Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీరు మాత్రం ఆవిధంగానే ముందుకు వెళ్లండి... సస్పెండ్ చేస్తే చేయనివ్వండి...

పార్లమెంటులో టిడీపి ఎంపీలు అవిశ్వాస తీర్మానం నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... '' తలుపులు మూసి ఏకపక్షంగా విభజన బిల్లు ఆమోదించి ఏపికి అన్యాయం చేశారని ఫిబ్రవరి 7న లోక్ సభ సమావేశా

మీరు మాత్రం ఆవిధంగానే ముందుకు వెళ్లండి... సస్పెండ్ చేస్తే చేయనివ్వండి...
, బుధవారం, 18 జులై 2018 (22:41 IST)
పార్లమెంటులో టిడీపి ఎంపీలు అవిశ్వాస తీర్మానం నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంపీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ... '' తలుపులు మూసి ఏకపక్షంగా విభజన బిల్లు ఆమోదించి ఏపికి అన్యాయం చేశారని  ఫిబ్రవరి 7న లోక్ సభ సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోదినే పేర్కొన్నారు. అదే విషయాన్ని ప్రస్తుత సమావేశాల్లో ప్రస్తావించాలి. నాలుగేళ్లు అయినా అప్పుడు జరిగిన అన్యాయాన్ని ఎందుకు చక్కదిద్దలేదని నిలదీయాలి. ఒక లక్ష్యం కోసం మనం పోరాటం చేస్తున్నాం. మన కోసం మనం పోరాడుతున్నాం. రాష్ట్రం కోసం పోరాడుతున్నాం. భావి తరాల భవిష్యత్తు కోసం పోరాడుతున్నాం. సభ నుంచి సస్పెండ్ చేస్తే చేయనివ్వండి. ఏ పరిణామానికైనా సిద్ధం కండి. పట్టుదలతో పోరాటం చేయండి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టండి. కలిసివచ్చే పార్టీల సహకారం తీసుకోండి.
 
యావత్ రాష్ట్రం ఢిల్లీవైపే చూస్తోంది. పార్లమెంటు పైనే 5 కోట్ల ప్రజల దృష్టి వుంది. రాష్ట్ర ప్రయోజనాలపై రాజీలేని పోరాటం  చేయండి. విభజన చట్టంలో అంశాల అమలుకు ఒత్తిడి చేయండి. ప్రధాని హామీలు నెరవేర్చాలని పోరాడండి. పోరాటం మనకు కొత్తేమీ కాదు. చట్టం ఎందుకు అమలు చేయరని సభ సాక్షిగా నిలదీయండి. మనకు ఎక్కడ అన్యాయం జరిగిందో అక్కడే నిగ్గదీయండి. వాళ్ల అన్యాయం చక్కదిద్దుతామని బిజెపి చెప్పింది. 
 
ఇప్పుడు బిజెపి నేతలే అన్యాయం చేస్తున్నారు. ఇది నమ్మిన వారిని మోసగించడం కాదా..? మోసం చేసినవారిని ప్రజాకోర్టులో దోషులుగా నిలబెట్టండి. ఏ పార్టీలు మనకు మద్దతు ఇస్తాయో ప్రజలే చూస్తారు. పోరాటం సమయంలో వైసిపి ఎంపిలు గోదా వదిలేశారు. సభలో పోరాడకుండా రాజీనామా చేసి బైటకొచ్చి పోరాడుతున్నట్లు నటిస్తున్నారు. వైసిపి పలాయన వాదానికి ఇదే నిదర్శనం. బిజెపికి మేలు చేసేందుకే వైసిపి రాజీనామాలు తప్ప వాటివల్ల రాష్ట్రానికి ప్రయోజనం శూన్యం. వాళ్ల రాజీనామాలను ప్రజలు పట్టించుకోవడం లేదు. 
 
వైసిపికి వాయిస్ లేకుండా పోయింది. దిక్కుతోచని స్థితిలో వైసిపి పడింది. వాళ్ల విశ్వసనీయత పోయిందని మన విశ్వసనీయత దెబ్బ తీయాలని చూస్తున్నారు. ప్రత్యర్ధుల కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలి. సున్నా నుంచి 4 ఏళ్లలో రాష్ట్రాన్ని ఈ స్థాయికి తెచ్చాం. వ్యవసాయం అనుబంధ రంగాలలో ముందున్నాం. పరిశ్రమలు, సేవారంగాలలో ప్రగతి కోసం శ్రమిస్తున్నాం. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు సాధించాం. ప్రజలు అద్భుతంగా సహకరిస్తున్నారు. కేంద్రం సహకరించకపోవడం దుర్మార్గం. 
 
విభజన చట్టంలో అంశాలు, హామీలు నెరవేర్చక పోవడం దుర్మార్గం. బిజెపి ధోరణి వల్ల రాజకీయ పార్టీలపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ప్రజాస్వామ్యంపై నమ్మకం కోల్పోయే ప్రమాదం వచ్చింది. కేంద్రాన్ని ఈ విధంగా సవాల్ చేసిన రాష్ట్రం లేదు. మనకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. అందుకోసం ఎందాకా అయినా వెళ్తాం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో పార్టీ ఎంపిలు అందరూ సమన్వయంతో పనిచేయాలి. ఇతర పార్టీల ఎంపిలను సమన్వయం చేసుకోవాలి. వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. లాలూచి రాజకీయాలను ఎండగట్టాలి.
 
కావాల్సిన సమాచారం ఇవ్వడానికి అధికార యంత్రాంగం సిద్దంగా ఉంది. ఎంపిలు దానిని సమర్ధంగా వినియోగించుకోవాలి'' అని అన్నారు. గత రెండురోజులుగా ఢిల్లీలో వివిధ పార్టీల నేతలను కలిసి మద్దతు కోరినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంపిలను అభినందించారు.

ఇదే స్ఫూర్తి పార్లమెంట్ సమావేశాల్లో కూడా చూపాలన్నారు. తాను ఎప్పటికప్పుడు ఢిల్లీ పరిణామాలను గమనిస్తుంటానని తెలిపారు. ఈ సందర్భంగా లోక్ సభ, రాజ్యసభ స్పీకర్లు నిర్వహించిన అఖిలపక్షం సమావేశాలలో చర్చల సారాంశాన్ని ముఖ్యమంత్రికి ఎంపిలు వివరించారు. మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్‌తో తన భేటి వివరాలను ముఖ్యమంత్రి తెలిపారు. ఉండవల్లి అందజేసిన పుస్తకాలు, నివేదికలు, కోర్టు కేసులలోని అంశాలను అధ్యయనం చేయాలని సూచించారు. ఈ టెలికాన్ఫరెన్స్‌లో టిడిపి పార్లమెంటరీ పార్టీ నేతలు వైఎస్ చౌదరి, తోట నరసింహం, గల్లా జయదేవ్, సీఎం రమేష్, ఇతర ఎంపీలు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆవిధంగా టిటిడి పరువు మాత్రం పోయినట్లయ్యింది... (Video)