Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అన్నాడీఎంకేలో ముసలం : సీఎం కుర్చీకావాలన్న శశికళ.. కుదరదన్న పన్నీర్‌సెల్వం

పురట్చితలైవి అమ్మ జయలలిత చనిపోయి సరిగ్గా వారం రోజులు కూడా గడవలేదు. కానీ, అందరూ ఊహించినట్టుగానే అన్నాడీఎంకేలో ముసలం మొదలైంది.

Advertiesment
అన్నాడీఎంకేలో ముసలం : సీఎం కుర్చీకావాలన్న శశికళ.. కుదరదన్న పన్నీర్‌సెల్వం
, శుక్రవారం, 9 డిశెంబరు 2016 (12:18 IST)
పురట్చితలైవి అమ్మ జయలలిత చనిపోయి సరిగ్గా వారం రోజులు కూడా గడవలేదు. కానీ, అందరూ ఊహించినట్టుగానే అన్నాడీఎంకేలో ముసలం మొదలైంది. వాస్తవానికి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రకటించిన ఏడు రోజుల సంతాప దినాలు ముగియముందే... ముఖ్యమంత్రి పీఠం కోసం ఎత్తులు పైఎత్తులు వేస్తున్నారు. ముఖ్యంగా జయలలిత ప్రియనెచ్చెలి శశికళ  సీఎం కుర్చీని అధిరోహించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. 
 
అదేసమయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టేందుకు ఆమె ససేమిరా అంటున్నట్టు ఆ పార్టీ సీనియర్ నేతల సమాచారం. అయితే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఓ. పన్నీర్ సెల్వం మాత్రం సీఎం పగ్గాలు వదిలిపెట్టడం కుదరదని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఖంగుతున్న శశికళ పార్టీ సీనియర్లతో రేయింబవుళ్లు సుదీర్ఘ చర్చలు జరుపుతున్నట్టు ఆ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలు చెపుతున్నారు.
 
రెండు రోజుల క్రితం జరిగిన సమావేశంలో పార్టీ పగ్గాలు చేబూనేందుకు అంగీకరించిన ఆమె.. తాజాగా సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. గురువారం పోయెస్‌ గార్డెన్‌లో జరిగిన సమావేశంలో తన మనసులోని మాటను బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఆమె మాట విన్న సీనియర్లు దిగ్ర్భాంతి వ్యక్తం చేసినట్లు సమాచారం. అయినా పట్టించుకోని శశికళ పార్టీపై తనకున్న పట్టును, తన దయతో ఎమ్మెల్యేలైన వారి సంఖ్యను గణాంకాలతో సహా వివరించడంతో అవాక్కయిన సీనియర్లు.. ఏం చెప్పాలో తెలియక మిన్నకుండిపోయినట్లు సమాచారం. 
 
జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్‌కే నగర్‌ నియోజకవర్గం నుంచి తానే పోటీ చేయనున్నట్లు కూడా శశికళ స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే పన్నీర్‌ సెల్వం మాత్రం ఆమె మాటలకు అడ్డుపడినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ విషయాన్ని రెండురోజుల ముందే చెప్పి ఉండాల్సిందని, సీఎంగా తాను ప్రమాణస్వీకారం చేశాక మళ్లీ ఇలాంటి ఆలోచనలేంటంటూ నిలదీసినట్లు తెలిసింది. ఆర్‌కే నగర్‌ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే కావాలనుకుంటే తనకు అభ్యంతరం లేదని ఆయన కుండబద్దలు కొట్టడంతో శశికళ ఆగ్రహంతోనే మౌనం దాల్చినట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. 
 
ఇదే సమావేశంలో పాల్గొన్న మంత్రులు ఎడప్పాడి పళనిస్వామి, పి.తంగమణి, ఎస్‌పీ వేలుమణి, వీరమణి, మణికంఠన్ తదితరులు మిన్నకుండిపోయినట్లు సమాచారం. కాగా, తమిళనాడులో రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశాలు కనిపిస్తుండడంతో రాష్ట్ర ఇన్‌చార్జ్‌ గవర్నర్‌ సీహెచ్ విద్యాసాగర్‌రావును కేంద్రం ఢిల్లీకి పిలిపించింది. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు గురువారం ఆయన రాష్ట్రంలో పరిస్థితులను వివరించినట్లు భోగట్టా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతి భవనాల డిజైనింగ్‌లో రాజమౌళి పాత్ర?