Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్డీయే కూటమికి బీటలు... టీడీపీ తిరుగుబాటుతో బీజేపీ నేతల్లో గుబులు

భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి బీటలు వారుతున్నట్టు కనిపిస్తోంది. వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేయడాన్ని అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా తప్పుబట్టింది

Advertiesment
ఎన్డీయే కూటమికి బీటలు... టీడీపీ తిరుగుబాటుతో బీజేపీ నేతల్లో గుబులు
, మంగళవారం, 6 ఫిబ్రవరి 2018 (10:38 IST)
భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే కూటమికి బీటలు వారుతున్నట్టు కనిపిస్తోంది. వార్షిక బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం చేయడాన్ని అధికార తెలుగుదేశం పార్టీ పూర్తిగా తప్పుబట్టింది. పైగా, పార్లమెంట్ వేదికగా చేసుకుని వివిధ రకాల ఆందోళన కార్యక్రమాలకు దిగుతోంది. టీడీపీ ఎంపీలకు ఎన్డీయేతో పాటు విపక్ష పార్టీల మద్దతు కూడా పెరుగుతోంది. ఇది అధికార బీజేపీ ఎంపీల్లో గుబులు పుట్టిస్తోంది 
 
నిజానికి నిన్నటిదాకా దుర్భేద్యంగా ఉన్న ఎన్డీయే కూటమిలో లుకలుకలు బయల్దేరాయి. బీజేపీ మిత్రపక్షాలేవీ మనస్ఫూర్తిగా దాంతో కలిసి నడవడం లేదన్నది బహిరంగ సత్యం. ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడంపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేయగా, దానికి ఇతర పార్టీల మద్దతు పెరుగుతోంది. బీజేపీ వైఖరితో ఎన్డీయే పార్టీలది తలోదారి అవుతుందేమోనని కూటమిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
 
'మాజీ ప్రధాని వాజపేయి హయాంలో ఎన్డీఏ నిర్మాణం జరిగింది. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ముక్కలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు సమీపించే నాటికి ఎన్డీయే కూటమి అన్నదే ఉండే అవకాశం లేదు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఏకాకిగా పోటీ చేయాల్సి వస్తుందేమో' అని అకాలీదళ్‌ ఎంపీ నరేశ్ గుజ్రాల్ వ్యాఖ్యానించడమే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. 
 
ప్రధాని మోడీ అనుసరిస్తున్న వైఖరి వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, బీజేపీకి ఢిల్లీలోనూ, రాష్ట్రాల్లోనూ ఏ పార్టీ కూడా అండగా నిలిచే అవకాశాలు లేవని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే మహారాష్ట్రలో మిత్రపక్షమైన శివసేన తెగదెంపులు చేసుకుంది. అలాగే, నలుగురు ఎంపీలు ఉన్న అకాలీ దళ్ కూడా బీజేపీతో తెగతెంపులు చేసుకుని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావిస్తోంది. 
 
ఇకపోతే, ఎన్డీయేలో అతికీలక భూమిక పోషించే చంద్రబాబు సైతం ఆ దిశగానే అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. జమ్మూకాశ్మీర్‌లో పీడీపీ - బీజేపీల బంధం అంతంతమాత్రంగానే ఉంది. వీటితో పాటు నాగా పీపుల్స్ ఫ్రంట్, రాష్ట్రీయ లోక్‌సమతా పార్టీలు కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ బీజేపీ నేతలకు గుబులు పుట్టిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీకి అంత అహంకారం పనికిరాదు : అకాలీదళ్