Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భగవద్గీతనే కాదు.. బైబిల్‌‌ను కూడా అలా చదివిన సర్వేపల్లి...!

భగవద్గీతనే కాదు.. బైబిల్‌‌ను కూడా అలా చదివిన సర్వేపల్లి...!
, శనివారం, 4 సెప్టెంబరు 2021 (14:39 IST)
జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం సెప్టెంబర్ 5. ఈ రోజున సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను తప్పక స్మరించుకోవాలి. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టినరోజునే జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకతలను తెలుసుకుందాం.. 
 
రాధాకృష్ణన్‌ అద్వైత వేదాంతి. శంకరుల మాయావాదాన్ని యథాతథంగా స్వీకరించలేదు. తన సొంత భాష్యం రాశారు. ఆయన రచనలు హిందూ ధర్మానికి పునరుద్దీపన కలిగించాయి. దార్శనిక శాస్త్రాలను ఆధునిక అవసరాలకు అనుగుణంగా మలచిన ఘనత సర్వేపల్లికే దక్కుతుంది.
 
సర్వేపల్లి గొప్ప మానవతావాది. ప్రతి మానవుడూ అతడి మతమేదైనా, సాంఘిక స్థితిగతులేమైనా పరమేశ్వరుడి రూపంలో పుట్టినవాడే అని నమ్మేవారు. ప్రతి మనిషీ ఆ ఈశ్వరుడికి ప్రియపుత్రుడిగా రాణించగల నిగూఢ శక్తులతో జన్మించినవాడేనని ఆయన అభిప్రాయం.
 
సర్వేపల్లి దృష్టిలో మతం అంటే - శక్తి, సంపదల కోసం కాకుండా.. శాంతి కోసం, సత్యం కోసం నిత్యాన్వేషణ. మతం అనేది సర్వసంగ పరిత్యాగం, ప్రారబ్ధానికి తలొగ్గడమూ కాదు. ధీరోదాత్తంగా సాగిపోవడమే మతం.
 
ప్రస్థాన త్రయానికి ఆంగ్లంలో ఆధునిక దృష్టితో భాష్యం రాశారు సర్వేపల్లి. సోక్రటీస్‌ మొదలుకొని పాశ్చాత్య దార్శనికవేత్తల వరకు అందరి రచనలూ ఆయనకు కంఠోపాఠమే.
 
భగవద్గీతను చదివినంత శ్రద్ధాసక్తులతో బైబిల్‌ చదివారు సర్వేపల్లి. ఖురాన్‌ ఆయనకు కొట్టిన పిండి. సూఫీ తత్వాన్నీ మధించారు.
 
మతం కాలానుగుణంగా మార్పు చెందుతుందన్న విషయం మరచిపోరాదని రాధాకృష్ణన్‌ అనేవారు. ఉపనిషత్తుల ఉపదేశాలు, బుద్ధుడి బోధనలు, గీతా సందేశం ప్రాతిపదికగా జాతీయ జీవనాన్ని తిరిగి నిర్మించుకోవాలని సందేశం ఇచ్చారు.
 
సర్వమతాలవారూ ఇతర మతాల పట్ల విశాలమైన, ఉదారమైన దృక్పథాన్ని అవలంబించాలని సర్వేపల్లి ప్రబోధించారు. ఎవరైనా ఇతర మతాలను, సంస్కృతులను విమర్శించడాన్ని ఆయన అంగీకరించేవారు కారు.
 
సమాజంలో పండితులేగాని నిజమైన తత్వవేత్తలు కనిపించడం లేదని, సృజనాత్మకత కొరవడిందని సర్వేపల్లి ఆవేదన వ్యక్తం చేసేవారు. వారసత్వ సంపద ఎవరినీ మానసిక దాస్యానికి గురిచేయకూడదని మన మహర్షులు కూడా హితవు పలికారని.. అలా వారు నూతన సత్యాలు కనుగొనడానికి, అలాంటి పరిష్కారాలనే సూచించడానికి ఆసక్తి కనబరిచారని వివరించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేవాదాయ మంత్రికి స్వరూపానందేంద్ర స్వామి సూచనలు