అమెరికాకు గుండెకాయలాంటి క్యాపిటల్ హిల్‌పై ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మద్దతుదారులు దాడికి తెగబడ్డారు. ఈ దాడితో ప్రపంచం ఒక్కసారి ఉలిక్కిపడింది. గత యేడాది జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఓటమిని జీర్ణించుకోలేని డోనాల్డ్ ట్రంప్, తన మద్దతుదారులకు ఇచ్చిన పిలుపుతో ఈ దాడి జరిగింది. ఈ ఆందోళనకారులను అదుపు చేసేందుకు అమెరికా బలగాలు ఏకంగా కాల్పులు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కాల్పుల్లో ఇప్పటివరకు నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొంతమంది గాయపడ్డారు.
అయితే, అమెరికా ఆత్మలాంటి క్యాపిటల్ హిల్‌పైకి తన మద్దతుదారులను రెచ్చగొట్టి పంపించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను గద్దె దింపడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. దీనిపై చర్చించడానికి కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమైనట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు అమెరికా అధ్యక్షుడిని ఎలా గద్దె దించుతారన్న చర్చ జరుగుతోంది.
దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి అమెరికా రాజ్యాంగ 25వ సవరణ ఒకటి కాగా.. మరొకటి అభిశంసనకు సెనేట్ ఆమోదం తెలపడం. ఈ రెండు సందర్భాల్లోనూ వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ అమెరికా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ఈ నెల 20న ప్రమాణం చేయనున్న విషయం తెలిసిందే.
ఇంతకీ 25వ సవరణ ఏంటి?
డోనాల్డ్ ట్రంప్‌ను గద్దె దించడానికి కేబినెట్ ప్రధానంగా ఈ 25వ సవరణపైనే చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సవరణ ఏం చెబుతున్నదంటే.. ఒకవేళ అధ్యక్షుడు తన విధులను నిర్వహించలేకపోతే ఆయనను దించి మరొకరిని నియమించవచ్చు. ఇలా చేయాలంటే కేబినెట్‌లోని మెజార్టీ సభ్యులతోపాటు వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ ఆమోదం తప్పనిసరి అవుతుంది.
ఈ సవరణను 1967లో చేయగా.. ఇప్పటి వరకూ ఎప్పుడూ ప్రయోగించలేదు. అప్పట్లో అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నడీ హత్య తర్వాత ఈ సవరణ చేశారు. ఇందులోని సెక్షన్ 4 ప్రకారం.. అధ్యక్షుడు తన విధులను నిర్వహించకపోవడంతోపాటు తనకు తానుగా బాధ్యతల నుంచి తప్పుకోని సమయంలో ఈ 25వ సవరణను ప్రయోగించవచ్చు.
అయితే, తాజాగా చెలరేగిన హింసకు ట్రంపే కారణమంటూ వెంటనే 25వ సవరణను ప్రయోగించాలని ఇప్పటికే చాలా మంది మైక్ పెన్స్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నారు. అభిశంసన తీర్మానం కంటే ట్రంప్‌ను వెంటనే గద్దె దింపడానికి ఈ 25వ సవరణే చాలా ఉత్తమమని అనేక మంది న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అభిశంసన ఎలా?
25వ సవరణతో పోలిస్తే అభిశంసన తీర్మాన ప్రక్రియ ఆలస్యమవుతుంది. దీనికోసం కాంగ్రెస్‌లో దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్.. అధ్యక్షుడిపై పెద్ద నేరం లేదా దుశ్చర్యకు పాల్పడ్డారన్న అభియోగాలను మోపాల్సి ఉంటుంది. సభలోని 435 మంది సభ్యులు సాధారణ మెజార్టీతో ఈ అభియోగాలకు ఆమోదం తెలిపితే.. అభిశంసన తీర్మానం ఎగువ సభ అయిన సెనేట్‌కు వెళ్తుంది.
అక్కడ సెనేట్ అధ్యక్షుడిపై అభియోగాలపై విచారణ జరుపుతుంది. తర్వాత సెనేట్ మూడింట రెండు వంతుల మెజార్టీతో ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. 2019 డిసెంబర్‌లోనూ ట్రంప్‌పై డెమొక్రాట్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అయితే ఆయనపై ఉన్న అభియోగాలను 2020 ఫిబ్రవరిలో సెనేట్ కొట్టేసింది.
ప్రస్తుతం విచారణకు సమయం ఎక్కువగా లేదు. జనవరి 20తో ట్రంప్ పదవీ కాలం ముగుస్తుంది. ఆలోపే ఆయనను గద్దె దించాలంటే 25వ సవరణే ఉత్తమమన్నది చాలా మంది రాజ్యాంగ నిపుణులు వాదనగా వుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇపుడు అమెరికాలో ఏం జరుగుతుందోనని ప్రతి ఒక్కరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.