Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సీఎం జగన్ కేబినెట్ విస్తరణ : కొత్త మంత్రుల బయోగ్రఫీ ఇదే...

సీఎం జగన్ కేబినెట్ విస్తరణ : కొత్త మంత్రుల బయోగ్రఫీ ఇదే...
, బుధవారం, 22 జులై 2020 (14:19 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా ఇద్దరు మంత్రులు చేరారు. వారి పేరు చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, అప్పలరాజు. వీరు రాష్ట్ర మంత్రులుగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయించారు. 
 
ఏపీ రాజ్‌భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం జగన్, స్పీకర్ తమ్మినేని, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కరోనా కారణంగా కొద్ది మంది అతిథులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో చాలా మంది రాజ్‌భవన్‌కు వచ్చినా లోనికి అనుమతించలేదు. 
 
ఇటీవల రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో ఏపీ నుంచి నలుగురు ఎంపీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారిలో రాష్ట్ర మంత్రులుగా పని చేస్తున్న పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణలు ఉన్నారు. వీరి స్థానాలను కొత్తవారితో ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి భర్తీ చేశారు. కొత్తగా మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వారి వివరాలను పరిశీలిస్తే, 
 
చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ..
తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రాజకీయ ఎదుగుదల అనూహ్యమనే చెప్పాలి. వ్యాపారం చేసుకునే ఈయనకు సామాజిక సమీకరణాల్లో భాగంగా 2001లో కాంగ్రెస్‌లో రాజోలు నుంచి(స్థానికేతరుడైనా) జడ్పీటీసీ సీటు లభించింది. 
 
2006లో మలికిపురం నుంచి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 2008 నుంచి 2012 వరకు జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఉన్నారు. 2014లో కాకినాడ రూరల్‌ నుంచి(స్థానికేతరుడైనా) వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. 
 
2019లో రామచంద్రపురం నుంచి వైసీపీ టిక్కెట్‌ను అనూహ్యంగా దక్కించుకుని విజయం సాధించారు. ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిన పిల్లి సుభాస్‌ చంద్రబోస్‌ వేరే నియోజకవర్గానికి మారగా, చెల్లుబోయినకు ఆ టికెట్‌ దక్కింది. ఇక, ఇప్పుడు బోస్‌ ఖాళీ చేసిన మంత్రి పీఠం వేణుకు దక్కడం గమనార్హం.
 
సీదిరి అప్పలరాజు...
శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే డాక్టర్‌ సీదిరి అప్పలరాజు 1980లో వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడ అనే మత్స్యకార గ్రామంలో జన్మించారు. విశాఖ జిల్లా సింహాచలంలోని ఏపీ రెసిడెన్షియల్‌ పాఠశాలలో పదో తరగతి చదివారు. రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంకు సాధించారు.
webdunia
 
కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌లో రాష్ట్ర స్థాయి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎండి(జనరల్‌ మెడిసిన్‌) చదువుకున్నారు. అనంతరం కేజీహెచ్‌లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగాన్ని ప్రారంభించారు. 2007లో పలాస-కాశీబుగ్గలో ‘సేఫ్‌’ ఆస్పత్రి ఏర్పాటు చేసి ప్రజావైద్యునిగా గుర్తింపు పొందారు. 
 
అప్పలరాజు, శ్రీదేవి దంపతులకు అరవ్‌, అర్నవ్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన తొలిసారి పలాస నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. కాగా, పదో తరగతిలో ప్రతిభా అవార్డును అప్పటి సీఎం చంద్రబాబు చేతులమీదుగా అందుకోవడం విశేషం.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎస్ఈసీగా నిమ్మగడ్డను నియమించండి : ఏపీ సర్కారుకు గవర్నర్ ఆదేశం