Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాయిబాబా భక్తులకి, స్వరూపానంద స్వామికి మధ్య చిచ్చుపెట్టిందెవ‌రు?

షిర్డీ సాయి దేవుడు కాద‌ని... ఆయ‌న్ని పూజిస్తే, ప్రేతాత్మ‌ని పూజించిన‌ట్లేన‌ని ద్వారకా పీఠాధిపతి స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి చెపుతున్నారు. దీనితో స‌ద‌రు స్వామీజికి, షిర్డీ సాయి భక్తుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అస‌లింత‌కీ ఈ వివాదానికి మ

సాయిబాబా భక్తులకి, స్వరూపానంద స్వామికి మధ్య చిచ్చుపెట్టిందెవ‌రు?
, బుధవారం, 2 నవంబరు 2016 (14:41 IST)
షిర్డీ సాయి దేవుడు కాద‌ని... ఆయ‌న్ని పూజిస్తే, ప్రేతాత్మ‌ని పూజించిన‌ట్లేన‌ని ద్వారకా పీఠాధిపతి స్వామి శ్రీ స్వరూపానంద సరస్వతి చెపుతున్నారు. దీనితో స‌ద‌రు స్వామీజికి, షిర్డీ సాయి భక్తుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. అస‌లింత‌కీ ఈ వివాదానికి మూల బిందువు ఎవ‌రు?
 
హిందూ దేవాల‌యాల‌పై ఎండోమెంట్ ఉక్కుపాదం
పూర్వం తెలుగు పల్లెల్లో, పట్ట‌ణాల‌లో ప్రజలు గుడి కట్టాలని అనుకుంటే, రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వ‌ర స్వామి, నరసింహ స్వామి దేవాలయాల‌ను నిర్మించేవారు. వాటి ఆలనా పాలనా వ్యవస్థాపకులు వంశ పారంపర్య హక్కులతో నిర్వహించే వారు. ట్రస్టీల పాలనలో ఉన్న దేవాలయాలు అక్కడక్కడా గాడి త‌ప్పుతున్నాయ‌ని భావించిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం, దేవాలయాల స్థితిగతుల మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వవలసినదిగా జస్టిస్ చల్లా కొండయ్య కమిటీని కోరింది. ఆయన ఇచ్చిన నివేదిక ఆధారంగా 1987లో ఆంద్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టానికి ముఖ్యమైన సవరణలు చేశారు. 
 
1987లో వచ్చిన చట్ట సవరణలు ప్రకారం వంశ పారంపర్య ధర్మకర్తల హక్కులు రద్దు చేయడమే కాక‌, వారికి ఇచ్చే అన్ని రకాల ప్రయోజనాలు నిలుపు చేశారు. మిరాశీ హక్కులు రద్దు చేశారు. చెక్ పవర్ కార్యనిర్వహణాధికారులకు ఇచ్చారు. దీని మీద హిందూ సంస్థలు కొన్ని సుప్రీంకోర్టు వరకు వెళ్లగా, దానికి సంబంధించిన తీర్పు 1996లో వచ్చింది. ఈ లోపు రాజకీయ నాయకుల కనుసన్నల్లో నడిచే దేవాలయ అధికారుల పాలన వేళ్లూనుకుంది. పూజారులు, ట్రస్టీలు గుళ్లను మాయం చేస్తున్నారని అధికారులకు పాలన అప్పచెపితే వారు ఏకంగా గుళ్లో లింగాలను మాయం చేయడం మొదలు పెట్టారు. 1996లో సుప్రీంకోర్టు, వ్యవస్థాపక ధర్మకర్తల కుటుంబ సభ్యుల హక్కులను గుర్తిస్తూ అర్హత ఉన్న వారిని చైర్మన్లుగా నియమించాలని ఆదేశించింది. ఆ తర్వాత 2013లో డాక్టర్ సుబ్రమణ్య స్వామి చిదంబరం దేవాలయం కేసులో ఒక లాండ్ మార్క్ తీర్పు వ‌చ్చింది. 
 
దేవాలయాలలో అక్రమాలు జరిగితే ఆ వంకతో దేవాలయాలలో ఇ.ఓ. ల పెత్తనం చెల్లదని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. ఏదైనా అవకతవకలు జరిగితే ఒక పరిమిత కాలానికి మాత్రమే అధికారిని నియమించి, సమస్య సరిచేసి తిరిగి సంబంధిత వ్యక్తులకు దేవాలయాల నిర్వహణ అప్పచెప్పాల‌ని తీర్పు చెప్పింది. అయినా సరే ఈ తీర్పును గౌరవించి హిందువులకు దేవాలయాలు అప్పచెప్పడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ఆ కేసులోని తీర్పు కేవలం చిదంబరం దేవాలయానికే వర్తిస్తుందని కుంటి సాకులు చెప్పడంతో 2012లో స్వర్గీయ దయానంద సరస్వతి కోర్టులో రిట్ పిటిష‌న్ వేశారు. ఈ కేసులో డాక్టర్ సుబ్రమణ్య స్వామి ఇంప్లిడ్ పిటిషనర్‌గా చేరి వారి వాదనలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఆ కేసు వచ్చే నెలలో ఫైనల్ ఆర్గ్యూమెంట్‌కి వ‌స్తోంది. అది హిందూ సంస్థలకు, రాజకీయ అధికారానికి మధ్య జరుగుతున్న న్యాయ పోరాటం చరిత్ర. 
 
హిందూ దేవాల‌యాల ప్రాభ‌వం త‌గ్గిపోతోందనే బాధ‌
1987లో చల్లా కొండయ్య సూచనల మేరకు ఆంద్రప్రదేశ్ ఎండోమెంట్ చట్టం మార్చిన తర్వాత సాంప్రదాయ దేవాలయాల నిర్మాణం మీద హిందువులకు అనాసక్తి ఏర్పడింది. చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఉపయోగపడినట్లు, తాము ఎంతో భక్తివిశ్వాసాలతో దేవాలయ నిర్మాణాలు చేసుకుని వాటి అభివృద్ధికి పాటుపడుతుంటే, ఎండోమెంట్ అధికారులు, రాజ‌కీయ నాయ‌కులు వ‌చ్చి పెత్త‌నం చెలాయించ‌డం న‌చ్చ‌లేదు. దీనితో సాంప్రదాయ దేవాలయ నిర్మాణాల జోలికి వెళ్ళడానికి ఎవ‌రూ ఆసక్తి చూపడం లేదు. అటువంటి వారికి ఆశాజ్యోతిలా కనపడ్డారు షిర్డీ సాయిబాబా. మొదట్లో ఎండోమెంట్ శాఖ సాయిబాబా మందిరాలను కూడా తమ అధీనంలోకి తెచ్చుకుని పెత్తనం చెలాయిద్దామని చూసినా, సాయిబాబా పూర్తిగా హిందువు కాదు అనే కారణం చేత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సాయిబాబా దేవాలయాలు ఎండోమెంట్ పరిధిలోకి రావని తేల్చి చెప్పింది. 
 
కానీ, హైద్రాబాదుల‌లో ఒకే ఆవరణలో ఉన్న గాయత్రి దేవి సాయిబాబా గుళ్లకు కలిపి ఒక కార్యనిర్వాణాధికారిని ఎండోమెంట్ శాఖ వారు నియమిస్తే , దానిని వ్యతిరేకించిన ఆలయ నిర్వాకులు హైకోర్టులో కేసు వేశారు. డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ ఎండోమెంట్ వ‌ర్సెస్ సాయిబాబా సంస్థాన్ డిసెంబ‌రు 6, 1990లో వేసిన ఈ కేసులో హైకోర్టు  ఇచ్చిన తీర్పు ఏమిటంటే "సాయిబాబా హిందువు కాదు కాబట్టి, ఎండోమెంట్ యాక్ట్ పరిధిలోకి ఆయన మందిరం రాదు. కానీ గాయత్రి దేవి హిందూ దేవత కాబట్టి ఆ గుడి మీద ఎండోమెంట్ వారి అధికారులు పెత్తనం చేయవచ్చు. ఇంకేముంది? ఆ దెబ్బతో హిందూ దేవుళ్ళు ప్రభ తగ్గిపోయింది. సాయిబాబాకు ఆదరణ పెరిగిపోయింది. ప్రతి ఊళ్ళో సాయిబాబా మందిరాలు వెలిశాయి. భక్తుల స్వీయ పర్యవేక్షణ కాబట్టి అన్ని సాయి మందిరాలు అంతో, ఇంతో అభివృద్ధి చెందుతుండ‌టం వలన లక్షలాది సంప్ర‌దాయ హిందూ భక్తులు సాయిభక్తులుగా మారిపోయారు. దానితో మహారాష్ట్రలో ఉన్న షిరిడి దేవాల‌యం ఆదాయం కూడా విపరీతంగా పెరిగిపోయి, దేశంలో సాయిబాబా ప్ర‌భ వెలిగిపోయింది. ఇక కొంద‌రు సాయిని, హిందూ దేవుళ్ళ‌ను క‌లిపి గణేష్‌సాయి, రామసాయి, కృష్ణసాయి... అంటూ దేవాలయాలు క‌ట్ట‌డం ప్రారంభించారు.
 
సాంప్రదాయ దేవుళ్ల‌కు సంబంధించిన దేవాలయాలు సుమారు 30 వేలకు పైగా ధూపదీపాలు లేక కునారిల్లుతుంటే, నిన్న గాక మొన్న వచ్చిన సాయిబాబా మందిరాలు రోజుకు 3 సార్లు హారతి, రాత్రిళ్ళు ఫోకస్ లైట్లతో ధగధగా మెరసిపోవడం ఏమిటి? అనేది ద్వారకా పీఠాధిపతి ప్ర‌శ్న‌. అందుకే సాయిబాబాను దేవుడు కాదని, ఒక దెయ్యం అని, ఆయన మందిరం సమాధి అని, ఆయనకు చేసే పూజ దెయ్యం పూజలు అని అనడం మొదలు పెట్టారు. దీనితో సహజంగానే సాయిభక్తులకు స్వరూపానంద గారి మీద ఆగ్రహం వచ్చింది. దానితో వారు స్వామి వారి మీద ఎదురుదాడికి దిగారు. ఇలా చివరకు హిందూ దేశంలో స్వదేశీ దేవుళ్ళ భక్తుల మధ్య మాటల‌ యుద్ధాలు మొదల‌య్యాయి. దానిని క్యాష్ చేసుకొని తమ రేటింగ్ పెంచుకోవాలనుకుంటున్నాయి కొన్ని మీడియా ఛానళ్లు. 
 
మ‌నోభావాల‌తో చెలాగాటం వద్దు...
మ‌న దేశంలో హిందూ సంస్కృతిని దెబ్బతీయాలనే దురుద్దేశంతో ఎంతోమంది డబ్బు ఆశ‌ చూపి మ‌త మార్పిడి చేస్తున్నారు. వాటిని అడ్డుకోకుండా, ఈ దేశంలో పుట్టి, ఈ దేశం గురించి ఆలోచించిన స్వదేశీ సాయిబాబాను అడ్డుకోవ‌డం అనాలోచితం. సాయిబాబా భక్తుల మనోభావాలు గాయపరచే మాటలకు స్వస్తి చెప్పడం మంచిది. లక్షలాది హిందూ భ‌క్తుల‌ను దూరం చేసుకోవడం కంటే "సనాతన -సాయి, భాయి భాయి" అనే నినాదంతో అందరూ ఏకమ‌వ్వాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిక్నిక్ స్పాట్‌గా మారిన సిమీ ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్ ప్రాంతం