చూస్తుండగానే జనసేన పార్టీ 8 ఏళ్లు పూర్తి చేసుకుని 9వ ఏటలోకి అడుగుపెడుతోంది. జనసేన పార్టీ పెట్టినప్పటికీ కొందరు హీరోల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో జీరో ఏమీ కాలేదు. తన స్టామినా అలాగే నిలబెట్టుకుంటూ వస్తున్నారు. ఎంత గ్యాప్ తీసుకుని సినిమా తీసినా ఆయన సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తూంటుంది. ఇందుకు ఉదాహరణే తాజాగా విడుదలైన భీమ్లా నాయక్. ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
రాజకీయాల్లోనూ పొలిటికల్ స్టార్ అవుతారా?
రాజకీయాలు వేరు సినిమాలు వేరు. రాజకీయాల్లో ప్రజల నాడిని పట్టడంతో పాటు వారికి నేనున్నానంటూ భరోసా వుండాలి. పైగా సమస్యలపై పోరాడుతూ వుండాలి. ఇవన్నీ జనసేనాని చేస్తూనే వున్నారు. అమరావతి రైతులకు వెన్నుదున్నుగా నిలిచారు. మత్స్యకారుల సమస్యలపై పోరాడారు. రాష్ట్రంలో రోడ్ల అధ్వాన్నస్థితిపై రోడ్లెక్కారు. ఇలా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతూ వున్నారు. ఐతే అనుకున్న మైలేజీ సాధించడంలో కొన్నిసార్లు వెనుకబడుతున్నారు. అలాంటివన్నీ పవన్ కళ్యాణ్ దాటుతారనీ, ఇకపై ఫుల్ ఫోకస్ రాజకీయాలపై పెడతారని అంటున్నారు జనసేన వ్యూహకర్తలు.
భాజపా అగ్రనేతలతో సఖ్యత వున్నట్లేనా?
భారతీయ జనతా పార్టీ-జనసేన స్నేహం పార్టీ ఆవిర్భావం నుంచే వుంది. పవన్ కళ్యాణ్ మా మిత్రుడు అని స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలాసార్లు చెప్పారు. ఇటీవల స్థానిక ఎన్నికల్లోనూ భాజపా-జనసేన పొత్తుపై ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఐతే తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా నాలుగు రాష్ట్రాల్లో తన సత్తా చాటింది.
దేశంలోనే పెద్ద రాష్ట్రంగా పేరున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో తన అధికారాన్ని తిరిగి నిలబెట్టుకుంది. దీనితో ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. ఈ క్రమంలో మిగిలిన పార్టీలు భాజపాతో స్నేహం కట్టేందుకు సహజంగానే బారులు తీరుతాయి. విజయదరహాసంతో వున్నవారు చిన్న పార్టీలను పెద్దగా పట్టించుకునే పరిస్థితి వుండదు. మరి ఇలాంటి వాటికి భాజపా అతీతమా? జనసేన పార్టీతో ఏపీలో స్నేహం మరింత దృఢం చేసుకుని వచ్చే ఎన్నికల్లో ముందుకు వెళుతుందా అనేది చూడాల్సి వుంది.