బ్రిటన్ రాచరికపు సంకెళ్లు తెంచుకుని సంపూర్ణ స్వాతంత్ర్యం సిద్ధించిన రోజు 1950 జనవరి 26వ తేదీ. దీన్ని పురస్కరించుకుని భారత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ కోవలో బుధవారం 73వ రిపబ్లిక్ వేడుకలను జరుపుకుంటున్నారు.
భారత్‌కు 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చింది. కానీ అప్పటి వైస్రాయ్ లార్డ్ మౌంట్‌బాటన్ ఆగస్టు 15వ తేదీనే స్వాతంత్ర్యం ప్రకటించడానికి ఓ కారణం లేకపోలేదు. రెండో ప్రపంచ యుద్ధంలో తన సారథ్యంలోని బ్రిటీషన్ సేనకు జపాన్ రాజు లొంగిపోయిన రోజున ఆగస్టు 15వ తేదీ. అందుకే ఆ రోజు మౌంట్‌బాటన్‌కు ఎంతో ఇష్టం.
ఈ ఒక్క కారణంగానే భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని కూడా ఆగస్టు 15వ తేదీనే లార్డ్ మౌంట్‌బాటన్ ప్రకటించారు. ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రి 11.57 నిమిషాలకు పాకిస్థాన్‌ను, ఆగస్టు 15వ తేదీ అర్థరాత్రి 12.02 నిమిషాలకు భారత్‌ను ప్రత్యేక దేశంగా ప్రకటించారు. ఆ విధంగా తమ వలస పాలన విజయానికి గుర్తుగా ఆంగ్లేయులు ముహూర్తం పెట్టి అప్పగించిన రోజున పంద్రాగస్టు.
కానీ, అది సంపూర్ణ స్వాతంత్ర్యం కాదు. మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు నుంచి ఒక జాతీయోద్యమకారుల కోరిన స్వయంప్రతిపత్తిని ఇచ్చారు. బ్రిటన్ రాజు కిందే భారత్ కొనసాగింది. ఆయన ప్రతినిధిగా గవర్నర్ జనరల్‌ను నియమించారు. కావాలనుకుంటే రాచరికం కింద కొనసాగొచ్చు.. లేదంటే రాచరికం నుంచి వైదొలగి రిపబ్లిక్‌గా ప్రకటించుకునే అవకాశం ఇచ్చారు. అయితే, భారత్‌కు స్వాతంత్ర్యం ప్రకటించే నాటికి రాజ్యాంగం లేదు. 1953లో ఆంగ్లేయులు తెచ్చిన చట్టం ప్రకారమే పాలనకొనసాగింది.
స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ బ్రిటీష్ బానిస, వలసపాలన వాసనలు కొనసాగుతుండటంతో రాజ్యాంగ రచన కీలకంగా మారింది. 1946లో డిసెంబరు 9వ తేదీన తొలిసారి సమావేశమైన రాజ్యాంగ సభ చకచక తన రాజ్యాంగ రచన పనిని చేపట్టింది. 1947 ఆగస్టు 29వ తేదీన రాజ్యాంగ రచనా కమిటీని ఏర్పాటు చేసింది.
బ్రిటిష్ ప్రభుత్వంలో ఐపీఎస్ అధికారిగా పని చేసిన బీఎన్ రావు రాజ్యాంగ ముసాయిదా ప్రతిని రూపొందించారు. దానిపై నిశితంగా, క్షుణ్ణంగా చర్చించాక అనే సవరణలతో ఆమోదించారు. సామాన్యులు సైతం కమిటీ చర్చలు విని సూచనలు, సలహాలు ఇవ్వడానికి అవకాశం కల్పించారు. 1949 నవంబరు 26వ తేదీన రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటికీ రెండు నెలల పాటు అమలు చేయలేదు.
1930లో లాహోర్ సదస్సులో సంపూర్ణ స్వరాజ్యం కోసం కాంగ్రెస్ నినదించింది. జనవరి 26వ తేదీన సంపూర్ణ స్వరాజ్య దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ఆ ముహుర్తాన్ని గౌరవిస్తూ కొత్త రాజ్యాంగాన్ని 1950 జనవరి 26వ తేదీన ఆవిష్కరించారు. అప్పటి నుంచి భారత గణతంత్ర వేడుకలను ప్రతియేటా నిర్వహిస్తున్నాం.