Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అన్నాడీఎంకే 134 - డీఎంకే 98... మ్యాజిక్ ఫిగర్ 118... జస్ట్ 20 మందిని లాగితే తమిళనాడులో అధికారం తారుమారు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతితో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకేని ఏకతాటిపై నడిపించే నాయకుడు కనుచూపుమేరలో కనిపించడం లేదు.

అన్నాడీఎంకే 134 - డీఎంకే 98... మ్యాజిక్ ఫిగర్ 118... జస్ట్ 20 మందిని లాగితే తమిళనాడులో అధికారం తారుమారు
, మంగళవారం, 6 డిశెంబరు 2016 (16:02 IST)
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతితో తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్నాడీఎంకేని ఏకతాటిపై నడిపించే నాయకుడు కనుచూపుమేరలో కనిపించడం లేదు. జయలలిత ప్రియనెచ్చెలి శశికళ ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనా... ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఎంతమంది ఆమె మాట వింటారో తెలియదు. దీంతో మున్ముందు ఆ రాష్ట్రంలో పెను సంచలనాలు చోటుచేసుకునే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ముఖ్యమంత్రి పీఠాన్ని నమ్మినబంటు ఓ పన్నీర్ సెల్వం చేపట్టినప్పటికీ... జయకు ఉన్న ప్రజాకర్షణలో పన్నీర్ సెల్వం ఒక వంతు కూడా సాటిరారు. జయ ఉన్నంత కాలం అన్నాడీఎంకేలోని మరే ఇతర నేత కూడా ఆమె దరిదాపుల్లోకి రాలేకపోయారు. అందువల్లే ఆ పార్టీ భవిష్యత్‌పై అనేక సందేహాలు, ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 
 
ప్రస్తుతం తమిళనాడు శాసనసభలో అధికార, విపక్ష పార్టీ బలాబలాలను పరిశీలిస్తే... అసెంబ్లీలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య 234. ఇందులో అధికార అన్నాడీఎంకే బలం 134 కాగా... విపక్ష డీఎంకే, కాంగ్రెస్ కూటమి బలం 98గా ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 118. అంటే, డీఎంకే కూటమి మరో 20 మంది ఎమ్మెల్యేలను లాగేస్తే చాలు.... మ్యాజిక్ ఫిగర్ సాధించినట్టే. ఇప్పుడు ఈ చిన్న అంశమే... తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చను లేవదీస్తోంది. 
 
ఇంతకాలం జయలలిత కనుసైగలకు అనుగుణంగా భయపడో, భక్తితోనే ఉన్న పలువురు అన్నాడీఎంకే నేతలకు... ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ వచ్చినట్టైంది. ఇదే అంశాన్ని బేస్‌గా చేసుకుని... విపక్ష డీఎంకే పావులు కదిపే అవకాశాలు లేకపోలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చో, తాయిలాలు ఇచ్చో వారిని లాక్కోవడానికి డీఎంకే ఖచ్చితంగా ప్రయత్నాలు చేపట్టవచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. 
 
మరోవైపు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, జయ స్నేహితురాలు శశికళల మధ్య చిన్న విభేదం తలెత్తినా... డీఎంకే పని మరింత సులువవుతుంది. ఇదే జరిగితే, తమిళనాడులో అధికార మార్పిడి తథ్యంగా జరిగినట్టే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీతో పాటు.. కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరిస్తుందన్న అంశం ఆసక్తిగా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోడీ చేతిలో అన్నాడీఎంకే భవితవ్యం.. పావులు కదుపుతున్న బీజేపీ? శశికళ - పన్నీర్‌లతో టచ్