ప్రాణాంతకమైన “కరోనా” వైరస్ ప్రభావం వల్ల దేశంలో నిరుద్యోగుల సంఖ్య ఎన్నడూ లేని విధంగా 26 శాతానికి చేరుకుందని ‘సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి’ వెల్లడించింది. మున్ముందు దేశంలోని 70 శాతం కంపెనీలు ఉద్యోగుల సంఖ్యలో కోత విధిస్తాయని, 50 శాతం కంపెనీలు వేతనాలను తగ్గిస్థాయని ‘ఫిక్కీ-ధృవ’ నిర్వహించిన ఓ పారిశ్రామిక అధ్యయనంలోవెల్లడించింది.
“కరోనా”ను నియంత్రించడంలో భాగంగా దేశవ్యాప్తంగా ‘లాక్‌డౌన్’ అమలుకు ముందు వలస కార్మికుల పరిస్థితి గురించి పట్టించుకోవడంలో కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు విఫలమయ్యాయని, పర్యవసానంగా దేశంలో దాదాపు 50 కోట్ల మంది వద్ద నగదు నిల్వలు పూర్తిగా హరించుకు పోవడం, మరో 50 కోట్ల మంది వద్ద నగదు నిల్వలు సగానికి సగం తగ్గాయని దేశ ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
పూర్తిగా నగదు హరించుకు పోయిన వలస కార్మికులు ఇరుగుపొరుగు లేదా స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తోన్న “అన్నదాన” కార్యక్రమాలపై ఆధారపడి ప్రాణం నిలుపుకుంటున్నారు. రాష్ట్రాల సరిహద్దుల్లో చిక్కుకుపోయిన వారు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తాత్కాలిక శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.
వివిధ రాష్ట్రాల్లో “లాక్‌డౌన్” సందర్భంగా పేదలకు అదనపు రేషన్ సరకులతోపాటు, 1500 రూపాయల నుంచి 2000 రూపాయల వరకు నగదు చెల్లిస్తున్నారు. నేటి రోజుల్లో నలుగురైదుగురు సభ్యులుగల కుటుంబాలకు ఆ మొత్తం ఏ మూలకు సరిపోదు. వలస కార్మికులకు ఆ సహాయం అందడం లేదు. వారి బాగోగులను చూసుకునే బాధ్యతను వారు పనిచేసే కంపెనీల యాజమాన్యాలకు, వారిని తీసుకొచ్చిన కాంట్రాక్టర్లకు అప్పగించారు. వారి విధుల నిర్వర్తన అంతంతమాత్రంగానే కొనసాగుతోంది.
“కరోనా” సంక్షోభంలో ప్రజలను ఆదుకునేందుకు అమెరికా 1500 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించగా, బ్రిటన్ ప్రభుత్వం ఆపద్ధర్మంగా 500 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. భారత్ కేవలం 1 లక్ష 70 వేల కోట్ల రూపాయలను ప్రకటించింది. దేశ ఆర్థిక వ్యవస్థ బాగోలేకపోవడం వల్లనే భారత్ అతి తక్కువ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించాల్సి వచ్చిందని ఆర్థిక నిపుణలు చెబుతున్నారు.