Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టీడీపీలో పొలిటికల్ కెరీర్ ప్రారంభించి.. ఆ పార్టీతోనే ప్రస్థానం ముగించిన భూమా నాగిరెడ్డి

కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 54 యళ్లు. 20 యేళ్ల వయసులో తెలుగుదేశం పార్టీలో తన ర

టీడీపీలో పొలిటికల్ కెరీర్ ప్రారంభించి.. ఆ పార్టీతోనే ప్రస్థానం ముగించిన భూమా నాగిరెడ్డి
, ఆదివారం, 12 మార్చి 2017 (13:11 IST)
కర్నూలు జిల్లా నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి కన్నుమూశారు. ఆదివారం గుండెపోటుకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు వయసు 54 యళ్లు. 20 యేళ్ల వయసులో తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ కేరీర్‌ను ప్రారంభించి, తిరిగి అదే పార్టీలో తన ప్రస్థానాన్ని ముగించారు. భూమా నాగిరెడ్డి రాజకీయ కెరీర్‌ను పరిశీలిస్తే... 
 
భూమా బాలిరెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు భూమా నాగిరెడ్డి చిన్న కుమారుడు. ఫ్యాక్షన్ రాజకీయాల్లో ఉన్న బాలిరెడ్డి తన కుమారుడు భూమా నాగిరెడ్డిపై ఆ ప్రభావం పడుకుండా జాగ్రత్తపడ్డారు. చెన్నైలో పాఠశాల విద్య, అనంతరం వైద్య విద్య కోసం బెంగళూరు పంపించారు. కానీ, బాలిరెడ్డి హత్య తర్వాత భూమా వెనక్కి వచ్చి రాజకీయాల్లోకి చేరిపోయేలా చేసింది. భూమా నాగిరెడ్డి 1984లో తొలిసారిగా రుద్రవరం కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అనంతరం 1986 నుంచి 1990 వరకు ఆళ్లగడ్డ మండల పరిషత్ ప్రెసిడెంట్‌గా కొనసాగారు.
 
ఈ సోదరుడు భూమా శేఖర్ రెడ్డి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉంటూ ఆకస్మిక మరణానికి గురయ్యారు. 15 ఏళ్ల క్రితం ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న భూమా శేఖర్ రెడ్డి 1991 జూన్ 7న గుండెపోటు కారణంగా మృతి చెందారు. దీంతో భూమా నాగిరెడ్డి రాజకీయాల్లోకి వచ్చారు. 1992లో జరిగిన ఉప ఎన్నికల్లో భూమా నాగిరెడ్డి అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత భూమా నాగిరెడ్డి 11, 12, 13వ లోక్‌సభలకు వరుసగా ప్రాతినిథ్యం వహించారు. 
 
1996లో నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి నాటి ప్రధానమంత్రి పి.వి.నరసింహా రావుపై పోటీ చేసేందుకు టీడీపీ భూమా నాగిరెడ్డిని ఎంపిక చేశారు. దీంతో ఆయన పేరు ఒక్కసారి రాష్ట్రంలోనే కాకుండా, దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఎన్నికలో పీవీ చేతుల్లో ఓటమి పాలయ్యారు. అయితే, పీవీ నరసింహా రావు ఒడిషా రాష్ట్రంలోని బెర్హంపూర్ లోక్‌సభ స్థానం ప్రాతినిథ్యాన్ని ఉంచుకుని నంద్యాల స్థానానికి రాజీనామా చేశారు. ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో 4 లక్షల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 
 
ఆ తర్వాత సినీ నటుడు చిరంజీవి ఆధ్వర్యంలో ప్రజారాజ్యం పార్టీ అవతరణతో భూమా టీడీపీకి 2008 జూలై 4న రాజీనామా చేశారు. ఆగస్టు 20వ తేదీన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ప్రజారాజ్యం టికెట్‌పై నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆయన శ్రీమతి శోభానాగిరెడ్డి మాత్రం ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానానికి విజయం సాధించారు.
webdunia
 
అయితే, 2010లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో సొంత వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి పరిణామాలతో చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఈ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన వారిలో భూమా నాగిరెడ్డి ఒకరు. అయినా తన మాట నెగ్గకపోవడంతో ఆయన ప్రజారాజ్యాన్ని వీడి జగన్ చెంతకు వచ్చారు. 
 
ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డితో రాజకీయపరంగా విభేదాలు రావడతో తిరిగి తాను తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన తెలుగుదేశం పార్టీలో గత యేడాది ఫిబ్రవరి నెలలో చేరారు. ఆయన కుమార్తె భూమా అఖిల ప్రియ తల్లి మరణం తర్వాత ఆళ్లగడ్డ స్థానానికి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు.
 
తన సహధర్మ చారిణి భూమా శోభానాగిరెడ్డి మరణించిన మూడేళ్లకే భూమా నాగిరెడ్డి కూడా మరణించడంతో ఆయన కుమార్తెలు, కుమారుడు తల్లీదండ్రుల అండను కోల్పోయిన విచారకర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. నాగిరెడ్డికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. 2014 ఏప్రిల్ 24న జరిగిన రోడ్డు ప్రమాదంలో శోభానారెడ్డి తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భూమా నాగిరెడ్డి ఇకలేరు... పత్రిక కార్యకర్తలతో మాట్లాడుతూనే కుప్పకూలిపోయారు..