Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పన్నీరును పక్కనబెట్టేశారు.. పళని సామిని పైకితెచ్చారు.. అంతా బీజేపీ మాయ!? శశి-తంబిదురై చక్రం తిప్పారా?

పన్నీర్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు, సీఎం అభ్యర్థిగా పళనిసామి పేరును తెరపైకి తేవడంలో బీజేపీ హస్తముందని రాజకీయ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

పన్నీరును పక్కనబెట్టేశారు.. పళని సామిని పైకితెచ్చారు.. అంతా బీజేపీ మాయ!? శశి-తంబిదురై చక్రం తిప్పారా?
, మంగళవారం, 14 ఫిబ్రవరి 2017 (14:42 IST)
తమిళనాడులో అమ్మ మరణానికి తర్వాత అన్నాడీఎంకే పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీలో బీజేపీ ప్రమేయం ఎక్కువైంది. అమ్మ మరణానికి తర్వాత శశికళకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించినప్పుడు కామ్‌గా ఉండి.. పన్నీర్ నుంచి సీఎం పదవిని పీకేసినప్పుడు సైలెంట్‌గా ఉండి.. ఆపై పన్నీరే సీఎం అని ప్రజలంతా అనుకునే సందర్భంలో అన్నాడీఎంకే సీనియర్ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురైని చేతిలో పెట్టుకుని బీజేపీ అస్త్రాలను ప్రయోగిస్తోంది. పన్నీర్ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు, సీఎం అభ్యర్థిగా పళనిసామి పేరును తెరపైకి తేవడంలో బీజేపీ హస్తముందని రాజకీయ పండితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 
 
అంతా బీజేపీ చేస్తూ.. ఏమీ తాము చేయలేదని చెప్తూ.. తన పని తాను చేసుకుంటూ పోతోంది. శశికళను జైలుకు పంపి.. పన్నీరును ఇంటికి పంపి.. మెల్లగా పార్టీలో క్రేజ్ లేని వారిని సీఎం పదవికి అప్పగించి తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ ప్రాభవాన్ని తగ్గించేందుకు బీజేపీ చేసే ప్రయత్నం దాదాపు సక్సెస్ అయినట్టే తెలుస్తోంది. పన్నీరు సభ్యత్వాన్ని రద్దు చేయడం ద్వారా.. ఆయన వెంట ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య తగ్గిపోవడం ద్వారా ఆయన సీఎం పోస్టు కోసం పోటీ పడలేరని తంబిదురై చావు కబురు చల్లగా చెప్తున్నారు. ఇన్నాళ్ల పాటు నోరు మెదపని తంబిదురై చిన్నమ్మ జైలుకెళ్లగానే సీన్లోకి వచ్చారు. 
 
దీంతో తంబిదురైని వెనక నుంచి నడిపేది బీజేపీనేనని రాజకీయ పండితులు అంటున్నారు. ఇందు కోసం తంబిదురై సుప్రీం కోర్టు తీర్పు రాకముందే శశికళను కలిశారని సమాచారం. దీనినిబట్టి చిన్నమ్మ జైలుకెళ్లినా ఎమ్మెల్యేలను చేతిలో వేసుకుని తన పని కానిచ్చిందని టాక్ వస్తోంది. ఇందుకు పావుగా తంబిదురైని ఉపయోగించుకున్నారని పండితులు చెప్తున్నారు. కోర్టు తీర్పు చిన్నమ్మను ఇబ్బంది పెట్టింది. దీంతో ఆమె వర్గీయులు నిరాశకు గురైయ్యారు. కానీ పన్నీర్ క్యాంపులో జోష్ పెరిగింది. అయితే పళనిసామి పేరును తెరపైకి తేవడంతో సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
 
అయినా పన్నీరే బలపరీక్షలో నెగ్గుతారని ఆశిస్తున్నారు. ఇదేవిధంగా నెటిజన్లు సైతం పళనిసామి పేరును తెరపైకి తేవడంపై ఫైర్ అవుతున్నారు. శశికళ పన్నాగాలను బయటికి తెచ్చి అమ్మ ఆశయాలను ముందుకు తీసుకునేందుకు శతవిధాలా ప్రయత్నించిన పన్నీరును వెలివేయడంపై నెటిజన్లు ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో పన్నీరు-పళనిసామిల మధ్య వార్ ఎలాగుంటుందో తెలియాలంటే వేచి చూడాలి. ఈ రాజకీయ సంక్షోభానికి ఇన్‌ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ తెరదించితే మంచిదని లేకుంటా తీవ్ర పరిణామాలు నెలకొనే ఛాన్సుందని రాజకీయ పండితులు జోస్యం చెప్తున్నారు. 
 
బలపరీక్ష కోసం ఓటేసిన ప్రజల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకుని అన్నాడీఎంకే పార్టీ పెద్దలు వ్యవహరించాలని లేకుంటే తదుపరి ఎన్నికల్లో పార్టీ గతి అధోగతి అవుతుందని వారు జోస్యం చెప్తున్నారు. ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న పన్నీరుకు ఎమ్మెల్యేలు మద్దతివ్వాలని లేకుంటే నియోజకవర్గంలో వారికి పరాభవం తప్పదని వారు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశి'కల' కల్లలైన వేళ... శశి 'సింహం'ను బోనులో పెట్టిన కేసు ఇదీ...