Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్ కల్యాణ్ ఆపరేషన్ ఆకర్ష్... ఎవరెవరు వస్తున్నారంటే..?

పవన్ కల్యాణ్ ఆపరేషన్ ఆకర్ష్... ఎవరెవరు వస్తున్నారంటే..?
, శుక్రవారం, 12 అక్టోబరు 2018 (20:52 IST)
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారు. ఓవైపు అధికార పక్షంపై మాటల దాడికి దిగుతూ మరోవైపు ప్రతిపక్షాన్ని కవ్విస్తూ తనదైన శైలిలో అడుగులు వేస్తున్నారు. అలాగే ఇప్పటికే టిడిపి - వైసిపిల నుంచి పలువురు ద్వితీయ శ్రేణి నాయకులను తనవైపుకు తిప్పుకున్న పవన్ తాజాగా బడా నేతలపైన గురిపెట్టేశారు. తాజాగా మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ జనసేనలో చేరిక అనంతరం మరికొంతమందికి కూడా పవన్ కండువా కప్పనున్నట్లు తెలుస్తోంది.
 
జనసేనాని పవన్ కళ్యాణ్‌ తనదైన పక్కా వ్యూహంతో ఎపి రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల వివిధ రకాల సమస్యలపైన పర్యటనలు చేసి అధికార ప్రతిపక్షాలను కడిగి పారేసిన పవన్ కళ్యాణ్‌ తాజాగా ఆపరేషన్ ఆకర్ష్ పథకానికి శ్రీకారం చుట్టారు. గతంలో పలు పార్టీల నుంచి ద్వితీయశ్రేణి నాయకులు జనసేనలో చేరినా పవన్ కల్యాణ్‌ మాత్రం పెద్ద తలకాయలపైనే గురిపెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగానే మాజీ శాసనసభ స్పీకర్, అలాగే మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ తనయుడు నాదెండ్ల మనోహర్ అనూహ్యంగా జనసేన పార్టీలో చేరడం పొలిటికల్‌గా హాట్ టాపిక్‌గా మారింది.
 
మనోహర్‌ను ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం రాజకీయంగా ఆశక్తి రేపుతోంది. ఎన్నికలకు మరో నాలుగు నెలల సమయం కూడా లేకపోవడంతో పవన్ కళ్యాణ్‌ నియోజకవర్గాల వారీగా పోటీ చేసే నాయకుల లిస్టును తయారుచేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఏ పార్టీలోకి వెళ్ళాలో తెలియక సతమతమవుతున్న నాయకులను మొదటగా తనవైపుకు ఆకర్షించే ప్రయత్నం మొదలుపెట్టారు. అలాగే తన అన్న చిరంజీవి కూడా కాంగ్రెస్ నేతే కావడంతో పవన్ కళ్యాణ్‌‌కు ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి. మరి త్వరలోనే ఆ పార్టీకి చెందిన మరికొంతమంది ప్రముఖుల నేతలను జనసేనపార్టీ కండువాను కప్పనున్నట్లు సమాచారం. 
 
మరోవైపు టిడిపి - వైసిపిలలోను కొంతమంది అసంతృప్త నేతలు జనసేన గూటికి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. టిడిపిలో 40 మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్టు దక్కదన్న అనుమానాల నేపథ్యంలో వారు జనసేనలోకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అలాగే కాపు రిజర్వేషన్లపై జగన్ వ్యాఖ్యల తరువాత పలువురు కాపు నేతలు కూడా పవన్‌తో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. అయితే కాంగ్రెస్ నుంచి వలసలు ప్రస్తుతం జరుగుతున్నా టిడిపి - వైసిపిల నుంచి వచ్చే నేతలు మాత్రం వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే మరో రెండుమూడు నెలల్లో తమకు సీటు గానీ దక్కుతుందన్న గ్యారంటీ లేకుంటే ఖచ్చితంగా వారంతా జనసేన వైపు మళ్ళే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 
 
మరోవైపు పవన్ కళ్యాణ్‌ కూడా పార్టీని గ్రామస్థాయి వరకు తీసుకువెళ్ళేందుకు సిద్థమవుతున్నారు. అయితే జనసేనకు ఉన్న ప్రధాన సమస్యల్లా ఆ పార్టీకి ఎన్నికల్లో నెగ్గుకు వచ్చేంత ఆర్థిక వనరులు ఉన్న నేతలు లేకపోవడమే. అయితే ఈ లోటును భర్తీ చేసేలా ఆర్థికంగా పటిష్టంగా ఉన్న కొంతమంది నేతలను చేర్చుకునేందుకు పవన్ కళ్యాణ్‌ సిద్థంగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పవన్ కళ్యాణ్ తప్ప పార్టీ అంశాల గురించి ఎవరు మాట్లాడినా మీడియా పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో జనసేనకు మీడియా పరంగా పెద్దగా ఫోకస్ కావడం లేదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో పలువురు మాజీలను పార్టీలో తీసుకుంటే మీడియా కూడా వారి వ్యాఖ్యలను ఫోకస్ చేస్తుందన్న అభిప్రాయం జనసేన అంతర్గత చర్చల్లో వ్యక్తమైంది. ఈ కారణంగానే పవన్ కళ్యాణ్‌ ప్రధానంగా పలువురు సీనియర్ నేతలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రుల వైపు మ్రొగ్గు చూపుతున్నట్లు కూడా తెలుస్తోంది. మరి జనసైన్యంలో ఎంతమంది బడా నేతలు చేరతారో వేచి చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాంప్ వుందని మరో మహిళతో ఉపాధ్యాయుడు... అనుసరించి పట్టేసిన భార్య