Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దినకరన్‌తో విసిగిపోయిన సీఎం పళనిస్వామి.. శశికళను బహిష్కరించి పన్నీర్‌కు స్వాగతం!

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకెళ్లినప్పటి నుంచి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన టీటీవీ దినకరన్‌తో విసిగిపోయారు. పార్టీలోనే కాకుండా, ప్రభుత్వ పాలనలో కూడా వేలు పెడుతున్నారు.

దినకరన్‌తో విసిగిపోయిన సీఎం పళనిస్వామి.. శశికళను బహిష్కరించి పన్నీర్‌కు స్వాగతం!
, మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (14:53 IST)
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ జైలుకెళ్లినప్పటి నుంచి పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన టీటీవీ దినకరన్‌తో విసిగిపోయారు. పార్టీలోనే కాకుండా, ప్రభుత్వ పాలనలో కూడా వేలు పెడుతున్నారు. కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులు రావడం లేదు. కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల మాజీ సీఎం పన్నీర్ వర్గానికి జారుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పన్నీర్ సెల్వంతో సయోధ్య కుదుర్చుకుని నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రి కుర్చీలో ప్రశాంతంగా కూర్చోవాలనే భావనకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే వైరివర్గంతో చేతులు కలిపేందుకు సిద్ధమంటూ ఆయన సంకేతాలు పంపారు. 
 
నిజానికి ముఖ్యమంత్రిగా ఎడప్పాడి కె పళనిస్వామి బాధ్యతలు చేపట్టినా పూర్తి స్వేచ్ఛలేని పరిస్థితి. పార్టీలో, ప్రభుత్వంలో దినకరన్‌ హవా పెరిగిపోతోంది. అదేసమయంలో, కేంద్రం నుంచి ఒక్క పైసా నిధులు రావడం లేదు. వీటన్నిటికీ తోడు, చీటికీ మాటికీ కేసులు వచ్చి పడుతున్నాయి. మరోవైపు పన్నీరు వర్గం మళ్లీ పుంజుకుంటోంది. ఏ క్షణంలో ఎవరు గోడ దూకి పన్నీర్‌ వైపు వెళ్తారో, ఎప్పుడు ప్రభుత్వం పడిపోతుందోనని రోజులు లెక్క పెట్టుకోవాల్సిన పరిస్థితి. ఇద్దరు ఎమ్మెల్యేలు తాజాగా ఓపీఎస్‌ వర్గంలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
 
ఇలా ముప్పేట సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో అతి తక్కువ కాలంలోనే సీఎం పదవిపై ఎడప్పాడి కూడా విసుగెత్తిపోయారని ఆయన సన్నిహిత వర్గాల సమాచారం. ఓపీఎస్‌తో చేతులు కలపడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. సరిగ్గా, ఇటువంటి పరిస్థితుల్లోనే పన్నీరు సెల్వం వైపు నుంచి కూడా రాజీ ప్రతిపాదనలు వచ్చాయి. ఇందుకు పళని స్వామి వర్గం కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో, శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి పక్కనబెట్టడం ఖాయమైపోయిందని అన్నాడీఎంకే వర్గాలు చెబుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియన్ టెక్కీలకు ఆస్ట్రేలియా షాక్... 457 వీసా విధానం రద్దు.. ట్రంప్ ఆదర్శమా...?