Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసమాన వీరుడు కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్

అసమాన వీరుడు కామ్రేడ్ చంద్రశేఖర్ ఆజాద్
, మంగళవారం, 23 జులై 2019 (10:59 IST)
చంద్రశేఖర్ సీతారాం తివారీ అలియాస్ చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ ఆజాద్. తెల్లదొరల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన అసమానవీరుడు. భారతదేశం గర్వించదగ్గ ఉద్యమకార్లుల్లో ఆజాద్ ఒకరు. ఈయన జూలై 23వ తేదీన 1906లో జన్మించి, 1931 ఫిబ్రవరి 27వ తేదీన ప్రాణాలు విడిచారు. ఈయన తల్లిదండ్రులు పండిత్ సీతారాం తివారీ, అగరాణీదేవి దంపతులకు ఆజాద్ జన్మించారు. వీరిది ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావో జిల్లా బదర్కా అనే ప్రాంతంలో జన్మించారు. 
 
తమ బిడ్డను మంచి విద్యావంతుడిని చేయాలని తివారీ దంపతులు భావించగా, ఆజాద్‌కు మాత్రం చదువు అబ్బలేదు. దీంతో తల్లిదండ్రుల ఒత్తిడిని భరించలేక తన 13వ యేటనే ఇల్లు వదిలి నాటి బొంబాయికి పారిపోయాడు. అక్కడ ఓ మురికివాడలో నివశిస్తూ జీవించడానికి కూలిపనులకు వెళ్ళసాగాడు. ఈ క్రమంలో ఆయన అనేక కష్టాలుపడ్డారు. అయినప్పటికీ ఇంటిపై ధ్యాసమాత్రం కలగలేదు. అయితే, ఆయనకు సంస్కృతం విద్యను అభ్యసించాలన్న పట్టుదల మాత్రం ఉండేది. దీంతో 1921లో వారణాసికి వెళ్ళిపోయి అకడ సంస్కృత పాఠశాలలో చేరిపోయాడు.
 
ఆ సమయంలో దేశస్వాతంత్ర్యం కోసం మహాత్మాగాంధీ చేస్తున్న సహాయ నిరాకరణోద్యమంతో దేశం యావత్తూ అట్టుడికిపోయింది. అప్పుడే చంద్రశేఖర్ తాను కూడా భారతస్వాతంత్ర్యం కొరకు ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడతని వయస్సు 15 యేళ్లు మాత్రమే. ఉత్సాహంగా తాను చదువుతున్న సంస్కృత పాఠశాలముందే ధర్నా చేశాడు. 
 
పోలీసులు వచ్చి పట్టుకెళ్ళి న్యాయస్థానంలో నిలబెట్టారు. న్యాయమూర్తి అడిగిన ప్రశ్నలకు చంద్రశేఖర్ తలతిక్క సమాధానాలు చెప్పాడు. నీపేరేంటని అడిగితే ఆజాద్ అని, తండ్రి పేరడిగితే స్వాతంత్ర్యం అని, మీ ఇల్లెక్కడ అని అడిగితే జైలు అని తల తిక్క సమాధాలు చెప్పడంతో అతనికి 15 రోజుల జైలుశిక్ష విధించాడు. 
 
ఆ తర్వాత న్యాయమూర్తి ఏమనుకున్నాడోగానీ ఆ జైలుశిక్షను రద్దు చేసి 15 కొరఢా దెబ్బలను శిక్షగా విధించాడు. అతని ఒంటి మీద పడిన ప్రతి కొరడా దెబ్బ అతనికి తాను చేయవలసిన పనికి కర్తవ్వ బోధ చేసింది. ఆ విధంగా చంద్రశేఖర్.... చంద్రశేఖర్ ఆజాద్ అయ్యాడు. ఆ తర్వాత కాలక్రమంలో భగత్ సింగ్ మార్గ నిర్దేశకుడిగా పేరుగాంచాడు. 1857 తర్వాత సాయుధ పోరాటం చేసిన వీరుల్లో మొట్టమొదటివారు. దేశ ప్రజల రక్షణ కోసం ధర్మ యుద్ధమే సరైనది గట్టిగా నమ్మినవారు ఆజాద్.
 
1931, ఫిబ్రవరి 27వ తేదీన తన ఇద్దరు సహచరులను కలిసేందుకు అలహాబాదులోని ఆల్ఫ్రెడ్ పార్క్‌కు చేరుకోగా, ఇన్ఫార్మర్లు ఇచ్చిన సమాచారం మేరకు బ్రిటీష్ పోలీసులు చుట్టుముట్టారు. ఆజాద్‌ను లొంగిపోవాలంటూ హెచ్చరికలు చేశారు. అయినా కూడా మొక్కవోని ధైర్యంతో పోలీసులకు సమాధానిచ్చి... తనను తాను కాల్చుకుని చనిపోయాడు. 
 
సహాయ నిరాకరణోద్యమం ఆజాద్‌లో దాగి ఉన్న విప్లవవాదిని మేల్కొలిపింది. ఎలాగైనా సరే భారతదేశాన్ని బ్రిటీష్‌వారి కబంధ హస్తాల నుంచి విడిపించాల్సిందేనని ఆయన బలంగా నిశ్చయించుకున్నారు. హిందూస్థాన్ సోషలిస్టు రిపబ్లికన్ అసోసియేషన్‌ను ప్రారంభించాడు. ఆ తర్వాత శత్రువు చేత చిక్కక తనను తాను ఆత్మాహుతి చేసుకున్న అమరవీరునిగా భారత ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడైపోయాడు ఈ కామ్రేడ్ చంద్రశేఖర్ అజాద్‌. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీ అసెంబ్లీ : తెదేపా సభ్యులపై వేటు పడింది...