ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల కుప్పగా మారిపోయిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల్ని అధికార వైసీపీ తిప్పి కొడుతోంది. రాష్ట్రాన్ని దివాళా తీయిస్తున్నారని ముఖ్యంగా తెలుగుదేశం నేతలు విమర్శించడం పూర్తిగా అవాస్తమని, ఆ పని చేసింది తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడే అని ఆరోపిస్తున్నారు.
వాస్తవానికి ఏపీ అప్పులను ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే, తక్కువే అని పేర్కొంటున్నారు. ఏపీకి 2021 నాటికి 3.73 లక్షల కోట్ల అప్పులున్నాయి. ఇటీవల వైసీపీ ప్రభుత్వం నవరత్నాలు పథకాల కింద లబ్ధిదారులకు నగదు బదిలీలు చేస్తుంటంతో, ఆ అప్పు మరింత పెరుగుతోంది. సీఎం జగన్ నిర్దేశిత పథకాల కోసం అప్పు చేసి మరీ పథకాలను షెడ్యూల్ తప్పకుండా బలిమి లాక్కొస్తున్నారు.
వివిధ పథకాల కింద లబ్ధిదారులకు తాడేపల్లి కార్యాలయం నుంచి ఒక్క బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లోకి నగదు జమ చేస్తున్నారు. దీనిని ప్రతిపక్షాలు తప్పుపడుతున్నాయి. అప్పులు పెరిగిపోతున్నాయని నానా యాగీ చేస్తున్నారని, వాస్తవానికి ఏపీ అప్పుల్లో అంత దారుణం ఏమీ కాదంటున్నారు... వైసీపీ నేతలు.
దేశంలో అన్నింటికీ మించి ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం 6.03 లక్షల కోట్ల అప్పులో ఉంది. తర్వాత మహారాష్ట్ర 5.01 లక్షల కోట్లు అప్పులతో ఉంది. ఇక మన పొరుగు రాష్ట్రాలను పోల్చితే... తమిళనాడు 4.84 లక్షల కోట్లు , కర్ణాటక 4.57 లక్షల కోట్లు, తెలంగాణా 3.24 లక్షల కోట్ల అప్పులతో ఉన్నాయి. ఏపీ కన్నా చిన్న రాష్ట్రం కేరళ అప్పు 3.27 లక్షల కోట్లు ఉంది. పైగా అక్కడ కమ్యూనిస్టు పార్టీ అధికారంలో ఉంది. రెండో సారి పినరయి విజయన్ సీఎంగా ఎన్నికయ్యారు కూడా.
ఏపీ కన్నా ఎక్కువగానే ఇతర రాష్ట్రాల అప్పులున్నాయని, సంక్షేమం కోసం అప్పు చేస్తే తప్పేంటని వైపీపీ ప్రభుత్వ పెద్దలు వాదిస్తున్నారు. పైగా, వైసీపీ ఎంపీ విజయసాయి మాట్లాడుతూ, లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ మంచిదే అని ప్రపంచ దేశాలు, ఆర్ధిక మేధావులు చెబుతున్నారని వివరణ ఇస్తున్నారు. సో అప్పు చేసి పప్పు కూడా మంచిదే అన్నది ప్రభుత్వ మాట!