Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రజనీకాంత్ లోకల్ కాదా? 40 ఏళ్లు ఇక్కడే వుంటే నాన్ లోకలా? కబాలికి నేనున్నాంటున్న ధనుష్?

తమిళనాడు రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత ఆ రాష్ట్రంలో బలమైన నేత, సామర్థ్యమైన నాయకత్వం లేకపోవడంతో పరిస్థితి అయోమయంగా మారింది. డీఎంకే అధినేత కరుణానిధి సైతం వృద్

Advertiesment
రజనీకాంత్ లోకల్ కాదా? 40 ఏళ్లు ఇక్కడే వుంటే నాన్ లోకలా? కబాలికి నేనున్నాంటున్న ధనుష్?
, మంగళవారం, 23 మే 2017 (14:55 IST)
తమిళనాడు రాజకీయాలు రోజుకో రంగు పులుముకుంటున్నాయి. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత ఆ రాష్ట్రంలో బలమైన నేత, సామర్థ్యమైన నాయకత్వం లేకపోవడంతో పరిస్థితి అయోమయంగా మారింది. డీఎంకే అధినేత కరుణానిధి సైతం వృద్ధాప్యం కారణంగా రాజకీయాలకు దూరంగా ఉండటం, అమ్మ లేకపోవడంతో.. తమిళనాడు ప్రజలు తమను పరిపాలించే బలమైన నేత ఎవరా అని వేయి కనులతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు రావడంతో ఆయనే సీఎం కావాలని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. 
 
ఇటీవల అభిమానులతో పోటో సెషన్ చేపట్టిన రజనీకాంత్ రాజకీయాలపై గళం విప్పారు. రాజకీయాలు, రాజకీయ నేతలపై కామెంట్లు చేశారు. ప్రజాస్వామ్యంపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం ఖాయమని, అయితే సొంత పార్టీ పెట్టుకుంటారా? బీజేపీలో చేరుతారా? అనేది ఇంకా క్లారిటీ రాలేదు. రేపోమాపో రజనీకాంత్ రాజకీయాలపై ప్రకటన చేసే ఛాన్సుందని ఆయన ఫ్యాన్స్ ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఇంతలో రజనీకి లోకల్ సమస్య తలుపుతట్టింది. ఫ్యాన్స్ మీట్‌లో ''నేను లోకల్'' 40 ఏళ్ల పాటు తమిళనాడులో ఉన్నానంటూ చెప్పిన రజనీకాంత్‌కు నిరసన సెగ తగిలింది.
 
రజనీ లోకల్ కాదని తమిళ సెంటిమెంటును రెచ్చగొట్టడానికి కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నాయి. అయితే రజనీకాంత్ లోకల్ సమస్యపై చోటుచేసుకున్న నిరసనకు ధీటుగా బదులిచ్చేందుకు సూపర్ స్టార్ అభిమాన గణం రోడ్డెక్కుతున్నారు. తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ రావాలని అభిమానులు చెన్నై పోయెస్ గార్డెన్‌లోని రజనీ ఇంటి ముందు నినాదాలు చేశారు. మంగళవారం రాస్తారోకో నిర్వహించారు. బైక్స్‌పై రజనీ నామస్మరణ చేస్తూ రాజకీయంగా ఆయనకు మద్దతు పలికారు. ఈ పరిణామాల నేపథ్యంలో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని డిసైడైపోయారని తెలుస్తోంది. 
 
కార్యాచరణ కూడా మొదలెట్టేశారని.. మరో పది రోజుల్లో రజనీకాంత్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రకటన చేసే ఛాన్సుందని కోడంబాక్కం వర్గాలు కోడైకూస్తున్నాయి. రజనీ పొలిటికల్ ఎంట్రీ గనుక జరిగితే.. తమిళ రాజకీయ రంగంలో ప్రస్తుతం కొనసాగుతున్న పార్టీలకు గడ్డు పరిస్థితులు ఎదురైనట్లేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక రజనీ లోకల్ సమస్యను ఫ్యాన్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలో ఐదేళ్లుంటేనే గ్రీన్ కార్డు ఇస్తుంటే.. రజనీకాంత్ 40 ఏళ్ల పాటు తమిళనాడులో ఉన్నారని.. తమిళ ప్రజలకు సేవ చేయాలనుకుంటున్న వ్యక్తిని దెబ్బతీసేందుకు కొన్ని గ్రూపులు ప్రయత్నిస్తున్నాయని ఫ్యాన్స్ అంటున్నారు. 
 
అయితే రజనీకాంత్ మాత్రం ఆచితూచి అడుగేయాలని.. ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే ఎదురయ్యే సమస్యలు, పరిణామాలపై బేరీజు వేసుకుంటున్నారు. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, తమిళనాట కెప్టెన్ విజయ్ కాంత్ పరిస్థితి తరచి చూసుకుంటున్నారని టాక్. అయితే అల్లుడు ధనుష్ రజనీకాంత్‌కి ధైర్యం ఇస్తున్నారని.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలని కోరుతున్నారని సమాచారం. అల్లుడి స్థానంలో ఉంటూ రజనీకాంత్ కుమారుడిలా అన్ని విధాలా అతనే సాయం చేస్తున్నాడని సన్నిహితుల టాక్. మరి రజనీకాంత్ రాజకీయాల్లోకి ఎప్పుడొస్తారనేది తేలాలంటే.. వేచి చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ దళితుడి ఇంటికి వెళ్ళిన యడ్యూరప్ప హోటల్ ఇడ్లీ తిన్నారా?