Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుజరాత్ పోల్స్ : బీజేపీ గుండెల్లో గుబులు

గుజరాత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ దశలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్టు సమాచారం. దీంతో రెండోదశ ఎన్నికల పోలింగ్‌ అత్యంత కీలకంకానుంది.

గుజరాత్ పోల్స్ : బీజేపీ గుండెల్లో గుబులు
, సోమవారం, 11 డిశెంబరు 2017 (14:10 IST)
గుజరాత్ తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ దశలో అధికార బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్టు సమాచారం. దీంతో రెండోదశ ఎన్నికల పోలింగ్‌ అత్యంత కీలకంకానుంది. ఈ దశలో వీలైనంతమేరకు భారీ పోలింగ్ అయ్యేలా కమలనాథులు ప్రణాళికలు రూపొందించినట్టు సమాచారం. ఎందుకంటే, గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి బీజేపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పటి హవా ఇపుడు బీజేపీకి కనిపించడం లేదు. దీనికితోడు బీజేపీని ఓడించేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఏకమయ్యాయి. ఫలితంగా గుజరాత్ ఎన్నికలు బీజేపీకి అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. 
 
ఇప్పటివరకు గుజరాత్ ఎన్నికల్లో గెలుపోటములను పటీదార్ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు శాసిస్తూవచ్చారు. మోడీ సీఎంగా ఉన్నంతవరకు ఈ వర్గం వారు బీజేపీకి అండగా నిలబడ్డారు. మోడీ ప్రధాని అయ్యాక సీన్ రివర్స్ అయింది. పటీదార్ ఉద్యమ పుణ్యమాని ఈ సామాజికవర్గానికి బీజేపీ బద్ధశత్రువుగా మారిపోయింది. 
 
అదేసమయంలో కాంగ్రెస్ పార్టీతో పటీదార్లు చేతులు కలిపారు. దీనికితోడు దళిత యువనేతలంతా కాంగ్రెస్ పార్టీకే జైకొట్టారు. ఫలితంగా మాకు ఎదురేలేదనే ధీమా ప్రదర్శించే మోడీ అండ్ టీమ్.. ఇప్పుడు టెన్షన్ పడుతోంది. గుజరాత్ ఎన్నికల్లో ఫలితాలు భిన్నంగా వస్తే బీజేపీలో నరేంద్ర మోడీ, అమిత్ షాల హవా తగ్గనుంది. పైగా, వీరికి వ్యతిరేకంగా ధిక్కార స్వరం వినిపించే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అందుకే గుజరాత్ ఎన్నికలను మోడీ, షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ఇద్దరు నేతలకు గుజరాత్ సొంత రాష్ట్రం కావడంతో మరింతగా దృష్టికేంద్రీకరించారు. 
 
ఒక్కమాటలో చెప్పాలంటే ఇప్పుడు గుజరాత్ ఎన్నికలు మోడీ సర్కారుకు సెమీ ఫైనల్‌లా మారాయి. గుజరాత్‌లో కనిపిస్తున్న ప్రతికూలతలు, కమలదళాన్ని కలవరపరుస్తున్నాయి. చేసుకున్నవారికి చేసుకున్నంత అన్నట్టు... ఈ మూడున్నరేళ్లుగా మోడీ తీసుకున్న పలు నిర్ణయాల ప్రభావం ఇప్పుడు కనిపించనుందనే వాదనలు పెరుగుతున్నాయి. మొత్తంమీద గుజరాత్ ఎన్నికలు కమలనాథుల గుండెల్లో గుబులు రేపుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ మెట్రో రైళ్ళకు అనూహ్య స్పందన