Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీది క‌రోనా బ్యాచ్‌నా...? అయితే కెరీర్‌కు తీవ్ర న‌ష్టం!

Advertiesment
మీది క‌రోనా బ్యాచ్‌నా...? అయితే కెరీర్‌కు తీవ్ర న‌ష్టం!
విజ‌య‌వాడ‌ , సోమవారం, 17 జనవరి 2022 (17:16 IST)
మీది ఏ బ్యాచ్ అంటే, క‌రోనా బ్యాచ్ అని చెప్పుకునే ప‌రిస్థితులు నేటి విద్యా వ్య‌వ‌స్థ‌లో క‌నిపిస్తున్నాయి. గ‌త రెండేళ్ళుగా విద్యా సంవ‌త్స‌రాలు క‌రోనా వ‌ల్ల దొర్లుకుపోతున్నాయి. క‌రోనా పేరుతో ప‌రీక్ష‌లు ర‌ద్ద‌యి, పూర్తిగా విద్యార్థుల్లో ప్ర‌మాణాలు త‌గ్గిపోతున్నాయి. ఆన్ లైన్ చ‌దువులు చ‌ట్టుబండ‌ల్లా మారి సిస‌లైన విద్యార్థుల‌కు భారీ న‌ష్టం, త‌ల్లితండ్రుల‌కు క‌ష్టంగా మారుతున్నాయి.
 
 
కరోనా కేసుల పేరు చెప్పి విద్యార్థులను విద్యా సంస్థలకు దూరం చేయడానికి శాటిలైట్ ఛానెల్స్, యూటూబ్ ఛానెల్స్, వార్తా పత్రికలు, సోషల్ మీడియా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయ‌నే అప‌వాదు మొద‌లైంది. మనం చదువుకున్నాం ఇక చాలు... దీని వ‌ల్ల మనకు ఒరిగింది ఏమీ లేదు. ఇక ఈ భావి తరం మాత్రం చదువుకుని ఏం సాధిస్తారనో ఏమో కాని, ఎంత వీలైతే అంత తొందరగా స్కూల్స్, కాలేజీలు మూసేలా క‌రోనా పేరిట‌ శాయాశక్తుల ప్రయత్నిస్తున్నారు. 
 
 
నిన్నటి మన జ్ఞానాన్ని రేపటి తరానికి  అందించి వారిని రేపటి భవిష్యత్తుకి రిసోర్స్‌గా తయారు చేసి విఙ్ఞానవంతులుగా, ఆలోచనపరులుగా చేయాల్సిన భాధ్యత నేటితరం మీద ఉంది. కానీ, క‌రోనా పేరు చెప్పి పిల్ల‌ల్ని విద్య‌కు దూరం చేయ‌డం వారి భ‌విత‌కు చాలా ప్ర‌మాద‌క‌రంగా మారుతోంది. కరోనా కేసులను విశ్లేషిస్తే, ఇది ఇరవై ఏళ్ళ‌లోపు వారి మీద పెద్దగా ప్రభావం చూపిందైతే లేదు. అయినా సరే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం దాన్ని ఎదుర్కునే అవకాశాలున్నాయి. 
 
 
కానీ, మార్చి 22, 2020 నుండి  జనవరి 31, 2021 వరకు విద్యార్థులు పూర్తిగా చదువుకు దూరమయ్యారు. మధ్యలో ఆన్లైన్ క్లాసులను ప్రభుత్వం నిర్వహించినప్పటికీ అది అంత ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తర్వాత ఫిబ్రవరి, మార్చి రెండు నెలలు మాత్రమే ప్రత్యక్ష తరగతుల భోదన జరిగింది. ఆ తర్వాత సెప్టెంబర్ 1, 2021 నుండి ఇప్పటివరకు అప్రతిహతంగా క్లాసులు కొనసాగాయి. లాక్ డౌన్లో పాఠశాల స్థాయి విద్య పూర్తిగా అటకెక్కింది. 
 
 
విద్యార్థులకు ఉండాల్సిన కనీస సామర్ద్యాలైన చదవడం, రాయడం, సమాచారాన్ని విశ్లేషించడం,  పటాలను వివరించడం, చతుర్విధ ప్రక్రియలు, క్రియేటివ్ థింకింగ్, సృజనాత్మక రచన పూర్తిగా శూన్యం అయిపోయాయి. ఇప్పుడు ఒక స్కూల్లో ఒక విద్యార్థి ఆరవ తరగతిలో ఉన్నాడంటే, అర్థం అతను నాలుగవ తరగతి మాత్రమే చదివాడని, తనకు ఐదవ తరగతి సామర్థ్యాలు అసలు లేవ‌ని తేలుతోంది. ఇక నాలుగవ తరగతి సామర్థ్యాలు మర్చిపోయి, అతనిప్పుడు మూడవ తరగతి ఙ్ఞానంతో మాత్రమే ఆరవ తరగతి చదువుతున్నాడ‌ని స్ప‌ష్టం అవుతోంది. ఇప్పుడున్న కొవిడ్, ఒమిక్రాన్ లాంటి భయానక పరిస్థితుల మధ్య అతన్ని ఆరవ తరగతి అకడమిక్ స్టాండర్డ్‌కి తీసుకురావాలంటే అదనపు గంటలు బోధిస్తే సరిపోదు. అతన్ని మానసికంగా కూడా చ‌దువుకు సంసిద్ధుడిని చేయాలి. ఈ భాధ్యత యువత, తల్లిదండ్రులు, టీచర్లు, ప్రభుత్వాల మీద ఎంతో ఉంది 
 
 
ఇక గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ఎస్.ఐ.ఇ.టి., దూరదర్శన్‌ల ద్వారా పాఠశాల విద్యను కొంత నేర్పించే ప్రయత్నం చేసింది. అలానే 90%హైస్కూల్స్ యూట్యూబ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, జూమ్ ద్వారా భోధన చేపట్టారు. తమకు చేతనైనంతలో తమ స్వంత ఖర్చుతో ఎంతో కొంత నేర్చుకునే అవకాశం కల్పించారు. అలానే దాదాపుగా అన్ని జిల్లాల విద్యాశాఖ కార్యాలయాలు దీని కోసం ప్రత్యేక కసరత్తే చేసాయి. అయితే ఎవరు ఎంత శ్రమ చేసినా వీటి ఫలితం మాత్రం అత్యల్పం. ఇపుడు విద్యార్థుల‌కు ఈ స‌మ‌యంలో మళ్ళీ కొవిడ్, ఒమిక్రాన్ వ్యాప్తి అంటూ విద్యార్థులను ఇంటికి పరిమితం చేయడం అన్యాయమే అవుతుంది. వారు పూర్తిగా నైపుణ్యం లేని ప్రొఫెషనల్ విద్యావంతుల్లా మారిపోతారు. అందుకే ముఖ్యంగా పాఠశాల విద్యకు విద్యార్థులు దూరమవ్వకుండా కొవిడ్  నిబంధనలు పాటిస్తూ కొన్ని సూచనలు చేస్తున్నారు. 
 
 
ప్రతి తరగతిలో సగం మంది విద్యార్థులనే రోజూ స్కూల్ కి రమ్మనాలి. ఉదయం పూట 6,7,8 క్లాసెస్ లో సగం మందిని, మధ్యాహ్నం 9,10 క్లాసెస్ లో సగం మందిని తర్వాత రోజు ఆ మిగతా సగం మందిని స్కూల్ కి వచ్చేలా ఏర్పాటు చేయాలి. మధ్యలో ప్రతి రూంను శానిటైజ్ చేయించాలి. 
 
 
ఇక రోజూ మూడు సబ్జెక్ట్స్  మాత్రమే భోధన చేయాలి. మిగతా మూడు సబ్జెక్ట్స్ వారు తర్వాత రోజు వీళ్ళు స్కూల్ కి రారు కాబట్టి  ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ కాని, రీడింగ్ అండ్ రైటింగ్  వర్క్ కాని ఇచ్చి దాన్ని ఫోన్ చేసి సూపర్ వైజ్ చేయాలి. 
 
 
ప్రతి స్కూల్ కి ఆన్లైన్ క్లాస్ టీచింగ్ కోసం (ఎక్విప్ మెంట్ కొనడం కోసం) ప్రభుత్వం రెండు వేల రూపాయలు మూడు నెలలు పాటు విడుదల చేయాలి. మిగతా ఖర్చును పాఠశాల, సంబంధిత గ్రామ పంచాయితీనే  భరించేట్లు SMC లను మోటివేట్  చేయాలి. 
 
 
ఇక క్లాస్ రూంలో విద్యార్థుల సంఖ్య అరవై కి మించి ఉంటే ప్రతి రోజు వచ్చే  ముప్పై మందిని కూడా రెండు తరగతులుగా విభజించాలి.ప్రతి పాఠశాల ప్రత్యేక టైం టేబుల్ ను ఏర్పాటు చేసుకోవాలి.నాలుగు రోజుల నిడివిలో  ప్రతి విద్యార్థికి అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేయాలి.
 
 
గత తరగతి స్టాండర్డ్స్ ఖచ్చితంగా అవసరమయ్యే గణితం, ఫిజికల్ సైన్స్ , బయోలజికల్ సైన్స్ లలో కనీసం ఒక సబ్జెక్ట్ ఒక వారం పాటు ప్రతి రోజూ ఉండేలా, తర్వాత వారం వీటిలోనే మరో సబ్జెక్ట్ వారమంతా  ఉండేలా చూడాలి. 

 
ఇంటి దగ్గర ఉండే విద్యార్థుల కోసం ప్రతి క్లాస్ కి  ఒక సబ్జెక్ట్ ను ఆన్లైన్ లో జూమ్ లేదా యూటూబ్ లో బోధించాలి.ఆ వర్క్ ను పాఠశాల స్థాయిలోనే బోధన తర్వాత రోజు పర్యవేక్షణ చేయాలి .ఇదంతా ప్రత్యేకంగా రికార్డ్ గా మెయిన్ టెయిన్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులతో కూడా ఫోన్ కాంటాక్ట్ లో ఉండాలి. 

 
మధ్యాహ్న భోజన సౌకర్యం ఉదయం పూట వచ్చే విద్యార్థులకు మాత్రమే కల్పించాలి.
ఎవరైనా విద్యార్థులు మేము కూడా స్కూల్ కి వచ్చి తింటామన్న సమాచారం ఉదయం పదిలోపు పాఠశాలకు ఇస్తే వారికి కూడా ఆ సౌకర్యం కల్పించాలి.ప్రతిరోజు ఎగ్ ని ప్రొవైడ్ చేయాలి కనీసం ఈ మూడు నెలల పాటైనా ఎగ్ రేట్ ను ప్రస్తుతం ఇస్తున్న నాలుగు రూపాయల ధర కాకుండా ఆరు రూపాయల ధరతో మిడ్ డే మీల్స్ ఏజెన్సీలకు ఇవ్వడం ద్వారా వారిని కూడా ఆదుకున్నతుంది.  ఇలా చేయడం ద్వారా విద్యార్థులు స్కూల్ నుండి దూరమవ్వరు..బోధన ప్రతిరోజూ జరుగుతుండడం వలన విద్యార్థి తనను తాను మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంద‌ని విద్యా వేత్త‌లు సూచిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అబుదాబి ఎయిర్ పోర్టు కేంద్రంగా ఉగ్రవాదుల దాడి