కొన్నిసార్లు ప్రకృతి సంపదను కదిలిస్తే అవి ఎదురుతిరిగి కాటేస్తుంటాయి. ఎవరైతే వాటిని అంటుకుంటారో వారిని అవి ఎంతమాత్రం విడిచిపెట్టవు. వాటికి జరిగిన అన్యాయాన్ని ప్రతిన్యాయం చేసేవరకూ పట్టుకుని పీడిస్తుంటాయి. ఇలాంటివి ఎన్నో వున్నాయి. గతంలో అక్రమ మైనింగ్ నిర్వహించినందుకు కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్థన్ రెడ్డి ఊచలు లెక్కించాల్సి వచ్చింది. ఆయన కూడా ప్రకృతి వనరులను టచ్ చేయడంతో ఆ పరిస్థితి తలెత్తింది. ఇక తాజాగా వైజాగ్ నగర తీర ప్రాంతంలో ఠీవిగా తలెత్తుకుని వున్నట్లు కనిపించే రుషికొండను వైసిపి సర్కార్ కదిలించింది. కోర్టు అనుమతితో కొండను తవ్వింది. రుషి కొండ రూపాన్ని చెదరకొట్టింది. నిత్యం కొండ చుట్టూ తిరిగే సామాన్య ప్రజానీకానికి రుషికొండపై ప్యాలెస్ పేరుతో ఆ వంక చూడకుండా చేసేసింది. ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు.
ఎన్నికలు సమీపించేవేళ అప్పటి పర్యాటక శాఖామంత్రి రోజా మాత్రం వెళ్లి ఆ ప్యాలెస్ ప్రారంభోత్సవం చేసి వచ్చారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి... రుషికొండపై అత్యద్భుతమైన పర్యాటక భవనాలు నిర్మించామని చెప్పారు. అంతవరకు బాగానే వుంది. ఆ వెంటనే వైజాగ్ రాజధానిగా చేసుకుంటాము కనుక ఇక్కడ ముఖ్యమంత్రికి నివాసయోగ్యమైన భవనం ఏదన్నది తెలిపేందుకు త్రీమెన్ కమిటీ ఏర్పాటు చేసామనీ, వారు రుషికొండపై వున్న ప్యాలెస్ అన్నివిధాలా ఆమోదయోగ్యమైనదని చెప్పారని వెల్లడించారు. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఆ భవనాలు పర్యాటకం కోసం కాదనీ, 2024లో జగన్ ముఖ్యమంత్రి అయి వుంటే ఆయన మకాం అక్కడేనన్నది ఆమె మాటలను బట్టి అర్థమవుతుంది. కానీ సీన్ రివర్స్ అయ్యింది.
మొత్తం తలకిందులై వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసారు ఏపీ ప్రజలు. దానితో గత ప్రభుత్వంలో చేపట్టిన పనులు ఒక్కొక్కటిగా వెలికి వస్తున్నాయి. అందులో ప్రధానమైనదిగా రుషికొండ ప్యాలెస్ వ్యవహారం బయటకు వచ్చింది. దీన్ని ఇప్పుడు జాతీయ మీడియా జగన్ ప్యాలెస్ అంటూ చర్చలు పెడుతూ తూర్పారపడుతోంది. దీనితో వైసిపి నాయకులు... అవి ప్రభుత్వ భవన సముదాయాలనీ, రాష్ట్రపతి-ప్రధానమంత్రి వంటి వీవీఐపిలు వచ్చినప్పుడు ఆ భవనాలను వాడుకునే ఉద్దేశంతో నిర్మించినట్లు చెబుతున్నారు.
కానీ ప్రాంతీయ, జాతీయ మీడియా ఛానళ్ల వాదన వేరేగా వుంది. రాష్ట్రంలో కనీసం ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సకాలంలో చెల్లించలేని స్థితిలో వున్నప్పుడు అసలు ఇలాంటి నిర్మాణాలు చేపట్టడం అవసరమా? అనే ప్రశ్నలు ప్రతి ఒక్కరు వేస్తున్నారు. రుషికొండపై ప్యాలెస్ నిర్మాణం అంతా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో... అంటే మాజీమంత్రి రోజా కనుసన్నల్లో జరిగిందని తెదేపా నాయకులు భావిస్తున్నారు. ఈ అక్రమ కట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారని ఆరోపిస్తున్నారు. ఈ కారణంతో మాజీ మంత్రి రోజాను రుషి కొండ ప్యాలెస్ నిర్మాణం వ్యవహారంలో అసలు ఏం జరిగిందన్నది తెలుసుకునేందుకు విచారణకు ఆదేశిస్తారా అనే చర్చ జరుగుతోంది. మరి ఏమి జరుగుతుందన్నది వేచి చూడాల్సిందే.