రోజా. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తరువాత రెండవ స్థాయి నాయకురాలిగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యేగా రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోను తనదైన శైలిలో పేరు తెచ్చుకున్నారు. రాజకీయాల్లో తలపండిన నేతలు ముద్దుక్రిష్ణమనాయుడు, చెంగారెడ్డి లాంటి వ్యక్తులను ఎదుర్కొని ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే అయినప్పటి నుంచి అధికార పార్టీ నేతలకు దడ పుట్టించారు. తనదైన శైలిలో రాజకీయాల్లో రాణిస్తూ వస్తున్నారు.
ఎపి సిఎం చంద్రబాబు నాయుడు నుంచి ఆయన కుమారుడు నారా లోకేష్‌తో పాటు కేబినెట్‌లోని మంత్రులందరిపైన తనదైన శైలిలో విమర్శల వర్షం గుప్పిస్తుంటారు. ప్రభుత్వం నుంచి నిధులు ఇవ్వడం లేదని, నియోజకవర్గంలో అభివృద్థి ఎలా చేయాలని కూడా ప్రశ్నల వర్షం సంధించేవారు. అయితే చివరకు తన సొంత డబ్బులతో నగరి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ వస్తున్నారు.
రూ. 2కే 20 లీటర్ల తాగునీరు
తాజాగా కేవలం 4 రూపాయలకే నిరుపేదలకు కడుపు నిండా భోజనం అందించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం నగరి నియోజకవర్గం వ్యాప్తంగా జరుగుతోంది. నగరి నియోజకవర్గంలో నిరుపేదలకు కేవలం 4 రూపాయలకే భోజన సౌకర్యం కల్పించడంతో పాటు తాజాగా రూ. 2కే 20 లీటర్ల తాగునీరు అందించేందుకు ఆర్వో వాటర్ ప్లాంట్లను నెలకొల్పుతున్నారు. ఎక్కడ ప్రజలు నీటి కోసం కటకటలాడుతున్నారో... అక్కడికెళ్లి వారికి బాసటగా నిలుస్తున్నారు. ఇప్పుడు నగరిలో ఏ సమస్య వచ్చినా రోజా కోసం ఎదురుచూస్తున్నారు అక్కడి ప్రజలు.
పాఠశాలలకు ఉచితంగా ఫ్యాన్లు పంపిణీ
పేదలకు కావలసిన కనీస సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించడం లేదని, అటువంటిది రోజా ప్రతిపక్షంలో వుండి కూడా తమకోసం స్వంత నిధులను వెచ్చించడంపై నగరి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేది జగనన్న రాజ్యమేననీ, రాష్ట్రంలోని ప్రజానీకానికి మంచిరోజులు రాబోతున్నాయని రోజా అంటున్నారు.