శ్రీకాళహస్తిలో మాస్టర్ ప్లాన్ అంటే ఏమిటి?... స్థానికుల్లో టెన్షన్.. టెన్షన్
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి సంబంధిం 26.10.2016 అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా సమీక్షించారు. పలు సూచనలు చేశారు. శ్రీకాళహస్తి పట్టణ రూపురేఖలు మార్చేయాలని సూచించినట్లు వార్తలొచ్చాయి
చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తికి సంబంధిం 26.10.2016 అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా సమీక్షించారు. పలు సూచనలు చేశారు. శ్రీకాళహస్తి పట్టణ రూపురేఖలు మార్చేయాలని సూచించినట్లు వార్తలొచ్చాయి. రూ.100 కోట్లయినా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం చెప్పారంటున్నారు. పట్టణంలో అంతర్గత రోడ్లను అభివృద్ధి చేయాలని భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని, స్వర్ణముఖి ప్రక్షాళన చేయాలని, ఉద్యానవనాలు ఏర్పాటుచేయాలని, ఎత్తయిన శివపార్వతుల విగ్రహాలు ప్రతిష్టించాలని, ఊరికి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచే ఆధ్మాత్మిక వాతావరణం ఉట్టిపడేలా చర్యలు చేపట్టాలని ఇలా అనేక సూచనలు చేశారని చెబుతున్నారు.
మరోవైపు ఆలయ అధికారులు కూడా ఇదే అంశంపై చాలా రోజులుగా హడావిడి చేస్తున్నారు. మాస్టర్ ప్లాన్ అంటూ ఏదేదో నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏమిటో అది ఎలా ఉంటుందో మాత్రం ఎవరికీ తెలియడం లేదు. అందుకే స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రత్యేకించి ఆలయం చుట్టూ ఉన్న వారు టెన్షన్ పడుతున్నారు.
మనం ఇల్లు కట్టాలనుకుంటే ముందుగా ఇంజనీర్ వద్ద ప్లాన్ గీయిస్తాం. వంటగది ఎక్కడ ఉండాలి. పడక గదులు ఏ పక్కన ఉండాలి. లివింగ్ హాలు ఎంత ఉండాలి. ఫ్రంట్ ఏలివేషన్ ఎలాం ఉండాలి. గార్డెన్ ఎంత ఉండాలి. అలా అన్ని విషయాలు ప్లాన్‌లో ఉంటాయి. అయితే కోట్ల రూపాయలతో చేపట్టనున్న శ్రీకాళహస్తి ఆలయాభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఎలా ఉంటుందన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. అధికారులు చేసే ప్రతి పనికీ మాస్టర్ ప్లాన్ అంటూ ముద్రవేసుకుంటున్నరు. ఆమధ్య అన్నదాన సత్రాన్ని ఆలయానికి దూరంగా శివసదన్‌కు మార్చాలనుకున్నారు. ఎందుకంటే మాస్టర్ ప్లాన్ అన్నారు. తాజాగా నిర్మాణంలో ఉన్న మరుగుదొడ్లను కూల్చేశారు. ఆలయానికి లక్షలాది రూపాయల నష్టం వచ్చింది. ఏమని అడిగితే మాస్టర్ ప్లాన్ అన్నారు. ఇటీవల అగ్నిప్రమాదంలో కాలిపోయిన దుకాణాలను మళ్ళీ మంజూరు చేసిన యాత్రికుల వసతి సముదాయాన్ని ఆలయానికి దూరంగా కొండల్లో నిర్మిస్తున్నారు. ఏమటని అడిగితే మాస్టర్ ప్లాన్ అంటున్నారు.
మాస్టర్ ప్లాన్ ఉండాల్సిందే.. ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిందే. ఎవరూ కాదనరు. ఆ మాటకొస్తే అవసరం కూడా ఉంది. ఒకప్పుడు ఐదారు వేల మంది మాత్రమే భక్తులు వచ్చేవారు. ఇప్పుడు రోజూ 20 వేల మందికిపైగా వస్తున్నారు. ఆలయ వార్షిక ఆదాయం రూ.100 కోట్ల దిశగా పరుగులు తీస్తోంది. ఈ క్రమంలో భక్తులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలి. మాస్టర్ ప్లాన్‌తో పట్టణం అభివృద్ధి చెందితే స్థానికులు కూడా సంతోషిస్తారు. అయితే శ్రీకాళహస్తిలో ఇందుకుభిన్నంగా జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలపై స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి కారణం మాస్టర్ ప్లాన్ ఏమిటో బహిరంగంగా ప్రకటించకపోవడమే..
ఆలయ అభివృద్ధిలో భాగంగా చుట్టుపక్కలున్న స్థలాలను, ఇళ్ళను సేకరించాల్సి రావచ్చు. అది తిరుమల అయినా కాణిపాకమైనా జరిగింది ఇదే. శ్రీకాళహస్తిలోనూ ఇదే జరుగుతోంది. ఆలయ ప్రాంగణంలోని దుకాణాలను తొలగించి కాస్త దూరంగా జరపాల్సిన అవసరం ఏర్పడుతుంది. అవసరమైతే ప్రస్తుతం ఆలయ అవరణలో ఉన్న అన్నదాన సత్రం, పరిపాలనా భవనం, మింటు తదితరాలను దూరంగా తరలించాల్సి రావచ్చు. కొన్ని రోడ్లు విస్తరించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. ఇలాంటివన్నింటినీ కలిపే మాస్టర్ ప్లాన్ అంటారు. అయితే సమగ్రంగా అధ్యయనం చేసి ఈ ప్రణాళికను తయారు చేయాలి.
మాస్టర్ ప్లాన్ రూపొందించడమే కాదు. దాన్ని బహిరంగా ప్రదర్శించాలి. స్థానికుల అభిప్రాయాలు తీసుకోవాలి. జనం నుంచి విలువైన సూచనలు రావచ్చు. అదేసమయంలో మాస్టర్ ప్లాన్‌పై అందరూ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. ఆ ప్లాన్ వల్ల ఎవరి స్థలాలు సేకరిస్తారో తెలుస్తుంది. పట్టణానికి ఎంత మేలు జరుగుతుందో కూడా అర్థమవుతుంది. ఎక్కడైనా మాస్టర్ ప్లాన్ విజయవంతం కావాలంటే స్థానికుల సహకారం తప్పనిసరి. కానీ శ్రీకాళహస్తిలో ఇప్పటిదాకా మాస్టర్ ప్లాన్‌ను బహిర్గతం చేసిన పరిస్థితి లేదు. మాస్టర్ ప్లాన్ వల్ల ఇళ్ళు స్థలాలు దుకాణాలు కోల్పోతామని భావించిన వారు మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిని ఇతర పార్టీల నాయకులను కలుస్తున్నారు.
ప్లాన్ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగదని మంత్రి భరోసా ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ అమలులో ఇంత అస్పష్టత గందరగోళం ఉండాల్సిన అవసరం లేదు. అందుకే శ్రీకాళహస్తి అధికారుల మదిలో ఉన్న మాస్టర్ ప్లాన్ ఏమిటో బహిరంగపరచాలి. దీనిపై స్థానికుల అభిప్రాయాలను తీసుకుని సాధ్యమైనంత వరకు స్థానికులకు నష్టం లేని విధంగా ఈ ప్లాన్‌ను అమలు చేయాలి. ఇందుకు పాలకమండలి సభ్యులు చొరవ తీసుకోవాలి.