Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పాపం పెద్దాయన!... పార్టీ కోసం జీవితాన్ని ధారపోస్తే చివరికి మిగిలింది కన్నీరే...

ఒకప్పుడు మహారథిగా వెలుగొందిన లాల్ కృష్ణ అద్వానీ ఇపుడు అంపశయ్యపై పరుండిపోయాడు. పార్టీ కోసం జీవితాన్ని ధారపోస్తే.. చివరికి మిగిలింది కన్నీరే. మోడీతత్వం ముందు అద్వానీ హవా పని చేయలేదు. మోడీ ఇచ్చిన హామీని

పాపం పెద్దాయన!... పార్టీ కోసం జీవితాన్ని ధారపోస్తే చివరికి మిగిలింది కన్నీరే...
, మంగళవారం, 20 జూన్ 2017 (15:58 IST)
ఒకప్పుడు మహారథిగా వెలుగొందిన లాల్ కృష్ణ అద్వానీ ఇపుడు అంపశయ్యపై పరుండిపోయాడు. పార్టీ కోసం జీవితాన్ని ధారపోస్తే.. చివరికి మిగిలింది కన్నీరే. మోడీతత్వం ముందు అద్వానీ హవా పని చేయలేదు. మోడీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు. ఫలితంగా వృద్ధాప్యంలో సర్వస్వం కోల్పోయి నిస్సహాయుడిగా మిగిలిపోయారు.
 
అది 1990 ద్వితీయార్థం.. దేశమంతా ఒకరకమైన వేడి వాతావరణం.. కొందరికి నెత్తురు ఉడుకుతోంది.. ఇంకొందరికి కడుపు రగులుతోంది.. దేశమంతా అలాగే ఉంది. ఒకచోట నివురు గప్పిన నిప్పులా.. మరోచోట తుఫాను ముందు ప్రశాంతతలా.. ఇంకోచోట ఉత్సాహంగా.. ఉంది. ఈ పరిస్థితికి కారణం అద్వానీయే. ఉత్తర భారతదేశంలోని ఒక ఊరిలో.. కాషాయధ్వజాలు రెపరెపలాడుతుండగా రథయాత్రకు శ్రీకారం చుట్టారు. ఈ యాత్ర కాశీ నుంచి కన్యాకుమారి వరకు.  
 
రథయాత్ర సమయంలో అద్వానీ పిడికిళ్లు బిగిస్తూ ఆవేశంగా మాట్లాడుతున్నారు. ఆశ్చర్యపోయేలా మాట్లాడుతున్నారు. గొంతులో గాంభీర్యం. మాటలో స్పష్టత. శాసించే అధికారం ఎప్పుడెప్పుడా అని ఆయన తలలో ఆలోచనలు మండుతున్నాయి. కానీ, ఆయన ఆశించిన అధికారం ఇప్పటికీ దక్కలేదు. 27 ఏళ్లు గడిచిపోయినా ఆ అందలం అందలేదు. మళ్లీ ఇప్పుడు.. అంతకుమించిన అధికారం వచ్చే అవకాశాలూ తీరిపోయాయి. ముఖ్యంగా తన గురువు అద్వానీని రాష్ట్రపతి చేసి ఆయన రుణం తీర్చుకుంటాను అన్న ప్రధాని నరేంద్ర మోడీ మాటలు ఎన్నికల హామీలా మిగిలిపోయాయి. అదేసమయంలో ‘నేను రాష్ట్రపతి రేసులో లేను!’ అన్న అద్వానీ మాట.. శిలాశాసనమై కూచుంది. అదీ, ఆయన మాట చెల్లని ఈ కాలంలో.
 
1984లో కేవలం రెండు సీట్లకే పరిమితమైన బీజేపీ.. ఆ తర్వాత అద్వానీ కృషితో 85 మంది ఎంపీల పార్టీగా అవతరించింది. ఆ తర్వాత రాజీవ్‌గాంధీ హత్య జరిగుండకపోతే 1991లో ఆయన సంకల్పం నెరవేరేదేనేమో. 1992 డిసెంబర్ 6వ తేదీన మహావిధ్వంసం. బాబ్రీ మసీదు కూల్చివేత. అద్వానీ పేరు దేశమంతా మార్మోగిపోయింది. 1996 జరిగిన ఎన్నికల్లో మహారథిని ప్రధానిని చేసే స్థాయిలో కాషాయదండు గెలవలేపోయింది. మిత్రపక్షాలు లౌకికవాదం పల్లవి ఎత్తుకున్నాయి. ఫలితం..! అద్వానీ ప్రియమిత్రుడు అటల్‌ బిహారీ వాజపేయి ప్రధాని అయ్యారు.
 
తొలుత 13 రోజులు పాలించారు. విశ్వాసపరీక్షలో ఓడారు. మళ్లీ ఎన్నికలొచ్చాయి. వాజపేయి మళ్లీ ప్రధాని అయ్యారు. ఈసారి 13 నెలలు పాలించి.. పార్లమెంట్‌లో ఓడారు. మూడోసారి మళ్లీ ప్రధానిగా పగ్గాలు చేపట్టి నాలుగున్నరేళ్లు పాలించారు. ఈ ఆరేళ్లూ అద్వానీ నంబర్‌ వన్‌ అనిపించుకున్నా.. నంబర్‌ టూ స్థానంలోనే ఉండిపోయారు. తదుపరి ఎన్నికల్లో.. 'భారత వెలిగిపోతోంది' అంటూ మళ్లీ రథయాత్ర చేశారు. ప్చ్‌.. ఓటమి ఎదురైంది.
 
ఐదేళ్లు భారంగా గడిచిపోయాయి. మళ్లీ ఎన్నికలు. మళ్లీ ఓటమి. తదుపరి ఐదేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గుజరాత్ ప్రకంపనలు హస్తినకు చేరాయి. మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించడం.. లౌకికవాదిగా మారిపోయిన అద్వానీకి మింగుడుపడలేదు. కానీ పార్టీలో మోడీతత్వం ఒక నాదమైంది. అద్వానీ ఏం చెప్పినా వినే పరిస్థితుల్లో ఎవరూ లేరు. ఆ విషయం ఆయనకూ తెలుసు. అయినా మంకుపట్టు పట్టారు.. కంటతడి పెట్టుకున్నారు.. కారాలూ మిరియాలూ నూరారు.. కానీ, అవేవీ మోడీ కరిష్మా ముందు పనిచేయలేదు.
 
సంకీర్ణ శకంలో.. బంపర్‌ మెజారిటీ సాధించి ఒంటిచేత్తో కాషాయ ధ్వజాన్ని దేశవ్యాప్తంగా రెపరెపలాడించారు నరేంద్ర మోడీ. 'ఇంత సాధించిన మోడీకి కృతజ్ఞతలు' అని అద్వానీ అనడం.. దానికి మోడీ కన్నీరు పెట్టుకోవడం.. గురు-శిష్యుల అనుబంధానికి ప్రతీకగా నిలిచింది. బీజేపీని ప్రజల్లో ప్రత్యక్షంగా తీసుకెళ్లాలని నాడు అద్వానీ ఎంచుకున్న బాబ్రీ వివాదం.. పరోక్షంగా ఆయనకు రాష్ట్రపతి పదవి కూడా రాకుండా చేసింది. ఆశ నిరాశైంది. కన్నీరే ఇక మిగిలింది. ఇపుడూ ఇదే కేసు విచారణకు అద్వానీ కోర్టు గుమ్మం ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది.
webdunia
 
నిజంగా బీజేపీ కోసం అద్వానీ ఎన్నో చేశారు! ఎంతో కష్టపడ్డారు!! తన జీవితాన్ని ధారపోశారు!!!. మిత్రుడి కోసం ప్రధాని పదవినీ త్యాగం చేశారు. నాడు రథయాత్రలో అద్వానీ పక్కన ఉండి సేవలు చేసిన వ్యక్తి.. ఆయన కనుసన్నల్లో పనులు చక్కబెట్టిన మనిషి.. ఆయన మాటతో ముఖ్యమంత్రి అయిన వ్యక్తి.. కష్టకాలంలో ఆ కురువృద్ధుడు ఎవరికి అండగా నిలిచారో... ఆ వ్యక్తే నేడు మేకయ్యాడు!! అద్వానీ ఇపుడు బాధపడకపోవచ్చు. గుండె నిబ్బరం చేసుకుని కేరళ బ్యాక్‌ వాటర్స్‌లో బోటింగ్‌కు వెళ్తుండొచ్చు. అప్పుడప్పుడూ కోర్టు గుమ్మం (బాబ్రీ మసీదు కేసు) దాకా వెళ్లి రావొచ్చు. కానీ.. అద్వానీకి అన్యాయం జరిగిందన్నది కఠోర సత్యం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఫేస్‌బుక్‌లో కామెంట్స్ చేస్తే సరదాగా తీసుకోవాలి.. కేసులు పెట్టకూడదు : ఐవైఆర్ కృష్ణారావు