Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పవన్ భార్యలు' - 'కాపు రిజర్వేషన్' కొరివిలతో తల గోక్కుంటున్న జగన్.. ఎందుకంటే?

వైసిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈమధ్య కాలంలో వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా రెండు అంశాలపై ఆయన చేస్తున్న ప్రకటనలు వైసిపికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. పాదయాత్ర ద్వారా అంతా అనుకూలంగా మారుతున్న వేళ చేజేతులారా జగన్

'పవన్ భార్యలు' - 'కాపు రిజర్వేషన్' కొరివిలతో తల గోక్కుంటున్న జగన్.. ఎందుకంటే?
, సోమవారం, 30 జులై 2018 (16:52 IST)
వైసిపి అధినేత, ఎపి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఈమధ్య కాలంలో వ్యవహరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారుతోంది. ముఖ్యంగా రెండు అంశాలపై ఆయన చేస్తున్న ప్రకటనలు వైసిపికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. పాదయాత్ర ద్వారా అంతా అనుకూలంగా మారుతున్న వేళ చేజేతులారా జగన్ ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారన్న వాదనలు వస్తున్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్‌ పైన, కాపుల రిజర్వేషన్ అంశం మీద జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి.
 
కాలు జారినా సరిదిద్దుకోవచ్చు. నోరు జారితే వెనక్కి తీసుకోలేమన్న సామెతను గుర్తు చేసేలా వ్యవహరిస్తున్నారు ఎపి ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డి. ఎండనక, వాననక నడుస్తూ వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడాయన. అయితే అన్యాపదేశంగా నోరు జారుతుండటంతో  అందివచ్చిన అవకాశాలను జార విడుచుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఈమధ్య కాలకంలో జగన్ వ్యాఖ్యానించిన రెండు అంశాలు ఆయన రాజకీయ ప్రస్థానానికి తీవ్ర ఇబ్బందికరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 
 
అసెంబ్లీ నుంచి వైసిపి పారిపోయింది అన్న పవన్ వ్యాఖ్యలకు కౌంటర్‌గా జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. పవన్ కళ్యాణ్‌ భార్యల గురించి జగన్ ప్రస్తావన చేయడంతో ఆయన అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు సాధారణ మీడియాలోను, అటు సోషల్ మీడియాలోను ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో ముఖ్యంగా పవన్‌కు అనుకూలంగా ఉండే సామాజిక వర్గం ఓట్లు చేజారిపోతాయేమోనన్న భయాందోళన వైసిపిలో వ్యక్తమవుతోంది. ఓ రకంగా చెప్పాలంటే చంద్రబాబును వ్యతిరేకించిన తరువాత పవన్ కళ్యాణ్‌ వైసిపికి మద్దతుగా ఉంటారన్న ప్రచారం జరిగింది. 
 
మాజీ ఎంపి వరప్రసాద్ లాంటి నాయకులు పవన్ తమకే మద్దతిస్తారని బహిరంగంగానే ప్రకటించారు. టిడిపి సైతం జగన్, పవన్ ఒక్కటైపోయారన్న వ్యాఖ్యలు చేసింది. ఈ నేపథ్యంలో జనసేన అధికారంలోకి రాదని అంచనా వేసే కొంతమంది పవన్ అభిమానులు సైతం గెలిచే పార్టీ అయిన వైసిపికి ఓట్లేద్దామన్న అభిప్రాయంతో ఉన్నారు. ఈ సమయంలో జగన్ జనసేనానిపై వ్యక్తిగత విమర్శలు చేయడంతో పవన్ కళ్యాణ్‌‌తో కోరి వైరాన్ని తెచ్చుకున్నట్లయ్యింది. ప్రస్తుతం పవన్ అభిమానులు జనసేన అన్ని స్థానాలు పోటీ చేయకపోతే టిడిపికైనా ఓట్లేస్తాంగానీ, జగన్‌కు ఓట్లేయబోమన్న పరిస్థితి వచ్చింది. ఇలా ఏమాత్రం అవసరం లేకపోయినా నోరుజారి పవన్‌ను విమర్శించడం ద్వారా జగన్ కోరి కష్టాలు తెచ్చుకున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 
 
ఒకవేళ పవన్ కళ్యాణ్‌ పెళ్ళిళ్ళ పైన విమర్శలు చేసిన తరువాత దానికి వివరణ ఇచ్చి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదంటున్నారు విశ్లేషకులు. ఇక జగన్ తనకు తానుగా పప్పులో కాలేసిన మరో అంశం కాపు రిజర్వేషన్. ఎన్నికల్లో గెలిస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామన్న ప్రధాన హామీతో ఉభయగోదావరి జిల్లాల్లో గణనీయంగా సీట్లు సంపాదించింది టిడిపి. అయితే అధికారంలోకి వచ్చాక ఆ అంశాన్ని విస్మరించడంతో కాపులు ఆ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశం మొదటి నుంచి వైసిపికి అనుకోని వరంలా మారుతూ వస్తోంది. టిడిపి మీద ఉన్న ఆగ్రహంతో వైసిపికి సపోర్టు చేస్తూ వస్తున్నారు కాపులు. జగన్ కూడా గతంలో కాపు రిజర్వేషన్లకు మద్దతు తెలిపిన నేపథ్యంలో ఈసారి కాపుల్లో మెజారిటీ ఓట్లు వైసిపికే పడతాయన్న అభిప్రాయం వ్యక్తమైంది. ఇలా నాలుగేళ్ళుగా కాపు సామాజిక వర్గాన్ని తనవైపు తిప్పుకుంది వైసిపి. 
 
ప్రస్తుతం జగన్ పాదయాత్ర చేస్తున్న ఉభయగోదావరి జిల్లాల్లోను పెద్దఎత్తున అనుకూల వాతావరణం కనిపిస్తోంది. ఈ సమయంలో మరోసారి తెలిసి అన్నారో.. తెలియక అన్నారో గానీ జగన్ కాపు రిజర్వేషన్ అంశంపై చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. కాపుల రిజర్వేషన్ల అంశం కేంద్రం పరిధిలోది కాబట్టి నేను ఏం చేయలేనని టిడిపిలా హామీ ఇచ్చి వెనక్కి తగ్గలేనని, అయితే కాపు కార్పొరేషన్ నిధులు మాత్రం పెంచుతానని జగన్ వ్యాఖ్యానించారు. దీంతో కాపు నేత ముద్రగడతో పాటు పలువురు భగ్గుమంటున్నారు. ఇంతకాలం ముద్రగడ వైసిపికి లోపాయికారిగా సపోర్టు చేస్తున్నారన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. అలాంటి ముద్రగడ జగన్ పైన ఒక్కసారిగా ఫైరయ్యారు. జగన్ మోహన్ రెడ్డికి ఓట్లెయ్యొద్దంటూ కాపులకు పిలుపునిచ్చారు. ఈ విధంగా రెండోసారి జగన్ చేసిన వ్యాఖ్యలు వైసిపికి ఇబ్బందికరంగా మారాయి. 
 
ఈ వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతల్లోనే అంతర్గతంగా చర్చ జరుగుతోంది. కాపుల రిజర్వేషన్ పైన గతంలోలా మద్దతు ప్రకటిస్తే సరిపోయేదేని, అనవసరంగా ఆ విషయాన్ని కెలికి కోరి కొరివి తెచ్చుకున్నట్లు తయారైందని భావిస్తున్నారు. ఇలా జగన్ నోరు జారి చేసిన రెండు వ్యాఖ్యలు అంతా బాగుందనుకుంటున్న సమయంలో వైసిపికి అనుకోని కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసిపి అధినేత ఆచితూచి మాట్లాడకపోతే మరోసారి ఆయనకు సిఎం కుర్చీ కలగానే మిగిలపోయే పరిస్థితి వస్తుందంటున్నారు విశ్లేషకులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భార్యకు మత్తు ఇచ్చి అసహజ శృంగారం... వీడియో తీసి నెట్‌లో పెడతానన్న భర్త.. ఎందుకు?