Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజస్థాన్ సంక్షోభం : నమ్మిన బంటులే నట్టేట ముంచారు? రాహుల్ అంతర్మథనం!!

Advertiesment
రాజస్థాన్ సంక్షోభం : నమ్మిన బంటులే నట్టేట ముంచారు? రాహుల్ అంతర్మథనం!!
, మంగళవారం, 14 జులై 2020 (15:24 IST)
కాంగ్రెస్ పార్టీలో మరోమారు ముసలం చెలరేగింది. నాలుగు నెలల క్రితం మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చెలరేగిన ఈ తుఫాను దెబ్బకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారం కోల్పోయింది. ఇపుడు రాజస్థాన్ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తింది. అపుడు మధ్యప్రదేశ్, ఇపుడు రాజస్థాన్ రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చెలరేగిన సంక్షోభాలకు నమ్మినబంటులుగా ఉన్న ఇద్దరు యువ నేతలు కావడం గమనార్హం. అదీకూడా దశాబ్దాలుగా తమ కుటుంబాలకు వెన్నుదన్నుగా ఉన్న కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ పెద్దలను నిలువునా నట్టేట ముంచారు. 
 
వారిద్దర్లో ఒకరు జ్యోతిరాదిత్య సింధియా కాగా, మరొకరు సచిన్ పైలట్. వీరితండ్రులు కాంగ్రెస్ పార్టీకి నమ్మినబంటులు. అత్యంత విశ్వాసపాత్రులు. కాంగ్రెస్ పార్టీనే తమ ఊపిరిగా జీవించారు. చనిపోయేంతవరకు కాంగ్రెస్ సభ్యులుగానే ఉన్నారు. అలాగే, వీరి పిల్లలైన జ్యోతిరాదిత్య, సచిన్ పైలట్లు కూడా నమ్మినబంటులుగా ఉన్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జట్టులో కుడి, ఎడమలుగా ఉన్నారు. చివరకు వారిద్దరే రాహుల్‌తో పాటు పార్టీని వెన్నుపోటుపొడిచారు. ఫలితంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోల్పోగా, రాజస్థాన్ రాష్ట్రంలో ఇప్పటికిపుడు కుదరలేదు. 
 
ఇక రాజస్థాన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాజకీయాలకు వస్తే.. సచిన్ పైలట్ తిరుగుబాటు నాలుగు నెలల క్రితమే ఊహించింది. మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను కుప్పకూల్చినప్పుడే, ఇక రాజస్థాన్‌ వంతు అని అనేకులు అన్నారు. ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌, సచిన్‌ పైలట్‌ మధ్య విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నవి కావు. దాదాపు మూడేళ్ళుగా ఆ మంట మండుతూనే ఉంది.
webdunia
 
ప్రభుత్వాన్ని కూల్చేందుకు జరుగుతున్న కుట్రలో నీ పాత్ర ఎంతో చెప్పమంటూ సచిన్‌కు నోటీసులు అందడం చిట్టచివరి అస్త్రం మాత్రమే. ఉపముఖ్యమంత్రిగా ఉన్నందున తనకు హోంశాఖ ఇచ్చి, తనవారు ఓ నలుగురికి మంచి పదవులిస్తే సర్దుకుపోతానని సచిన్ చెప్పాడు. కానీ, అది జరగలేదు. పైగా, ముఖ్యమంత్రి గెహ్లాట్‌ తనచేతిలో ఉన్న పోలీసు శాఖను ఆయుధంగావాడి, కుట్ర సిద్ధాంతాలతో చుట్టూ ఉచ్చుబిగించడంతో సచిన్‌కు నిష్క్రమణ మినహా మరోమార్గం లేకపోయింది. 
 
అదేసమయంలో సచిన్ పక్షాన ప్రస్తుతం 15 మంది ఎమ్మెల్యేలు లేరనే వార్తలు వస్తున్నాయి. కానీ, ఆయన మాత్రం తనకు 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. కానీ, తమ ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, 109 మంది ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని సోమవారం జరిగిన సీఎల్పీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి గెహ్లాట్ వర్గం ప్రకటించింది. 
 
గెహ్లాట్ వర్గ ఎమ్మెల్యేలు జైపూర్‌ శివారులో ఉన్న రిసార్టులో మకాం వేశారు. మంగళవారం కూడా మరోమారు ఇక్కడే సీఎల్పీ సమావేశం నిర్వహించారు. సోమవారం జరిగిన సమావేశానికి డుమ్మా కొట్టిన పైలట్, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు మంగళవారం కూడా హాజరుకాలేదు. పైగా, అధిష్టానం ఆదేశాలను బేఖాతర్ చేశారు. పలుమార్లు పైలెట్‌తో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ మాట్లాడినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ హైకమాండ్ కన్నెర్రజేసింది. డిప్యూటీ సీఎం పదవిని ముఖ్యమంత్రి గెహ్లాట్ తొలగిస్తే.. పీసీసీ చీఫ్ పదవిని కాంగ్రెస్ అధిష్టానం ఊడపీకేసింది. దీంతో సచిన్ పైలట్ ఇపుడు ఓ సాధారణ ఎమ్మెల్యేగా మారిపోయారు. 
 
ప్రస్తుతం ఈయన వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటాన్నదే మిలియిన్ డాలర్ల ప్రశ్నగా ఉంది. ఎందుకంటే.. గెహ్లాట్ వర్గం 109 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని ప్రకటించింది. సచిన్ పైలెట్ వర్గం 30 మంది మద్దతు ఉందని చెబుతోంది. అదే నిజమైతే... ఆయన బీజేపీ పంచన ఈపాటికే చేరిపోయి... ప్రభుత్వాన్ని కూల్చేసేవారు. కానీ, ప్రస్తుతం రాజస్థాన్‌లో బీజేపీకి 75 మంది సభ్యుల బలం ఉంది. ప్రభుత్వాని ఏర్పాటు చేయాలంటే మరో 27 మంది ఎమ్మెల్యేల మద్దతు తప్పనిసరి. 
 
కానీ, అంత సంఖ్యలో సచిన్ పైలట్ వద్ద బలం లేదని బీజేపీ పెద్దలు గ్రహించినట్టుగా ఉన్నారు. అందుకే కమలనాథులు ఆచితూచి అడుగులు వేస్తున్నట్టున్నారు. మధ్యప్రదేశ్‌లో దశాబ్దకాలం తర్వాత వచ్చిన అధికారాన్ని కోల్పోయేందుకు, రాజస్థాన్ రాష్ట్రంలో గెహ్లాట్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకునేందుకు ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీని, ఆ పార్టీ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కుడిఎడమ భుజాలుగా ఉన్న జ్యోతిరాదిత్య సింధియా, సచిన్ పైలట్లేనని ఘంటాపథంగా చెప్పొచ్చు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రంజుగా మారిన రాజస్థాన్ రాజకీయం : సచిన్ పైలట్‌పై వేటు పడింది...