Road Accidents రోడ్డు ప్రమాదాలు. రోడ్డు ప్రమాదాలు ఈమధ్య తలకాయలు లేనివారు వాహనాలను నడపడం వల్ల జరుగుతున్నాయని ఓ పక్కా పల్లెటూరి వ్యక్తి చెబుతున్నారు. తలకాయలు లేనివారు అంటే... రోడ్లపై వాహనాలను ఎలా నడపాలన్న కనీస జ్ఞానం లేకుండా నడిపే రోగ్ డ్రైవర్స్ ఎక్కువయ్యారన్నది ఆయన భావన. ఆయన మాటల్లో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న తీరును చూస్తే అత్యధికులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తున్నట్లు కనిపించరు. ద్విచక్ర వాహనం నడిపేవారు చాలామంది హెల్మెట్ ధరించరు, ఇంకొందరు నలుగుర్ని ఎక్కించుకుని నడుపుతారు, మరికొందరు సెల్ ఫోన్ మాట్లాడుతూ తలను పక్కకి వంచి వాహనాన్ని నడిపేస్తుంటారు.
ఇక మరీ జ్ఞానం లేనివారైతే వన్ వే అని తెలిసినా తమ వాహనాన్ని ఎదురుగా నడుపుకుంటూ వస్తారు. వీరిని మించినవారైతే రెడ్ సిగ్నల్ వేసినా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా దున్నపోతు మీద వాన కురిసినట్లు వెళ్తుంటారు. ఇలాంటి వారందరితో ప్రతిరోజూ ట్రాఫిక్ పోలీసులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీకావు. ఎన్నిసార్లు జరిమానాలు విధించినా కుక్క తోక వంకర మాదిరిగా మళ్లీ అలాగే వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా నడుపుతుంటారు.
ఇక మద్యం సేవించి నడిపేవారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పూర్తి మత్తులో వుండి వాహనం నడుపుతూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ రోడ్డు ప్రమదాలలో కొన్నిసార్లు ఎంతో క్రమశిక్షణతో వాహనాలను నడిపేవారు క్రమశిక్షణ లేకుండా వాహనం నడిపేవారి చేతుల్లో బలవుతున్నారు. ఇలా ప్రమాదాల రూపంలో ప్రాణాలను కోల్పోతున్నవారు రానురాను ఎక్కువవుతున్నారు.
రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణ రెండోస్థానం
2021లో భారతదేశంలో మరణాలకు ప్రధాన కారణాలలో రోడ్డు ట్రాఫిక్ గాయాలు 13వ స్థానంలో వున్నట్లు రిపోర్టులో తెలిసింది. భారతదేశంలో రోడ్డు భద్రత గణనీయమైన ప్రాంతీయ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తుంది. తలసరి రోడ్డు ట్రాఫిక్ మరణాల రేట్లు రాష్ట్రాల వారీగా మూడు రెట్లు ఎక్కువ తేడాతో ఉన్నాయి.
తమిళనాడు (21.9), తెలంగాణ (19.2), ఛత్తీస్‌గఢ్ (17.6) 1,00,000 మందికి అత్యధిక మరణాల రేటును నమోదు చేశాయి. 2021లో పశ్చిమ బెంగాల్ మరియు బీహార్ 1,00,000 మందికి 5.9 చొప్పున అత్యల్ప రేట్లను కలిగి ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు అన్ని రోడ్డు ట్రాఫిక్ మరణాలలో దాదాపు 50% వాటా కలిగి ఉన్నాయి. ఈ నివేదిక పాదచారులు, సైక్లిస్టులు, మోటారుతో నడిచే ద్విచక్ర వాహనదారులను రోడ్డు వినియోగదారులుగా గుర్తించింది. అయితే ట్రక్కులు వల్ల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా వున్నట్లు తేలింది.
హెల్మెట్ వాడకం వల్ల ప్రాణాలను కాపాడే సామర్థ్యం ఉన్నప్పటికీ, మోటారుతో నడిచే ద్విచక్ర వాహనదారులలో 50% కంటే ఎక్కువ మంది ఏడు రాష్ట్రాల్లో మాత్రమే హెల్మెట్లు ధరిస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలను తొలగించడం, రహదారి గుర్తులు, సంకేతాల వంటి ప్రాథమిక రహదారి భద్రతా చర్యలు చాలా రాష్ట్రాల్లో తగినంతగా లేవు, అయితే గ్రామీణ ప్రాంతాల్లో హెల్మెట్ వాడకం చాలా తక్కువగా ఉంది, ట్రామా కేర్ సౌకర్యాలు అంతంతమాత్రంగా వున్నాయి. రోడ్డు ప్రయాణం సౌకర్యవంతంగా, భద్రతగా వుండాలంటే ముందుగా వాహనాలను నడిపేవారు పూర్తిగా నిబంధనలు పాటించాలి. దీనికిగాను పోలీసులు తీసుకునే చర్యలకు ప్రతిఒక్కరూ మద్దతు తెలియజేయాలి. అప్పుడే రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రమాదం లేని శుభప్రయాణంగా మారగలదు.