలో అభిమానులను సంపాదించుకున్న ఆయన మృతి పట్ల పలువురు నగర వాసులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఎంత కులాసాగా కాలం గడుపుతారో ప్రత్యర్థుల గుండెల్లో రాజకీయ గుణపాలు దింపడంలో దిట్ట. 

 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మమతా బెనర్జీ ఓ సూర్పణఖ : బీజేపీ ఎమ్మెల్యే