Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ప్రచారంతో జనసేనానిని దెబ్బతీయడం సాధ్యమా..?

Advertiesment
ఆ ప్రచారంతో జనసేనానిని దెబ్బతీయడం సాధ్యమా..?
, శనివారం, 1 డిశెంబరు 2018 (21:24 IST)
బిజెపి, వైసిపి, జనసేన, టిఆర్‌ఎస్‌ ఈ నాలుగు పార్టీలూ లాలూచీ పడ్డాయని నెల్లూరు ధర్మపోరాట దీక్ష సభలో చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తాను బిజెపిపై పోరాడుతుంటే జగన్‌, పవన్‌ కల్యాణ్‌, కెసిఆర్‌ బిజెపితో కలిసి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. మోడీ చెప్పడం వల్లే తెలంగాణ ఎన్నికల్లో వైసిపి, జనసేన పోటీ చేయలేదంటున్నారు.
 
తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలే తమకు ముఖ్యమని వైసిపి స్పష్టంగానే చెబుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో దృష్టి మరల్చి అక్కడ రాజకీయాలు చేయలేమని, అందుకే పోటీ చేయడం లేదని చెబుతూవస్తోంది. ఆ పార్టీకి సంబంధించినంత వరకు ఇది సరైన వ్యూహమే. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణలో తలదూర్చడం వల్ల వైసిపికి నష్టమే తప్ప లాభం లేదంటున్నారు విశ్లేషకులు. 
 
తెలుగుదేశం కూడా ఇదే వైఖరి తీసుకుని వుండొచ్చు. అభ్యంతరపెట్టేవాళ్లు ఉండరు. తెలంగాణ ఎన్నికల బరిలో టిడిపి ఉన్నా… ఆ పార్టీ పోటీ చేస్తున్నది 13 స్థానాలు మాత్రమే. పొత్తు పేరుతో కాంగ్రెస్‌కు తెలంగాణను వదులుకున్న టిడిపి... మీరెందుకు పోటీ చేయడం లేదని వైసిపి, జనసేనలను ప్రశ్నించడం విచిత్రంగా ఉంటుంది.
 
బిజెపితో కలిసిపోయారని జగన్‌ను విమర్శిస్తున్న చంద్రబాబు నాయుడు… బిజెపితో తెగదెంపులు చేసుకునే దాకా…. పిల్ల కాంగ్రెస్‌, తల్లి కాంగ్రెస్‌ కలిసిపోతాయని పదేపదే చెబుతూ వచ్చారు. చంద్రబాబు చెప్పినట్లు జగన్‌ కాంగ్రెస్‌తో కలవలేదుగానీ… చంద్రబాబు నాయుడే కాంగ్రెస్‌తో కలిసిపోయారు. వైపిపి- కాంగ్రెస్‌ కలిసిపోతాయని ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడే ఇప్పుడు వైసిపి- బిజెపి కలిసిపోతాయని చెబుతున్నారు.
webdunia
 
ఇక పవన్‌ కల్యాణ్‌ స్పష్టంగా ఉన్నారు. వామపక్షాలతో కలిసి రాజకీయాలు నడుపుతున్నారు. వైసిపికి, టిడిపికి ప్రత్యామ్నాయంగా ఏర్పడిన కూటమిలో కలిసి పని చేస్తున్నారు. తమకు వైసిపితో ఎటువంటి పొత్తూ ఉండదని పవన్‌ ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు. అయినా జగన్‌-పవన్‌ కలిసిపోయారని తెలుగుదేశం ఆరోపిస్తూనే ఉంది.
 
అటు బిజెపితోనైనా ఇటు కాంగ్రెస్‌తోనైనా కలిసిపోయింది తెలుగుదేశమే. గత ఎన్నికల్లో బిజెపితో ఎందుకు కలిశారంటే రాష్ట్రం కోసమని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్‌తో ఎందుకు కలిశారంటే దానికీ అదే కారణం చూపుతున్నారు. తెలుగుదేశం ఈ ప్రచారం చేయడం వెనుక ప్రధాన లక్ష్యం…. పవన్‌ను దెబ్బతీయడమే. గత ఎన్నికల్లో పవన్‌ కళ్యాణ్‌ అభిమానులంతా టిడిపికి ఓటు వేశారు. ఏం చేసినా జగన్‌ ఓట్లు ఎటూరావు. ఏం చేసైనా పవన్‌ ఓట్లను కాస్తోకూస్తో మళ్లించుకోడానికి అవకాశముంది. అందుకే పవన్‌ ఒంటరిగా పోటీ చేయడం లేదని, వైసిపితో, బిజెపితో కలిసిపోయారన్న ప్రచారం మొదలుపెట్టారు. ఈ ప్రచారాన్ని జనం నమ్ముతారా? తెలుగుదేశం ఎత్తులు పారుతాయా? అన్నది చూడాల్సి వుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మందేసి డ్రైవ్ చేస్తున్నారా సార్... వెయ్యిస్తే తప్పించేస్తాం...