Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

త్రివిక్రమ్ పుట్టినరోజు నేడే... ఒక వెబ్ సైట్, ఆండ్రాయిడ్... 'జనసేన'కు ఎజెండా

మాట ఆయన మాట వింటుంది. జీవిత సత్యాలు చాలా సులువుగా సంభాషణల ద్వారా పలికించగల నేర్పరి అతడు. మరుగున పడుతున్న మానవ విలువలు, కుటుంబ సంబంధాలను, వాటి విలువలను పాత్రలలోని సంభాషణల ద్వారా చెప్పిస్తూ... ప్రేక్షకుల చేత అవుననిపిస్తాడు. చక్కని కథలకు కమర్షియాలటీ జోడ

Advertiesment
Happy birthday Trivikram Srinivas
, సోమవారం, 7 నవంబరు 2016 (15:04 IST)
మాట ఆయన మాట వింటుంది. జీవిత సత్యాలు చాలా సులువుగా సంభాషణల ద్వారా పలికించగల నేర్పరి అతడు. మరుగున పడుతున్న మానవ విలువలు, కుటుంబ సంబంధాలను, వాటి విలువలను పాత్రలలోని సంభాషణల ద్వారా చెప్పిస్తూ... ప్రేక్షకుల చేత అవుననిపిస్తాడు. చక్కని కథలకు కమర్షియాలటీ జోడించి పదునైన సంభాషణలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయగల మాటల మాంత్రికుడు అతడు. తెలుగు పదాల తీపిని ప్రేక్షకులకు రుచి చూపించి తెలుగు భాష, ప్రాస ఇంత గొప్పదా అని ప్రతి తెలుగువాడిని మెస్మరైజ్ చేయగల అక్షర శక్తివంతుడతడు. అతడు మరేవరో కాదు తెలుగు సినీ మాటల రచయిత, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. నేడు ఈ మాటల మాంత్రికుని జన్మదినం. 
 
సినీ రంగంలో ప్రతీ రచయితకూ ఒకశైలి ఉంటుంది. త్రివిక్రమ్‌దీ అంతే. కాకపోతే ఆయన కలం కాస్త చిలిపిదనం.. కాస్త వెటకారం.. ఇంకాస్త గాంభీర్యం ఒలకబోస్తుంది. అన్నింటికీ మించి ఆత్మీయమైన మాటలతో ఆలోచింపజేస్తుంది. కొన్ని సంభాషణలు వింటే అరె... నిజమేగా అనిపిస్తుంది. త్రివిక్రమ్ అనగానే కొద్దిపాటి వ్యంగ్యంతో కూడిన సునిశితమైన హాస్యం, జీవిత సత్యాలతో కూడిన పంచ్‌ల మెరుపులు, జీవిత తాత్వికత కలిసిన మాటలు గుర్తువస్తాయి. అలా ఎవరైనా రాసినా ... అరే త్రివిక్రమ్‌లా రాస్తున్నాడే అంటారు. అలా తన పేరుకే ఓ బ్రాండ్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్.
 
త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్లో ప్రస్తుతం టాప్ దర్శకుల జాబితాలో ఉన్న వ్యక్తి. కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా.. మాటల రచయితగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి.. మాటల రచయితలకు వ్యాల్యు తీసుకొచ్చారు. సినిమాకు డైలాగ్స్ రాసి కోటి రూపాయలు పారితోషికం అందుకున్న వ్యక్తి త్రివిక్రమ్. చాలామంది హీరోల కోసం సినిమాలకు వెళ్తారు. కాని దర్శకుల కోసం సినిమాలు చూసే వారిసంఖ్య చాలా తక్కువ. కాని త్రివిక్రమ్ సినిమా అలాకాదు. త్రివిక్రమ్ సినిమా అంటే అందులో కొత్తగా ఏదో ఉంటుందని చెప్పి సినిమాలకు వెళ్లేవారి సంఖ్యే ఎక్కువ. సినీ ఇండస్ట్రీ వేడుకలకు సాధారణంగా దూరంగా ఉండే త్రివిక్రమ్ కేవలం కొన్ని ముఖ్యమైన మరియు అతనికి సన్నిహితమైన వ్యక్తులకు సంబంధించిన వేడుకలకు మాత్రమే హాజరవుతారు. 
 
అలాంటి సందర్భాలలో కూడా త్రివిక్రమ్ ఏమి మాట్లాడతారా... అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. మా మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్లో సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి త్రివిక్రమ్ మాట్లాడిన మాటలు యూట్యూబ్‌లో ఇప్పటికీ లక్షలలో ప్రేక్షకులు వీక్షిస్తున్నారు. అత్తారింటికి దారేది ఆడియో ఫంక్షన్లో పవన్ గురించి త్రివిక్రమ్ మాట్లాడిన మాటాలు అమాంతంగా పవన్‌ని రాష్ట్ర రాజకీయ నాయకునిగా తెలుగు ప్రజలు అంగీకరించేలా చేశాయి. సన్ ఆఫ్ సత్యమూర్తి ఆడియో ఫంక్షన్లో తండ్రిని గూర్చి త్రివిక్రమ్ చెప్పిన మాటలు విని గుండె బరువెక్కని వారు ఉండరు. అ..ఆ.. సినిమా ఫంక్షన్లో మానవ సంబంధాలను గూర్చి ఆయన చెప్పిన మాటలు వింటే మనుష్యులుగా పుట్టి మనమెందుకు అలా ఉండలేకపోతున్నామా... అని ఆలోచన సంఘర్షణకు గురి చేస్తుంది.
 
ఆకెళ్ళ శ్రీనివాస్ శర్మ.. ఇండస్ట్రీ లోకి వచ్చాక త్రివిక్రమ్ శ్రీనివాస్‌గా పేరు మార్చుకున్నారు. భీమవరంలో జన్మించిన త్రివిక్రమ్ ఆంధ్రా విశ్వవిద్యాలయంలో ఫిజిక్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా కూడా పనిచేశారు. సాహిత్యంపై ఉన్న అభిరుచే త్రివిక్రమ్‌ను సినిమాల వైపు మళ్లేలా చేసింది. అలా హైదరాబాద్‌ వచ్చిన ఆయన సునీల్‌తో కలిసి ఒకే రూమ్‌లో ఉన్నారు. పోసాని కృష్ణమురళి వద్ద సహాయకుడిగా కూడా పనిచేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్వయంవరం సినిమాకు మాటలు అందిస్తే.. ఆయన మాటలు అందించిన రెండో చిత్రం నువ్వేకావాలి సినిమా ముందుగా విడుదలైంది. అక్కడి నుంచి  'చిరునవ్వుతో..', 'నిన్నే ప్రేమిస్తా', 'నువ్వునాకు నచ్చావ్‌', చిత్రాలకు సంభాషణలు రాశారు. తొలిసారి మెగాఫోన్‌ పట్టి తరుణ్‌తో తీసిన 'నువ్వే నువ్వే' బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత కూడా త్రివిక్రమ్‌ రచయితగా కొనసాగారు. 'వాసు', 'మన్మథుడు', 'ఒకరాజు ఒకరాణి', 'మల్లీశ్వరి', 'జై చిరంజీవ' చిత్రాలకు మాటల రాశారు. 'చిరు నవ్వుతో..' రచయితగా నంది అవార్డు తెచ్చిపెట్టిన తొలి చిత్రం.
 
త్రివిక్రమ్ మాటలు అందించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాకు దాదాపు కోటి రూపాయల పారితోషికం అందుకున్నారు. బెస్ట్ డైలాగ్ రైటర్‌గా త్రివిక్రమ్ ఐదుసార్లు నంది అవార్డులు అందుకున్నారు. రెండుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నారు. త్రివిక్రమ్ కెరీర్లో ఇప్పటివరకు కేవలం 6 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించగా.. అందులో ఖలేజా మినహా అన్ని సూపర్ హిట్ అయ్యాయి. త్రివిక్రమ్ అతడు చిత్రం పోలిష్ భాషలో తర్జుమా అయ్యి అక్కడ కూడా సూపర్ హిట్ అయ్యింది. పెప్సీ, జోస్ అలూకాస్, సెల్ కాన్, నవరత్న వంటి బ్రాండ్స్‌కు కమర్షియల్ యాడ్ మేకర్‌గా త్రివిక్రమ్ పనిచేశారు. త్రివిక్రమ్ మాటలతో పాటు ఒకరాజా ఒక రాణి, తీన్‌మార్ చిత్రాలకు పాటలు కూడా రాశారు.
 
త్రివిక్రమ్.. పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన జల్సా సినిమా ఆడియో అప్పట్లో 90 లక్షలకు అమ్ముడుపోయి సంచలనం సృష్టించింది. మళ్లీ మహేష్‌ బాబుతో కలిసి త్రివిక్రమ్‌ 'ఖలేజా' తీశారు. ఆ సినిమా ఆశించిన విజయం సాధించికపోయినా ఆకట్టుకుంది. మహేష్‌ డైలాగ్‌ డెలివరినీ మార్చేసిన చిత్రమది. ఆ తర్వాత అల్లు అర్జున్‌తో 'జులాయి', పవన్‌తో 'అత్తారింటికి దారేది', మళ్లీ అల్లు అర్జున్‌తో 'సన్నాఫ్‌ సత్యమూర్తి', ఈ ఏడాది నితిన్‌తో 'అ ఆ' చిత్రాలు త్రివిక్రమ్‌ దర్శకత్వ ప్రతిభకు నిదర్శనాలు. ప్రస్తుతం పవన్‌ కథానాయకుడిగా మరో చిత్రానికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించనున్నారు. ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ మధ్య మంచి స్నేహం ఉన్నది. ఈ స్నేహం కారణంగానే పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనకు త్రివిక్రమ్ ఎజెండాను రూపొందించుతున్నట్టు తెలుస్తున్నది.
 
స్టార్ హీరోలకు ఉన్నంత పాపులారిటీ మన ‘మాటల మాంత్రికుడు’ త్రివిక్రమ్ సొంతం. ఎందుకంటే త్రివిక్రమ్ మాటలు వినేకొద్ది వినాలనిపిస్తాయి. గుర్తుకు తెచ్చుకుని మరీ నవ్వుతుంటాం. జీవితంలో ప్రతి సందర్భంలోనూ త్రివిక్రమ్ రాసిన ఏదొక డైలాగ్ మనకు తారసపడుతూనే ఉంటుంది. విశేషం ఏమిటంటే… చాలా అరుదుగా మాట్లాడే త్రివిక్రమ్ మాటలు… ఆయన నోటి వెంట వస్తే… అవి సామాన్య మనుషుల మదిని తాకుతాయి. కానీ, అవే మాటలు నటీనటుల నుండి వస్తే… వెండితెరపై పంచ్‌లను పేలుస్తాయి. అంతటి స్వభావం గల మాటలను పలికించడం త్రివిక్రమ్ ఒక్కడి సొంతమే. ఆ స్థాయిలో ప్రేక్షకుల మదిని పలకరించే త్రివిక్రమ్ మాటలన్నీ ఒక దగ్గరికి చేరిస్తే ఎలా ఉంటుంది. అవును… ఈ మాటల మాంత్రికుడి అభిమానులు ప్రస్తుతం అదేపని చేస్తున్నారు.
 
నవంబర్ 7వ తేదీన (సోమవారం నాడు) ఆకెళ్ళ నాగ శ్రీనివాస్ శర్మ (త్రివిక్రమ్)అనే ఈ ‘మాటల మాంత్రికుని ’ జన్మదినం సందర్భంగా ఒక ప్రత్యేక వెబ్‌సైట్‌ను మరియు ఆండ్రాయిడ్‌లో పనిచేసే విధంగా ఒక మొబైల్ యాప్‌ను రూపొందించి విడుదల చేసారు. దీనిని అధికారికంగా త్రివిక్రమ్ జన్మదినం సందర్భంగా ప్రారంభించబోతున్నారు. trivikramcelluloid.in అనే పేరుతో ఒక వెబ్ సైట్‌ను మరియు ఎబిసి డిజిటల్ మీడియా రూపొందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరుతో ఉన్న యాప్ ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలకు సంబంధించిన సకల సమాచారం ఇందులో అందుబాటులో ఉంచారు. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలోని పంచ్ డైలాగ్‌లతో కూడిన వీడియోలను, ఆడియోలను ఉంచడంతో ‘మాటల మాంత్రికుడు’ ఫ్యాన్స్‌కు పండగ పండగగా ఉంది. 
 
ఈసారి త్రివిక్రమ్ జన్మదినోత్సవాన్ని అభిమానులు సదరు వెబ్‌సైట్ మరియు యాప్‌ను చూసి జరుపుకునే విధంగా ఉండటం విశేషం. ఒక దర్శకుడికి ఈ రేంజ్‌లో అభిమానులు పట్టం కట్టడం అంటే అది సాధారణ విషయం కాదు. దీనికి కారణం త్రివిక్రమ్ కలం నుండి జాలువారిన ప్రతి అక్షరం ఒక సినిమాలోనిది కాకుండా, మన మదిని తాకాయి. అందుకే ఈ ‘మాటల మాంత్రికుడు’ పేరు టైటిల్ కార్డ్స్‌లో ఉంటే…. అందరికీ అంత ఆసక్తి… ఉత్సాహం. అక్షరానికి ఉన్న ‘పవర్’ ఏంటో ఈ తరానికి చాటి చెప్పే వ్యక్తులలో ఈ ‘త్రివిక్రముడు’ స్థానం ఎప్పుడూ నెంబర్ వన్నే అని చెప్పడంలో అతిశయోక్తి కాదేమో..?
- డాక్టర్ తన్నీరు కళ్యాణ్ కుమార్, తెలుగు లెక్చరర్, తెనాలి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిన్న శాంసంగ్ గెలాక్సీ నోట్‌లు.. నేడు శాంసంగ్ వాషింగ్‌మెషీన్లు... పేలిపోతున్నాయ్...