Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నరేంద్రమోడీ శక్తి అమాంతం పెరిగిందట...!

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ప్రతిష్టను పెంచేవే. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్ణయాత్మక గెలుపు ఆ పార్టీకి క

నరేంద్రమోడీ శక్తి అమాంతం పెరిగిందట...!
, బుధవారం, 15 మార్చి 2017 (13:35 IST)
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ భారతీయ జనతా పార్టీకి, ముఖ్యంగా నరేంద్ర మోడీకి ఖచ్చితంగా ప్రతిష్టను పెంచేవే. పంజాబ్ రాష్ట్రంలో కాంగ్రెస్ నిర్ణయాత్మక గెలుపు ఆ పార్టీకి కొంత ఉపశమనమే కానీ, దేశంలోనే అతి పెద్ద రాష్ట్రం అయిన యూపీలో ఘోరమైన పరాజయం ఎదుర్కోవడం, ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని కోల్పోవడం కాంగ్రెస్‌కు ఇబ్బంది కలిగిస్తుంది. ప్రధాని మోడీ పార్టీ అద్యక్షుడు అమిత్ షాతో కలిసి వ్యూహాత్మకంగా ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో విజయం సాధించారు. గెలుపును వారిద్దరూ ఆస్వాదిస్తున్నారు. ఒక్క ముస్లిం అభ్యర్థికి కూడా బిజెపి టిక్కెట్ ఇవ్వకపోయినా ఇంత భారీ ఎత్తున బిజెపి గెలవడం ఆశ్చర్యంగానే ఉంటుంది. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఇది ఈవీఎంల గోల్‌మాల్ అని ఆరోపించినా, అందుకు ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. 
 
ముస్లిం మెజార్టీ ప్రాంతాలలో కూడా బీజేపీ గెలవడాన్ని ఆమె అనుమానిస్తున్నారు. మతపరంగా హిందువుల పోలరైజేషన్ జరిగి, ముస్లింల ఓట్లు సమాజవాది పార్టీ, బహుజన్ సమాజవాది పార్టీల మధ్య చీలి బీజేపీకి ప్రయోజనం కలిగించి ఉండవచ్చు. త్రిపుల్ తలాఖ్ వ్యవస్థను వ్యతిరేకిస్తున్న ముస్లిం మహిళలు కూడా బిజెపికి ఓటు వేశారన్నఅభిప్రాయం ఉంది. ఓడిపోయిన పార్టీలకు కొన్నిసార్లు అనుమానాలు వస్తుంటాయి. 
 
ఉదాహరణకు 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో అధికారంలోకి వస్తామని గట్టిగా ఆశించిన తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు కూడా ఈవీఎంలు తారుమారు అయ్యాయని, ఒకరికి వేసిన ఓటు మరొకరికి పడిందని ఆరోపించారు. దీనికి సంబంధించి ఆయన ఎన్నికల కమిషన్‌కు పిర్యాదు చేయడం, దానిపై ఆయన విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు మాయావతి కూడా అవే ఆరోపణలు చేస్తున్నారు.
 
ఈ ఆరోపణలకు ఆస్కారం లేకుండా ఏ పార్టీకి ఏ ఓటరు ఓటు వేసినా వారికి తెలిసేలా స్లిప్‌లు ఇవ్వాలని ప్రతిపాదించారు. యూపీతో సహా ఈ ఐదు రాష్ట్రాలలో దానిని అమలు చేసివుంటే ఇలాంటి అనుమానాలు వచ్చేవి కావేమో! ఈ ఆరోపణల సంగతి ఎలా ఉన్నా ఉత్తరప్రదేశ్ వంటి పెద్ద రాష్ట్రంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత బీజేపీ ఇంత భారీ విజయం సాధించడం గొప్ప విషయమే.

మరి యూపీలో నోట్ల రద్దు వల్ల పెద్దగా ఇబ్బంది రాలేదో, లేక ఆ అంశంకన్నా, కులం, మతం బాగా ప్రభావితం చేశాయే, రుణమాఫీ హామీ బాగా పనిచేసిందో కానీ బీజేపీకి విపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చే అంశమే అయిందని అంగీకరించాలి. అఖిలేష్‌కు మంచి పేరే ఉన్నా, కుటుంబంలో కలహాలు రావడం ఆయనకు మైనస్. కాంగ్రెస్ పార్టీతో కలిసి విజయపథంలో వెళదామనుకున్న ఆయనకు ఇది పూర్తిగా నిరాశ కలిగించే అంశమే. యుపిలో బలమైన యాదవ్ వర్గానికి వ్యతిరేకంగా మిగిలిన బిసి వర్గాలను కూడగట్టడంలో, అలాగే అగ్రవర్ణాలను ఆకట్టుకోవడంలో మోడీ, షా జంట సఫలం అయింది.
 
మొత్తంమీద దేశంలో ప్రధాని మోడీ అత్యంత శక్తివంతుడిగా ఎదిగారని అంగీకరించాలి. ఏది ఏమైనా యుపి, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి పెద్ద రాష్ట్రాలలో అనిశ్చితికి ఆస్కారం లేకుండా ప్రజలు ఓటు వేయడం మంచి పరిణామమే. చిన్న రాష్ట్రాలైన గోవా, మణిపూర్‌లలో ఆ పరిస్థితి లేదు. గోవాలో బిజెపి అధికారంలో ఉన్నా, ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ ఓటమి పాలవడం ఆ పార్టీకి కొంత పరువు తక్కువే. స్థూలంగా చూస్తే జాతీయ స్థాయిలో బీజేపీ మరింత బలంగాను, మోడీ, షాలు పవర్‌పుల్‌గా తయారు కాగా, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీలు తమ భవిష్యత్తు కోసం ఇంకా చాలా శ్రమించవలసి ఉంటుంది. చివరిగా మరో మాట కూడా చెప్పాలి. దేశంలోని ఆయా ప్రాంతీయ పార్టీలపై బిజెపి పెత్తనం మరింతగా పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ ఫలితాలను ప్రధాని మోడీ సానుకూలంగా వాడుకుని, మంచి కార్యక్రమాలు చేపడితే ఫర్వాలేదు. అలాకాకపోతే ఏకపక్షంగా వెళితే 2019లో అసలు పరీక్ష ఆయనకు ఉందన్న సంగతి మర్చిపోరాదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రెస్టారెంట్‌లో పరాయి స్త్రీతో భర్త... శివంగిలా మారిన భార్య... (Video)