Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఒట్టు తీసి గట్టు మీద పెట్టి... ఏకంగా రెండు చోట్ల గెలిచిన ఒమర్ అబ్దుల్లా...

omar abdullah

ఠాగూర్

, బుధవారం, 9 అక్టోబరు 2024 (09:43 IST)
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీకి ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెల్లడయ్యాయి. ఈ ఫలితాల్లో మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా సారథ్యంలోని నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ పార్టీలు కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి, ఫరూక్ అబ్దుల్లా తనయుడు ఒమర్ అబ్దుల్లా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇకపై ఎన్నికల్లో పోటీ చేయనంటూ గతంలో ప్రకటించారు. కానీ, ఎన్నికల నోటిఫికేషన్ వెల్లడైన వెంటనే తన ఒట్టు తీసి గట్టుమీద పెట్టారు. పైగా, రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి విజయం సాధించారు. ఫలితంగా జమ్మూకాశ్మీర్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
జమ్మూకాశ్మీర్‌లో అబ్దుల్లా కుటుంబానిది విడదీయలేని అనుబంధం. మూడు తరాలుగా రాజకీయాలను శాసిస్తున్నారు. తాత షేక్ అబ్దుల్లా, తండ్రి ఫరూక్ అబ్దుల్లా, వారిద్దరి బాటలోనే ఒమర్ అబ్దుల్లాలు కొనసాగుతున్నారు. ఈ ముగ్గురూ జమ్మూకాశ్మీర్‌కు ముఖ్యమంత్రులుగా చేసిన వారే. కుటుంబ రాజకీయ వారసత్వాన్ని అందుకున్న 54 ఏళ్ల ఒమర్ అబ్దుల్లా మరోసారి సీఎం పదవిని అధిరోహించటానికి రంగం సిద్ధం చేసుకున్నారు.
 
కేంద్ర ప్రభుత్వం 2019లో రాజ్యాంగ అధికరణం 370 రద్దు చేయడంతో అప్పటివరకూ ఉన్న ప్రత్యేక ప్రతిపత్తి హోదాను జమ్మూకాశ్మీర్ కోల్పోయింది. దీంతో పాటు ఆ రాష్ట్రం రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిపోయింది. జమ్మూకాశ్మీర్‌కు తిరిగి రాష్ట్ర హోదా కల్పించాలన్నది ఫరూక్ అబ్దుల్లా నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ ప్రధాన డిమాండ్. ఆ పార్టీ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా కూడా గత ఐదేళ్లుగా అందు కోసమే పట్టుపట్టారు. 
 
కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నంత వరకూ జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో అడుగుపెట్టబోనని, ఎన్నికల్లో పోటీ చేయనని ఒమర్ ఒట్టు పెట్టుకున్నారు. కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలో అడుగుపెట్టి తనను తాను అవమానించుకోలేనని చెప్పిన ఒమర్... ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించడంతో ఒట్టు తీసి గట్టు మీద పెట్టారు. ఏకంగా రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి విజయం సాధించారు.
 
దేశ స్వాతంత్ర్యం అనంతరం జమ్మూకాశ్మీర్ రాజకీయాలను సుదీర్ఘ కాలం శాసించిన అబ్దుల్లా కుటుంబం ఆ తర్వాత క్రమంగా ప్రాభవాన్ని కోల్పోయింది. అయితే, 2019లో అధికరణం 370 రద్దయిన తర్వాత వీరి నేతృత్వంలోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ప్రజల మద్దతు పెరిగింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఒమర్ అబ్దుల్లా... అసెంబ్లీ ఎన్నికలకు గట్టి వ్యూహం సిద్ధం చేసుకున్నారు. 
 
తన కుటుంబానికి పట్టున్న గండేర్బల్ నియోజకవర్గంతో పాటు బుద్దాం స్థానం నుంచీ పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీతో ఎన్నికలకు ముందే పొత్తు ఖరారు చేసుకున్నారు. 2002లో గండేర్బల్ శాసనసభ స్థానంలో ఓడిపోయిన తర్వాత అదే ప్రాంతం నుంచి 2004లో ఒమర్ లోక్‌‍సభకు ఎన్నికయ్యారు. అంతకుముందు 1998, 1999 పార్లమెంటు ఎన్నికల్లో విజయం ఆయన విజయం సాధించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రియుడి కోసం భర్త, పిల్లలను వదిలి హైదరాబాద్‌కు వచ్చిన లండన్ మహిళ!